NTV Telugu Site icon

Hanuman Review: హనుమాన్ రివ్యూ.. గూజ్ బంప్స్ గ్యారెంటీ ఫిల్మ్

Teja

Teja

Hanuman Review: విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమా తెరకెక్కింది. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయనకు జోడిగా అమృత అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, వినయ్ రాయ్, గెటప్ శ్రీను వంటివారు నటించిన ఈ సినిమా సంక్రాంతి పండగ సంధర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఒకరోజు ముందు గానే ఈ సినిమాను ప్రీమియర్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనేది మనం రివ్యూలో చూసేద్దామా?

 కథ:

ఈ సినిమా కథ అంతా అంజనాద్రి అనే ఒక అటవీప్రాంత పల్లెలో జరుగుతూ ఉంటుంది. అంజమ్మ( వరలక్ష్మీ శరత్ కుమార్), తన సోదరుడు హనుమంతు(తేజా సజ్జ)తో కలిసి అక్కడే నివసిస్తూ ఉంటుంది. అంజమ్మ కష్టపడే వ్యక్తి అయితే హనుమంతు అల్లరి చిల్లరగా తిరుగుతూ దొంగతనాలు సైతం చేస్తూ ఉంటాడు. అలాంటి హనుమంతు అదే ఊరి స్కూల్ మాస్టర్ మనవరాలు మీనాక్షి (అమృత అయ్యర్) ప్రేమలో పడతాడు. ఆమె మీద బందిపోట్లు దాడి చేయడంతో ఆమెను రక్షించబోయి అనూహ్యంగా పెద్ద జలపాతంలో పడిపోతాడు. అక్కడ ఆంజనేయస్వామి రక్త ధారతో ఏర్పడిన రుధిర మణి హనుమంతు చేతికి చేరుతుంది. ఆ మణిని సూర్యుని కాంతితో చూస్తే ఆంజనేయ స్వామి శక్తులు వస్తాయి. ఆ శక్తులతో హనుమంతు తన ఊరికి మంచి చేయాలనుకుంటాడు. అయితే చిన్ననాటి నుంచి ఎలా అయినా సూపర్ హీరో అయిపోవాలి అని కలలు కంటూ దానికోసం సొంత తల్లిదండ్రులను కూడా చంపేసిన మైఖేల్ (వినయ్ రాయ్) హనుమంతుకి ఏవో శక్తులు వచ్చాయని తెలుసుకుని అతని నుంచి ఆ శక్తులను అపహరించేందుకు వస్తాడు. ఊరికి మంచి చేయడానికి వచ్చానని అందరినీ నమ్మించి మణిని దక్కించుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అసలు ఏం జరిగింది? హనుమంతుని శక్తిని మైఖేల్ హనుమంతు నుంచి అపహరించాడా? ఆ శక్తి కేవలం ఉదయం మాత్రమే ఎందుకు పని చేస్తుంది? హనుమంతు మీనాక్షి ఇద్దరూ ప్రేమలో పడ్డారా? అసలు అంజనాద్రికి వచ్చిన సమస్య ఏమిటి? అనే వివరాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

మనకి ఇప్పటివరకు చాలామంది సూపర్ హీరోలు తెలుసు కానీ మన ఇండియాలోనే ఉన్న సూపర్ హీరో మన హనుమంతుడే. ఆయనకు లేని శక్తులా? ఆయన శక్తులు ఎలా ఉంటాయో చూపిస్తానంటూ సినిమా మొదలుపెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్క మాటలో చెప్పాలంటే దుమ్ము రేపేశాడు. కథగా చూసుకుంటే ఇదేం కొత్త కథ, అద్భుతమైన కథ అని చెప్పలేం.. కానీ, తనదైన కథనంతో స్క్రీన్ ప్లే తో ప్రశాంత్ వర్మ చేసిన మ్యాజిక్ సినిమా అంతా కనిపించింది. నిజానికి ప్రశాంత్ వర్మ ముందు నుంచి ఈ విషయం చెబుతూనే ఉన్నాడు. కానీ, ఎవరికైనా తమ ప్రాజెక్ట్ మీద ఉన్న నమ్మకంతో ఆ మాటలు చెబుతున్నారు.. అనుకున్నారే కానీ సినిమా చూసిన తర్వాత కచ్చితంగా ప్రశాంత్ వర్మ వర్క్.. వర్త్ వర్మ ..వర్త్  అన్నట్లుగా ఉంది. సూపర్ హీరో పవర్స్ అందుకోవాలని అందరికీ ఉంటుంది కానీ అల్లరి చిల్లరగా తిరిగే ఒక వ్యక్తికి హనుమంతుడి శక్తులు లభిస్తే ఎలా ఉంటుంది ? ఆ శక్తులను తన ఊరి కోసం వాడాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? జరిగిన పరిణామాలు ఏమిటి ? ఆ శక్తిని అందుకోవడం కోసం వచ్చిన వ్యక్తిని ఎలా మట్టి కరిపించాడు? లాంటి విషయాలను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో ప్రశాంత్ వర్మ పూర్తిస్థాయిలో సఫలమయ్యాడు.

