Guntur Kaaram Movie Review: అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, జయరాం, రఘుబాబు, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ సమర్పించారు.. ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచే భారీ అంచనాలు ఉండగా ట్రైలర్, టీజర్ సహా సినిమా నుంచి వచ్చిన అనేక పాటలు సినిమా మీద అంచనాలను అంతకంతకు పెంచుతూ వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం గుంటూరు కారం రివ్యూ లో చూద్దాం.
గుంటూరు కారం కథ:
గుంటూరులో రాయల్ సత్యం (జయరాం) తన బావమరుదులతో కలిసి మిర్చి వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కుని జైలు పాలు అవుతాడు. అదే సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య వైరా వసుంధర(రమ్యకృష్ణ) తమ పదేళ్ల కుమారుడు వెంకటరమణను వదిలేసి తండ్రి(ప్రకాష్ రాజ్) దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె మరో వివాహం చేసుకుంటుంది. తండ్రి రాజకీయ నాయకుడు కావడంతో ఆయన బాటలో నడిచి ఎమ్మెల్యేగా గెలుస్తుంది, ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి కూడా అవుతుంది. మరోపక్క పదేళ్లకే తల్లి తండ్రికి దూరమైన రమణ(మహేష్ బాబు) తన బంధువుల సంరక్షణలో ఊర మాస్ గా పెరుగుతాడు. ఇక వసుంధర రెండవ కుమారుడిని రాజకీయ నాయకుడిని చేసే నేపథ్యంలో మొదటి కుమారుడు రమణ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తనకు తల్లికి ఎలాంటి సంబంధం లేదని ఒక అగ్రిమెంట్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు వసుంధర తండ్రి. అయితే తన తల్లి అంటే ఎంతో మమకారంతో ఉండే రమణ ఆ తల్లి దూరమైతే ఏం చేశాడు? తల్లి ఏమీ సంబంధం లేదని లేఖ రాయమని అడిగితే ఎలా స్పందించాడు? తన తల్లిని చేరుకునేందుకు రమణ ఏం చేశాడు? ఎలా అయినా తన కుమార్తెకు, మొదటి మనవడికి దూరం పెంచాలని ప్రయత్నించిన వసుంధర తండ్రి చివరికి ఏం సాధించాడు? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ : సాధారణంగానే త్రివిక్రమ్ సినిమా అనగానే అందరూ ఒక అంచనాకు వచ్చేస్తారు. ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు అని అందరూ ఒక అంచనా మీద ఉంటారు. ఈ సినిమా కూడా ఆయన మార్క్ లోనే ఉంటుంది. ఒక అందమైన కుటుంబం, అనుకోకుండా వచ్చిన పెను ప్రమాదం వల్ల చల్లా చెదురువడంతో ఆ కుటుంబం మళ్లీ ఎలా కలిసింది? అనే లైన్ తో ఈ సినిమా తెరకెక్కించారు త్రివిక్రమ్. వాస్తవానికి సినిమా చూస్తున్న సమయంలో గతంలో కొన్ని సినిమాల్లో చూసిన విషయాలు చూస్తున్నాం అని అనిపించినా తనదైన మార్కుతో త్రివిక్రమ్ స్క్రీన్ పై రాసుకున్నాడు. మొదటి భాగం అంతా మహేష్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసిన ఆయన అసలు ఆయనకు తల్లి ఎందుకు దూరమైంది? అనే విషయం మీద సస్పెన్స్ మెయింటైన్ చేశాడు. సెకండ్ హాఫ్ లోకి వెళ్ళాక ఆమె వదిలేసి వెళ్లడానికి రెండు కారణాలు చూపి మరింత కన్ఫ్యూజ్ అయ్యేలా చేశాడు. అయితే క్లైమాక్స్ లో ఇచ్చిన సమాధానం మాత్రం కన్విన్సింగ్ గా ఉంది. ఒక తల్లి తన బిడ్డ మీద ఉన్న ప్రేమతో ఆ బిడ్డకే దూరంగా బతుకుతూ అతని ఒక రాజులా ఎలా పెంచింది? అనే విషయం కన్వే చేసిన విధానం బాగుంది. త్రివిక్రమ్ మార్క్ మాస్ క్యారెక్టర్ లో మహేష్ బాబు కొత్తగా కనిపించాడు. మునుపెన్నడూ లేని విధంగా ఆయన ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడేమో అన్నట్టుగా నటించాడు. అలాగే ముఖ్యంగా శ్రీ లీలతో చేసిన డ్యాన్సులు, ఆ అల్లరి నెక్స్ట్ లెవెల్ అంతే. ఎప్పటికైనా మహేష్ బాబుని ఒక మాస్ మసాలా సినిమాలో చూస్తామా అని ఎదురుచూసిన ఆయన అభిమానులందరికీ ఫుల్ మీల్స్ పెట్టేశారు త్రివిక్రమ్.
ఇక నటీనటుల విషయానికి వస్తే సినిమా మొత్తాన్ని మహేష్ బాబు తన భుజస్కంధాల నడిపించాడేమో అనేలా అన్నీ తానే చూసుకున్నాడు. మునుపెన్నడూ కనిపించని ఒక మాస్ యాంగిల్ లో మహేష్ తన అభిమానులకు ఫుల్ వీల్స్ పెట్టేశాడు. ముఖ్యంగా ఫైట్ సీన్స్ డాన్స్ లలో మహేష్ బాబు కొత్తగా కనిపించాడు. శ్రీ లీల సహా మీనాక్షి చౌదరి పాత్ర కూడా చిన్నదే కానీ శ్రీ లీల అందాల ఆరబోత విషయంలో మాత్రం మీనాక్షి కంటే ఒక అడుగు ముందుకే ఉంది. ఇక తనదైన కామెడీతో వెన్నెల కిషోర్ ఆకట్టుకున్నాడు. ఉన్నంతలో మురళీ శర్మ, ప్రకాష్ రాజ్, జయరాం, ఈశ్వరి రావు, రమ్యకృష్ణ వంటి వారికి నటించే స్కోప్ దక్కింది. ఇక మిగతా పాత్రధారులు కేవలం తమ పాత్రల వరకే ఒక పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా ప్లస్ అయింది. మ్యూజిక్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దాదాపుగా విడుదలైన అన్ని పాటలు మంచి హిట్లయ్యాయి. విజువల్ గా కూడా సాంగ్స్ బాగున్నాయి. ఆర్ఆర్ లో థమన్ మార్క్ మాస్ అయింది. ఇక మహేష్ బాబు శ్రీ లీలతో చేసిన డాన్స్ లు అన్నిటికీ కొరియోగ్రాఫర్లు ఎవరో కానీ ఒక రేంజ్ లో కొరియోగ్రఫీ చేశారు. ఇక సినిమా నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి.
ట్యాగ్ లైన్: ఈ గుంటూరు కారం గురూజీ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్