Guardians of the Galaxy Volume 3: ప్రపంచ వ్యాప్తంగా ఆబాలగోపాలాన్నీ మార్వెల్ మూవీస్ అలరిస్తున్నాయి. మార్వెల్ స్టూడియోస్ గతంలో జేమ్స్ గన్ దర్శకత్వంలో నిర్మించిన ‘గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ’ రెండు భాగాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. 2014లో మొదటి భాగం, 2017లో రెండో భాగం జనం ముందుకు వచ్చాయి. వీటి సీక్వెల్ గా ‘గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ వేల్యూమ్ 3’ రూపొందింది. ‘గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ’ సిరీస్ లో ఇదే చివరిది. ఇంతకు ముందు రెండు భాగాలు చూసినవారు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకులను పలకరించింది.
ఇంతకూ ఈ ‘గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ’ మూడో భాగం కథ ఏమిటంటే – నోవేర్ అనే చోట గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ తమ హెడ్ క్వార్టర్స్ ను పునర్నిర్మిస్తారు. వారందరూ సెట్ అయిన రోజు రాత్రి ఆ క్వార్టర్స్ పై ఆడమ్ ఎటాక్ చేస్తాడు. సూపర్ పవర్స్ తో రూపొందిన ఆడమ్ ను అతని తల్లి ఎంప్రెస్ ఆయేషా వారిపైకి ప్రయోగిస్తుంది. గతంలో రాకెట్ ను తీసుకు పోయి ఉంటారు గార్డియన్స్. అందువల్ల గార్డియన్స్ పై ప్రతీకారచర్య తీర్చుకోవడం కోసం ఆడమ్ వస్తాడు. గార్డియన్స్ పై ఆడమ్ చేసే పోరాటంలో రాకెట్ తీవ్రంగా గాయపడుతుంది. తరువాత పీటర్ క్విల్ వచ్చి గాయపడిన వారందరినీ యాక్టివేట్ చేస్తాడు. తరువాత గార్డియన్స్ కౌంటర్ ఎర్త్ ను సందర్శిస్తారు. ఆ తరువాత ఏమైంది అన్నదే మిగతా కథ.
ఇంతకు ముందు రెండు భాగాలనూ ఆకట్టుకొనేలా మలచిన డైరెక్టర్ జేమ్స్ గన్ ఈ మూడో భాగాన్ని మరింత ఆకర్షణీయంగా రూపొందించారు. వింతరూపాలలోని జంతువులు, గార్డియన్స్ చేసే వింత చేష్టలూ అన్నీ ఆకట్టుకుంటాయి. ఓ నాటి మెగాస్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ ‘రాకీ బల్బోవా’గా కనిపించడమూ అలరిస్తుంది. ఆసక్తికరమైన సన్నివేశాలు, నవ్వులు పూయించే మాటలు జనాన్ని మురిపిస్తాయి. మొదటి రెండు భాగాలు చూడని వారికి ఆరంభంలో కొంత కంగాళీగా అనిపించినా, తరువాత వారిని సైతం ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. జాన్ మర్ఫీ సందర్భోచితమైన సంగీతం మురిపిస్తుంది. హెన్రీ బ్రహమ్ కెమెరా పనితనం ఆద్యంతం కనువిందు చేస్తుంది. ఈ సినిమా చూసిన వారికి మొదటి రెండు భాగాలూ చూడాలన్న కోరిక కలగక మానదు.
ప్లస్ పాయింట్స్:
+ ‘గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ’ ఫైనల్ కావడం
+ ఆకట్టుకొనే సినిమాటోగ్రఫి
+ సందర్భోచితమైన సంగీతం
+ జేమ్స్ గన్ దర్శకత్వం
మైనస్ పాయింట్స్:
– మొదటి రెండు చూడని వారికి కొంత తికమక
– ముందే ఊహించేలావున్న కొన్ని సీన్స్
రేటింగ్: 2.75/5
ట్యాగ్ లైన్: ‘గార్డియన్స్’ గారడి!