నిజానికి సినిమా ఓపెనింగ్ లోనే విలన్ ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు ప్రశాంత్. సూపర్ హీరో పవర్స్ కోసం తల్లిదండ్రులను సైతం చంపేసి ఎప్పటికైనా సూపర్ హీరో అవ్వాలని ప్రయత్నించే ఒక పిచ్చి పట్టిన మనస్తత్వం కలిగిన వ్యక్తి, నిజంగా ఒక వ్యక్తికి సూపర్ పవర్స్ వచ్చాయని అర్థం చేసుకుని ఆ సూపర్ పవర్స్ దక్కించుకోవడం కోసం చేసే ప్రయత్నమే ఈ హనుమాన్. అయితే అందుకు విభీషణుడు రావడం, హనుమంతుకి విషయం అంతా చెప్పడం లాంటివి కన్విన్సింగ్ గా చెప్పడంతో ఎక్కడా బోర్ కొట్టదు, లాజిక్స్ లేవు అనిపించదు. అద్భుతాన్ని తెరమీద ఆవిష్కరించాలి అనుకోకుండా ఉన్నంతలో నిజంగానే తెరమీద అద్భుతాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసి దాదాపు సఫలమయ్యాడు ప్రశాంత్ వర్మ. సినిమా మొత్తం మీద చాలా గూజ్ బంప్స్ మూమెంట్స్ కనిపిస్తాయి. ముఖ్యంగా హనుమంతుడు రిఫరెన్స్ వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సినిమాలో చివరి ఐదు నిమిషాలు చాలా కీలకం. ఎవరూ కళ్ళు కూడా పక్కకు తిప్పుకోలేనంత విజువల్ వండర్ లాగా ప్రశాంత్ వర్మ ఈ ఐదు నిమిషాలు డిజైన్ చేసుకున్నాడు. సినిమా మొత్తానికి విఎఫ్ఎక్స్ ప్రాణం పోసింది. అంజనాద్రి అనే ఒక కల్పిత ప్రాంతాన్ని భూలోక స్వర్గం లాగా డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నట్టు అనిపించినా హనుమాన్ మాయాజాలం కచ్చితంగా తెరమీద చూసి తీరాల్సిందే అన్నట్టుగా సినిమా ఉంది. జై శ్రీ రామ్ అనే చాంటింగ్ థియేటర్ల నుంచి బయటకు వచ్చాక కూడా మిమ్మల్ని వదలదు. నార్త్ ఆడియన్స్ కి ఇంకా బాగా కనెక్ట్ అయ్యే అంశాలు సినిమాలో ఉన్నాయి.

నటీనటుల విషయానికి వస్తే హనుమంతు అనే క్యారెక్టర్ లో తేజ ఒదిగిపోయాడు. నిజానికి మనోడు చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చేశాడు, కానీ హీరోగా ఒక బరువైన పాత్ర ఎలా పోషిస్తాడా అనే అనుమానం అందరిలో ఉండి ఉండవచ్చు. కానీ తేజ సునాయాసంగా నటించేశాడు అనిపించింది. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ లలో రిస్కీ షాట్స్ కూడా చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇక అమృత అయ్యర్ పాత్ర చిన్నది అయినా ఉన్నంతలో బాగానే నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి పవర్ ఫుల్ పాత్రలో మెరిసింది. ఎలాంటి లాజిక్స్ లేకుండా సూపర్ హీరో పవర్ దక్కించుకోవాలనుకుని వ్యక్తిగా వినయ్ ఆకట్టుకున్నాడు. ఇక వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, రాకేష్ మాస్టర్ వంటి వారందరూ కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే కంప్యూటర్ గ్రాఫిక్స్ అదేనండి మనందరం గ్రాండ్ గా చెప్పుకునే విఎఫ్ఎక్స్ షాట్స్ అద్భుతంగా ఉన్నాయి. బడ్జెట్ తక్కువే అయినా క్వాలిటీలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ లేదు అన్నట్టుగా చాలా షాట్స్ అనిపించాయి. సినిమా సింహభాగం విఎఫ్ఎక్స్ మీదనే నడిచి పోయినట్టు అనిపించింది, ఇక కెమెరామెన్ పనితనం గురించి మెచ్చుకోకుండా ఉండలేం. అంజనాద్రి అందాలను, అటవీ ప్రాంతాల సోయగాలను, మైమరపించే జలపాతాలను భలే ఆకట్టుకునే విధంగా క్యాప్చర్ చేశారు. ఒక కల్పిత ప్రాంతాన్ని సృష్టించడంలో ఆర్ట్ డైరెక్టర్ తన పని సమర్థవంతంగా నిర్వర్తించాడు. క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ అయితే ఖచ్చితంగా గూజ్ బంప్స్ తెప్పిస్తుంది. మిగతా పాటలు కూడా ఆకట్టుకునేలా డిజైన్ చేసుకున్నారు కంపోజర్లు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఒక రేంజ్ లో సినిమాకి వర్కౌట్ అయింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి అనేకంటే కాస్త ఎక్కువగానే అనిపించాయి.

ట్యాగ్ లైన్: హనుమాన్ – గూజ్ బంప్స్ గ్యారెంటీ ఫిల్మ్.. ఎలాంటి అడ్డూ లేకుండా ఫ్యామిలీ అందరితో పండుగకి ఎంజాయ్ చేసేలా ఉంది.

Show comments