Ala Ninnu Cheri Movie Review: ఎన్ని సినిమాలు వస్తున్నా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను ఈరోజుకి సైతం ఆదరిస్తూనే ఉన్నారు మన తెలుగు ఆడియన్స్. అందుకే మేకర్స్ కూడా అలాంటి సినిమాలు చేయడానికి ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు హీరో హీరోయిన్లుగా ‘అలా నిన్ను చేరి’ అనే సినిమా తెరకెక్కింది. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పించగా.. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ మూవీని మారేష్ శివన్ డైరెక్ట్ చేయగా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి రివ్యూలోకి వెళ్లి చూద్దాం.
ఇలా నిన్ను చేరి కథ ఏమిటంటే
అనకాపల్లిలో చదువుకునే గణేష్ (దినేష్ తేజ్) తన ఫ్రెండ్స్‌తో కలిసి ఏమాత్రం బాధ్యత పట్టనట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు. అయితే డైరెక్టర్ అవ్వాలని సినిమా పిచ్చితో ఉండే గణేష్ కి దివ్య (పాయల్ రాధాకృష్ణ) పరిచయంతో ప్రేమకి దారి తీస్తుంది. ఈ ప్రేమ విషయం దివ్య తల్లి కంచు కనకమ్మ (ఝాన్సీ)కి తెలిసి దివ్యను ఆమెకు బావ వరసయ్యే కాళీ(శత్రు)కి ఇచ్చి పెళ్లి చేసేందుకు రెడీ అవుతుంది. ఆ టైంలో గణేష్ కావాలని దివ్య వస్తుంది. కానీ గణేష్ మాత్రం దివ్య ముఖ్యమా? కెరీర్ ముఖ్యమా? అని తేల్చుకోలేని పరిస్థితుల్లో పడతాడు. ఆ తరువాత దివ్యకు గణేష్ కి మధ్య ఏం జరిగింది? గణేష్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? దివ్య తరువాత గణేష్ జీవితంలోకి అను(హెబ్బా పటేల్) ఎందుకు వస్తుంది? గణేష్ డైరెక్టర్ అవుతాడా? అన్నదే కథ.
విశ్లేషణ
ఇప్పటికే ఎన్నో లవ్ స్టోరీలు తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ అందుకున్న దాఖలాలు ఎన్నో చూసాం ఈ సినిమాని కూడా ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు అయితే ఆ ప్రయత్నం పూర్తిగా సఫలం అయిందా అంటే అవునని చెప్పలేని పరిస్థితి. అలా నిన్ను చేరి సినిమా అంతా ప్రేమతోనే నింపేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్‌లో హీరో హీరోయిన్ల ప్రేమ ఉంటే.. రెండో హాఫ్‌లో మరో హీరోయిన్ ను ఎంట్రీ ఇప్పించి మరోసారి వన్ సైడ్ లవ్ చూపించే ప్రయత్నం చేశాడు.. ఈ మధ్యకాలంలో పీరియాడిక్ సినిమాలు ట్రెండ్ గా మారిపోయాయి ఇప్పుడు జరుగుతున్నట్టు కాకుండా పది పదిహేనేళ్ల క్రితం కొన్ని సినిమాల్లో అయితే పాతిక 30 ఏళ్ల క్రితానికి తీసుకువెళ్లిపోతున్నారు. ఈ సినిమాలో కూడా అలాగే పదిహేనేళ్ల క్రితం నాటి వాతావరణం, పరిస్థితుల్ని ఎంచుకున్న దర్శకుడు అప్పటి ప్రేమికులు కాంటాక్ట్ అవ్వాలంటే ఎంతలా తపించి పోయేవారు అనే విషయాన్ని ఎక్కువ హైలైట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడంటే వాట్సాప్ స్నాప్ చాట్ మొదలుకొని గూగుల్ పే లో కూడా చాట్ చేసుకుంటున్నారు కానీ ఒకప్పుడు ఫోన్ మాట్లాడుకోవాలన్నా అందరి వల్ల సాధ్యమయ్యేది కాదు. అలాంటి బ్యాక్ డ్రాప్లో రాసుకున్న అలా నిన్ను చేరి కథ.. ఇప్పటి తరానికి కాస్త కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువే అయినా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించే ప్రయత్నం కొంతవరకు సఫలమైంది. ఫస్ట్ హాఫ్ అంతా ప్రేమ వెంట పడే కుర్రాడు డైరెక్టర్ గా మారాలనుకుని ఆ లక్ష్యం కోసం ఎంతలా కష్టపడ్డాడు అనే విషయాన్ని ఆసక్తికరంగా చూపించారు. నిజానికి సెకండాఫ్ లో హెబ్బా పటేల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కదా డివియేట్ అవుతుంది అనుకుంటే అలా కాకుండా ఆమెతో లవ్ ట్రాక్ కొన్ని సంభాషణలు ఆసక్తికరంగా ప్రేక్షకులకు ప్రజెంట్ చేశారు. జీవితంలో ఒక్కసారి అయినా ప్రేమలో పడని వారెవరు అలా ప్రేమ రుచి చూసిన వారందరి గుండెలను తాకేలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి.
నటీనటులు
గణేష్ పాత్రలో దినేష్ తేజ్ ఒదిగిపోయాడు. తన గత సినిమాలతో పోలిస్తే నటనలో కాస్త పరిణితి కనిపించింది ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో ఒక రేంజ్ ఎమోషన్స్ పండించాడు. పాయల్ రాధాకృష్ణ, హెబ్బా పటేల్ ఇద్దరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. పాయల్‌ను హోమ్లీగా కనిపిస్తే.. హెబ్బా బోల్డ్‌గా కనిపించింది. జబర్దస్త్ మహేష్, బాషా, అనశ్వి, ఝాన్సీ, కల్పలత, శత్రు సహా మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే పాటలు అంతగా నోటెడ్ అయ్యేవి లేవు కానీ బాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఉన్నాయి. మొదటి సినిమానే అయినా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా చిత్రాన్ని నిర్మించారు.
ఫైనల్లీ అలా నిన్ను చేరి ఒక రొటీన్ లవ్ స్టోరీ, అయినా యూత్ కి కొంత వరకు కనెక్ట్ అవుతుంది.