Her: Chapter 1 Movie Review: చిలసౌ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుహాని శర్మ ఎక్కువగా లవ్ స్టోరీస్ లో నటిస్తూ వచ్చింది. ఆ మధ్య శైలేష్ కొలను హిట్ సిరీస్ లో కూడా నటించి మంచి హిట్టు సంపాదించిన ఈ భామ మొదటిసారిగా తన కెరీర్ కి భిన్నంగా ఒక క్రైమ్ థ్రిల్లర్లో లీడ్ రోల్ లో నటించింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే అది ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడం. హిట్ సిరీస్ లో ఎలా అయితే ఒక్కొక్క కేసు సాల్వ్ చేస్తూ వెళుతున్నారో అదే పంథాలో హర్ అనే సినిమా కూడా తెరకెక్కింది. తాజాగా చాప్టర్ 1 శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
సినిమా కథ
విశాల్ పసుపులేటి(వినోద్ వర్మ), స్వాతి (అభిజ్ఞ) అనే జంట హత్యకు గురి కావడంతో సినిమా మొదలవుతుంది. ఆ జంట మర్డర్ కేస్ ఇన్వేస్టిగేషన్ ఆరు నెలలు సస్పెన్షన్ తర్వాత డ్యూటీలో జాయిన్ అయిన ఏసీపీ అర్చన ప్రసాద్ (రుహానీ శర్మ)కు అప్పజెప్పడంతో ఆ కేసును సాల్వ్ చేసేందుకు ఆమె రంగంలోకి దిగుతుంది. ఆ కేసును సాల్వ్ చేసే క్రమంలో వారిద్దరిని చంపడానికి వాడిన గన్, తాను సస్పెన్షన్ కి గురవవడానికి కారణమైన గన్ కూడా ఒకటేనని గుర్తిస్తుంది. తాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన శేషాద్రి చావుకు కారణమైన కేశవ్ ఈ జంట హత్యల వెనుక ఉన్నాడని ఆమె నమ్మి ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో అర్చన ఏం చేస్తుంది? జంట హత్యలు చేసిన వారు ఎవరో అర్చన అండ్ టీం కనిపెట్టిందా? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన కేశవ్ ను పట్టుకునేందుకు ఒక ఆఫర్ వచ్చినా అర్చన ఎందుకు వద్దంది? చివరికి అర్చన జంట హత్యలను చేదించి కేశవ్ ను పట్టుకుందా లేదా అనేది సినిమా కథ.
విశ్లేషణ:
హర్ సినిమా అనేది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనే విషయం టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ అర్థం అయిపోతుంది. నిజానికి వీటికి ఉన్న సౌలభ్యం ఏమిటంటే ఎప్పుడైనా ఎలాంటి సమయంలో అయినా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరించి తీరుతారు. ఇప్పుడు హర్ సినిమా కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిజానికి ఈ సినిమాలో కథ కొత్తది ఏమీ లేదు, పోలీస్ ఆఫీసర్ అయిన వ్యక్తి ముందు సవాల్ లాంటి ఒక కేసు ఉండడం ఆ కేసును ఆసక్తికరంగా ఎలా డీల్ చేసి క్లోజ్ చేశారు అన్న పాయింట్ లోనే సాగుతుంది. అయితే వాస్తవానికి ఈ క్రైమ్ థ్రిల్లర్లు అన్నీ కూడా హీరో సెంట్రిక్ గానే ఉంటాయి. కానీ ఫర్ ఏ చేంజ్ హీరోయిన్ సెంట్రిక్ గా ఈ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కించాడు దర్శకుడు. రొటీన్ కథలే అయినా కొత్తగా చెప్పే టెక్నిక్ దర్శకుడికి తెలిసి ఉండాలి. ఒకప్పుడు ప్రేక్షకులు ఎలా ఉండేవారో తెలియదు కానీ ఇప్పుడు ప్రపంచ సినిమాలకు దగ్గర అయిపోయిన నేపథ్యంలో వారి ఊహలకు మించి కథ, కథనాలు, వారు ఎక్స్‌పెక్ట్ చేయని సర్‌ప్రైజ్‌లు, ట్విస్ట్‌లు ఉండేలా