NTV Telugu Site icon

Heropanti 2 Review: హీరోపంతి -2 (హిందీ)

Tiger

Tiger

తెలుగులో అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మించిన ‘పరుగు’ సినిమా ఆధారంగా 2014లో ‘హీరోపంతి’ తెరకెక్కింది. ఈ సినిమా ద్వారానే జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత పలు చిత్రాల ద్వారా టైగర్ తన యాక్షన్ తో జనాన్ని ఆకట్టుకున్నాడు. ‘హీరోపంతి’లో బబ్లుగా టైగర్ ష్రాఫ్, అతని ప్రియురాలు డింపీగా కృతి సనన్ నటించారు. ఆ సినిమాలో వారి ప్రేమ ఫలించడంతో కథ సుఖాంతమవుతుంది. ఆ తరువాత కథను ఆ చిత్ర నిర్మాత సాజిద్ నడియడ్వాలా తన ఊహతో తయారు చేశారు. అదే ఇప్పుడు జనం ముందు నిలచిన ‘హీరోపంతి-2’.

ఇందులో బబ్లూ రావత్ ఎవరినైనా లెక్కపెట్టని ధైర్యంతో సాగుతూ ఉంటాడు. అతనికి లైలా అనే వాడు తగులుతాడు. లైలా ఓ మెజీషియన్. డిజిటల్ ఫ్రాడ్ చేయడంలో పేరుగాంచి ఉంటాడు. అతనికి చెల్లెలు ఇనాయ అంటే ప్రాణం. ఆమెపై ఈగవాలినా తట్టుకోలేడు. లైలాను ఓ సందర్భంలో బబ్లూ ఢీ కొంటాడు. అతనిపై పంతంతో అతని చెల్లెలు ఇనాయను ప్రేమలోకి దించుతాడు. తన చెల్లి ప్రేమించిన వాడు బబ్లూ అని తెలిసిన లైలా తికమకకు గురవుతాడు. ఆ తరువాత నుంచీ బబ్లూ , లైలాను ఎలా ఎత్తుకు పైఎత్తు వేసుకుంటూ సాగారు. చివరకు ఎలా బబ్లూ, ఇనాయ ప్రేమను లైలా ఆమోదించాడు అన్నదే ఈ చిత్రకథ.

‘హీరోపంతి’కి ఈ సినిమా సీక్వెల్ అన్నారే కానీ, అందులోని పాత్రల్లో టైగర్ ష్రాఫ్, అతిథి తళుక్కుమన్న కృతి సనన్ మినహాయిస్తే అంతగా సంబంధం కనిపించదు. ‘హీరోపంతి-2’ కథను చూస్తే, మనకు తెలుగులో వచ్చిన పవన్ కళ్యాణ్ ‘బద్రి’, గోపీచంద్ ‘రణం’ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అయితే దర్శకుడు అహ్మద్ ఖాన్ ఈ కథను నడిపిన తీరు భలేగా ఆకట్టుకుంటుంది. అతనికి రజత్ అరోరా రాసిన సంభాషణలు దన్నుగా నిలిచాయి. దాంతో వినోదం కోరుకొనేవారికి ‘హీరోపంతి-2’ కావలసినంత సంతృప్తి కలిగిస్తుంది. ‘హీరోపంతి’ సినిమాకు సాజిద్-వాజిద్, మంజ్ ముసిక్, ముస్తఫా జాహిద్ తో సంగీతం రూపొందించారు నిర్మాత సాజిద్ నడియడ్వాలా. ఈ సినిమాకు ఏకంగా ఏ. ఆర్. రహమాన్ వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంచుకోవడం విశేషం! మెహబూబ్ పాటలు రాశారు. వీటిలో “దఫా కర్…” , “జల్వానుమా…”, “మిస్ హైరాన్…”, “విజిల్ బాజా టూ పాయింట్ ఓ…” పాటలు ఆకట్టుకున్నాయి. కథలో కొత్తదనం కనిపించదు. కానీ, వినోదం పంచుతుంది. ద్వితీయార్ధం సాగదీసినట్టుగా ఉంది.

‘హీరోపంతి’లో బబ్లూ లాగే ఈ సారి బబ్లూ రావత్ పాత్రలో టైగర్ ష్రాఫ్ ఇట్టే అమరిపోయాడు. ఇక తారా సుతారియా గ్లామర్ కూడా ఆకట్టుకొనేలా ఉంది. అన్నిటినీ మించి నవాజుద్దీన్ సిద్ధిఖీ తనకు లభించిన లైలా పాత్రలో వినోదాన్ని భలేగా పండించాడు. ఈ సినిమాలో నవాజ్ నటనే అమితంగా అలరిస్తుందని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్:
‘హీరోపంతి’కి సీక్వెల్ కావడం
టైగర్ ష్రాఫ్ యాక్షన్
నవాజుద్దీన్ సిద్ధిఖీ నటన
రహమాన్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:
కథలో కొత్తదనం లేకపోవడం
అంతగా ఆకట్టుకోని ద్వితీయార్ధం

రేటింగ్: 2/ 5

ట్యాగ్ లైన్: ఆకట్టుకోని హీరోపంతి!