NTV Telugu Site icon

Bheemaa Movie Review: భీమా మూవీ రివ్యూ …

గోపీచంద్ హీరోగా నటించిన తాజా చిత్రం భీమా. నిజానికి గోపీచంద్ ఒక సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. అలాంటి ఆయన ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని భీమ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాకి కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వం వహించగా మాళవిక శర్మ ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటించారు. నాజర్, నరేష్, వెన్నెల కిషోర్, రోహిణి, సప్తగిరి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం నాడు మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

భీమా కథ:
కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహేంద్రగిరి అనే ప్రాంతంలో భవాని(ముఖేష్ తివారి) ఒక ప్రైవేటు ప్రభుత్వాన్నే నడుపుతూ ఉంటాడు. తాను చేసేది చట్టం, చెప్పేది న్యాయం అన్నట్లు అంతా నడిపిస్తూ ఉంటాడు. ట్యాంకర్ల ద్వారా రహస్యంగా ఏవో తరలిస్తున్న క్రమంలో ఆ ట్యాంకర్ల జోలికి వచ్చిన ఎస్సై(కమల్ కామరాజు) ను చంపి ప్రమాదంగా సృష్టిస్తారు. ఆ తరువాత మహేంద్రగిరికి కొత్త ఎస్సైగా భీమా(గోపీచంద్) వస్తాడు. అయితే స్వతహాగా రౌడి స్వభావంగాల భీమా వచ్చి రాగానే భవానీతో గొడవ పెట్టుకుంటాడు. నెలరోజులు టైం ఇస్తాను వచ్చి సరెండర్ అవ్వమని వార్నింగ్ ఇస్తాడు. మరి భవాని ఆటలను భీమా అరికట్టగలిగాడా? భవానీ నడిపే ట్యాంకర్ల వెనుక దాగున్న రహస్యం ఏంటి? అసలు భవాని వెనక ఉండి నడిపించేది ఎవరు? అసలు భీమా గతం ఏంటి? మహేంద్రగిరిలో ఉన్న పురాతన శివాలయానికి పరశురామ క్షేత్రం అని ఎందుకు పేరు వచ్చింది? భీమకు ఆ పరశురామ క్షేత్రానికి సంబంధం ఏంటి? అసలు ఆ ఆలయం మూతపడటానికి కారణం ఏంటి? లాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