చూసుకోవాలి. అవన్నీ చక్కగా కుదిరినప్పుడే ఈ క్రైమ్ కథలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. అలా చూసుకుంటే కనుక ఈ హర్ సినిమాను ఎంగేజింగ్ గా తెరకెక్కించడంలో దర్శకుడు శ్రీధర్ స్వరగావ్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అయితే క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాను లేడీ ఓరియెంటెడ్ ఫార్మెట్ లో చెప్పాలనే ఐడియా బాగున్నా రొటీన్ కథను ఎంచుకోవడమే ఈ సినిమాకు కొంత ఇబ్బంది కలిగించే అంశం. ఇలాంటి పోలికలున్న కథలతో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు మనం చూసే ఉంటాం. ఆ విషయంలో ఏదైనా కొత్తగా ట్రై చేసి ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా గ్రిప్పింగ్ గా రాసుకుని పూర్తిస్థాయిలో రిజిస్టర్డ్ ఆర్టిస్టులను పెట్టుకుని ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ఉన్నంతలో దర్శక నిర్మాతలు ది బెస్ట్ ఇచ్చారు అనిపించేలా సినిమా మొత్తాన్ని మలిచారు. కానీ చిన్న సినిమానే అయినా కొన్ని చోట్ల సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటుల విషయానికి వస్తే ఇప్పటివరకు తన కెరియర్ లో పోషించని ఒక సీరియస్ రోల్ లో రుహాని శర్మ పూర్తిస్థాయిలో ఆకట్టుకునేలా నటించింది. లోపల ఎంత బాధ ఉన్నా ముఖం మీద కనిపించకుండా ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా ఆమె ఒకరకంగా జీవించిందని చెప్పొచ్చు. అయితే ఈ తరహా పాత్ర కొత్త కావడంతో ఆమెను త్వరగా రిజిస్టర్ చేసుకోవడం కష్టమే. ఆల్ రౌండర్ లాగా సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని నటించింది. ఇక మిగతా పాత్రలలో నటించిన వికాస్ వశిష్ట, అభిజ్ఞ తమ తమ పాత్రల పరిధి మీద ఆకట్టుకునేలా నటించారు. మిగతా వారందరూ కొత్త వారైనా తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడికి ఇది మొదటి సినిమానే అయినా ఎక్కడా అలా అనిపించదు. కొన్ని కొన్ని సీన్స్ లో డీటెయిలింగ్ అయితే భలే అబ్బుర పరుస్తుంది. స్క్రీన్ ప్లే విషయంలో కూడా మ్యాజిక్ చేసేందుకు ప్రయత్నించి చాలా వరకు సక్సెస్ అయ్యాడు. నిజానికి ఒకరకంగా ఇలాంటి కథలు మనం ముందే చూసాము కానీ తనదైన శైలిలో దర్శకుడు ఆకట్టుకునే విధంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. రొటీన్ కి భిన్నంగా కొన్ని సీన్స్, వాటిలోని డీటెయిలింగ్ కచ్చితంగా కొత్త ఫీల్ తీసుకొస్తాయి. ఇక సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని చెప్పక తప్పదు. పాటలకు పెద్దగా స్కోప్ లేదు కానీ నేపధ్య సంగీతంతో అయితే సంగీత దర్శకుడు ఆకట్టుకున్నాడు. నిజానికి థ్రిల్లర్ సినిమాలకు నేపథ్య సంగీతమే ప్రాణం. ఈ సినిమా విషయంలో కూడా అది చాలా వరకు వర్కౌట్ అయింది. ఎడిటింగ్ విషయంలో కూడా ఎడిటర్ చాలా క్రిస్పీగా ఉండేలా చూసుకున్నాడు.
బాటమ్ లైన్
థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ వీకెండ్ పర్ఫెక్ట్ వాచ్. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వెళితే ఎంజాయ్ చేస్తూ తిరిగి వస్తారు.