డిసెంబర్ మూడవ వారంలో బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ భారీ సినిమా ‘అవతార్’ సందడి చేస్తున్నప్పటికీ, టాలీవుడ్ నుంచి కొన్ని ఆసక్తికరమైన చిన్న సినిమాలు సైతం థియేటర్లలోకి వచ్చాయి. వాటిలో ముఖ్యంగా ‘డార్క్ కామెడీ’ జోనర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. నరేష్ అగస్త్య హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా యోగిబాబు, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలోచూద్దాం.
కథ
ఖమ్మం జిల్లాకు చెందిన గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య) తొందరగా డబ్బు సంపాదించాలనే ఆశతో బ్యాంక్ దోపిడీకి ప్రయత్నించి విఫలమవుతాడు. ఎలాగైనా ధనవంతుడు కావాలనే కసితో మరో వింత ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే సౌదామిని (ఫరియా అబ్దుల్లా) పరిచయం అవుతుంది.
తన స్నేహితులు మిలటరీ (రాజ్ కుమార్ కాసిరెడ్డి), చిలిపి (వంశీధర్ కోస్గి)లను కలుపుకొని ఒక ‘స్కెచ్’ వేస్తాడు పాపిరెడ్డి. శ్రీశైలం అడవుల్లో ఉన్న ఒక శవాన్ని దొంగిలించి హైదరాబాద్‌కు తీసుకురావడమే వీరి లక్ష్యం. అసలు ఒక శవం కోసం వీరు అంత సాహసం ఎందుకు చేశారు? ఆ శవానికి ఉన్న వాల్యూ ఏంటి? మధ్యలో ఉడ్రాజు (యోగిబాబు) పాత్ర ఏంటి? చివరికి వీరి ప్రయాణం ఎక్కడికి దారితీసింది అనేది తెలియాలి అంటే బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
తెలుగు తెరపై డార్క్ కామెడీ థ్రిల్లర్లు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నా, ఎందుకో ఎక్కువ సినిమాలు మన దగ్గర వర్కౌట్ కాలేదు. అయితే ఈ సినిమా దర్శకుడు మురళీ మనోహర్ ఈ కథను మలచిన తీరు కొంత భిన్నంగా ఉంది. ఎక్కువ ల్యాగ్ చేయకుండా సినిమా ప్రారంభం నుంచే ఆడియన్స్‌ను కథలోకి లాక్కెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. శవాల దొంగతనం, ఆ క్రమంలో వచ్చే ఇబ్బందులు ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్విస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ లెంగ్త్ కామెడీతో సాగిపోతూ, ప్రీ-ఇంటర్వెల్ వద్ద వచ్చే ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకండ్ హాఫ్ కి వచ్చాక సినిమా కొంచెం తడబడిన ఫీలింగ్ కలుగుతుంది. స్క్రీన్‌ప్లే నెమ్మదించడం వల్ల కథనం సాగతీతగా అనిపిస్తుంది. పురాణాలను ఈ ఆధునిక క్రైమ్ కథకు లింక్ చేయాలనే ప్రయత్నం కొన్ని చోట్ల లాజిక్‌కు అందనట్లు ఉంటుంది. అయితే, ప్రీ-క్లైమాక్స్ నుండి మళ్లీ కథ వేగం పుంజుకుని ఆకట్టుకుంటుంది. అయితే కాస్త ఊరటనిచ్చే చాలా కాలం తర్వాత బ్రహ్మానందం గారికి పూర్తి నిడివి ఉన్న పాత్ర లభించింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు పెద్ద అసెట్.
నటీనటుల విషయానికి వస్తే నరేష్ అగస్త్య పాపిరెడ్డి పాత్రలో నరేష్ ఒదిగిపోయాడు. ఒక అమాయకపు దొంగగా, డబ్బు కోసం పాకులాడే యువకుడిగా మంచి నటన కనబరిచాడు. ఫరియా అబ్దుల్లా: సౌదామిని పాత్రలో ఫరియా చురుగ్గా నటించింది. నరేష్, ఫరియా మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. సపోర్టింగ్ కాస్ట్ విషయానికి వస్తే మిలటరీగా రాజ్ కుమార్, చిలిపిగా వంశీధర్ తమ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. యోగిబాబు పాత్ర చిన్నదే అయినా ఆయన మార్క్ కామెడీ కనిపిస్తుంది. జీవన్ కూడా గొయ్యి పాత్రలో మెప్పించాడు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ అర్జున్ రాజా అడవి ప్రాంతాలను, రాత్రి పూట జరిగే సీన్లను అద్భుతంగా చిత్రీకరించారు. కృష్ణ సౌరభ్ అందించిన సంగీతం కథకు తగ్గట్టుగా ఉంది. అయితే, ఎడిటింగ్ విభాగంలో సెకండాఫ్‌పై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే సినిమా ఇంకాస్త షార్ప్‌గా ఉండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
‘గుర్రం పాపిరెడ్డి’ ఒక విభిన్నమైన ప్రయత్నం. లాజిక్ లెస్ డార్క్ కామెడీ.. కండిషన్స్ అప్లై