భీమా చిత్రం ఎంతో ఆసక్తికరంగా మొదలవుతుంది. మరణించిన తర్వాత దశదిన కర్మ వరకు మనిషి ఆత్మ భూమి మీదే ఉంటుంది. ఆ మరణించిన వ్యక్తి యొక్క రక్త సంబంధీకులు మహేంద్రగిరిలోని శివాలయంలో మనస్ఫూర్తిగా పూజ చేసి పిలిస్తే.. ఆత్మ వారి శరీరంలోకి ప్రవేశించి చివరి కోరిక తీర్చుకుంటుంది. అయితే ఆ కోరిక ధర్మ సమ్మతంగా ఉండాలి. ఈ పాయింట్ తో సినిమా మొదలవ్వడంతో దర్శకుడు ఏదో కొత్తగా చెప్పబోతున్నాడు అనే ఆసక్తి కలుగుతుంది. కానీ కాసేపటికే సినిమా ట్రాక్ తప్పి రొటీన్ కమర్షియల్ సినిమాలా మారిపోతుంది. హీరో ఇంట్రడక్షన్ ఫైట్, ఆ వెంటనే టైటిల్ సాంగ్, ఆ తర్వాత ఏమాత్రం ఆకట్టుకునేలా లేని లవ్ ట్రాక్ తో ప్రేక్షకులు సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో గోపీచంద్ తన గత పోలీస్ సినిమాలకు ఈ సినిమాకు ఏ మాత్రం పోలిక ఉండదని గట్టిగా చెప్పుకొచ్చాడు. అది నిజమే, ఎందుకంటే ఈ సినిమాలో రాసుకున్న సోషియో ఫాంటసీ ఎలిమెంట్ కథను కొంత భిన్నంగా చూపే ప్రయత్నం. నిజానికి పురాణాలను, దేవుళ్లను ముడిపెడుతూ ఈ మధ్య రాసుకుంటున్న అనేక మైథాలజీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. బహుశా అదే ఉద్దేశంతో ఈ భీమా కథను కూడా సిద్ధం చేసుకున్నారేమో అనిపిస్తుంది. పరశు రాముడిని, ఒక శివుడి ఆలయాన్ని ముడిపెడుతూ కథ రాసుకొన్న దర్శకుడు.. అయితే కథ అంతా దాని చుట్టూ తిప్పితే బాగోదు అనుకున్నాడో ఏమో వెంటనే కొన్ని రొటీన్ సన్నివేశాలు, కథకు అడ్డులా అనిపించే లవ్ ట్రాక్, తో సినిమా నింపే ప్రయత్నం చేశాడు. హీరో ఇంట్రడక్షన్ మొదలు ప్రీ క్లైమాక్స్ వరకు రెగ్యులర్, రొటీన్ కమర్షియల్ చిత్రాలను గుర్తు చేసే ‘భీమా’ క్లైమాక్స్ మాత్రం అదరగొట్టింది. సినిమా ప్రారంభం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా ప్రారంభం అయిన 15 నిమిషాల వరకు హీరో ఎంట్రీ ఉండదు అసలు హీరో కోసం ఎదురుచూస్తున్న భావన కూడా లేకుండానే హీరో ఎంట్రీ ఇప్పించేశారు. అయితే తరువాత భీమా, విద్య లవ్ ట్రాక్ అలాగే రామా, పారి లవ్ ట్రాక్ కూడా ఆసక్తికరంగా లేదు. వెన్నెల కిషోర్ అండ్ బ్యాచ్, సప్తగిరి ట్రాక్స్ ఉన్నాయి కానీ కామెడీ వర్కౌట్ కాలేదు. ఈ లవ్ ట్రాక్స్ తో పాటు, కామెడీ సీన్లు బాగా రాసుకుని ఉంటే సినిమా వేరే లెవ్వల్లో ఉండేది.

ఇక నటీనటుల విషయానికి వద్దాం గోపీచంద్ రెండు భిన్నమైన పాత్రలలో కనిపించాడు. ఒకటి తనకు బాగా అలవాటైన పోలీస్ అధికారి పాత్ర అయితే మరొకటి మాత్రం ఎవరూ ఊహించని ప్యాకేజీ. దాన్ని రివీల్ చేయడం భావ్యం కాదు కాబట్టి ప్రస్తావించడం లేదు. కానీ ఆయన గత సినిమాలతో పోల్చుకుంటే లుక్స్ తో పాటు ఫిజిక్ మెయింటినెన్స్ కూడా బాగుంది. మాళవిక శర్మ కేవలం అందాల ఆరబోతకే అన్నట్టుగా ఉంది.. ప్రియ భవాని శంకర్ పాత్ర చాలా చిన్నది. ముఖేష్ తివారి గ్యాప్ తర్వాత తెలుగు తెరపై కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే ఆయన చూసిన వెంటనే జాకీ ష్రాఫ్ ఏమో అని అనుమాన పడని వారు ఉండరు. ఇక రవీంద్ర వర్మగా పాత్రలో నాజర్ రెచ్చిపోయి నటించాడు. రఘుబాబు, ‘వెన్నెల’ కిశోర్, సీనియర్ నరేష్, సప్తగిరి, ‘చమ్మక్’ చంద్ర, సరయు. భద్రం సహా కొందరు కమెడియన్లు ఉన్నా సీనియర్ నరేష్ మినహా మిగతా వాళ్లకు సరైన కామెడీ సీన్లు పడ లేదు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అందించిన పాటల కంటే నేపథ్య సంగీతం ‘భీమా’కి మంచి ప్లస్ పాయింట్. స్వామి జె గౌడ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కెకె రాధామోహన్ నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి.

ఓవరాల్ గా భీమా గోపీచంద్ గత చిత్రాలతో పోలిస్తే ఒక కొత్త అటెంప్ట్, దర్శకుడు తీసుకున్న పాయింట్ కొత్తది. యాక్షన్ లవర్స్ కి నచ్చే సినిమా ఇది.

Show comments