Game On Movie Review: రథం అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు గీతానంద్. ఇక ఇప్పుడు ఆయన రెండవ సినిమాగా గేమ్ ఆన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన సోదరుడు దయానంద్ దర్శకుడిగా పరిచయమవుతూ ఉండగా చిన్ననాటి స్నేహితుడు కస్తూరి రవి నిర్మాతగా మారారు. రియల్ లైఫ్ గేమ్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు మేకర్లు. ఈ సినిమా టీజర్ తో పాటు ట్రైలర్ కూడా సినిమా మీద ఆసక్తి పెంచడంతో ఎలా ఉండబోతుందా అని అందరిలోనూ కాస్త అంచనాలు పెరిగాయి. 90 ఎంఎల్ హీరోయిన్ నేహా సోలంకి హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
గేమ్ ఆన్ కథ విషయానికి వస్తే
ఒక గేమింగ్ కంపెనీలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పని చేస్తూ ఉంటాడు గౌతం సిద్ధార్థ్ (గీతానంద్). ఎవరూ లేని అనాధ అయిన గౌతం తన స్నేహితుడు(కిరీటి దామరాజు), తన ప్రేయసి(వాసంతి కృష్ణన్)లే లోకంగా బతుకుతూ ఉంటాడు. అయితే వారిద్దరూ కలిసి అతనికి వెన్నుపోటు పొడవడంతో ఇక చావే శరణ్యం అనుకుని చచ్చేందుకు వెళ్తాడు. అలాంటి సమయంలో ఒక ఈగని చంపితే లక్ష రూపాయలు డబ్బులు వస్తాయని ఫోన్ రావడంతో ముందు లైట్ తీసుకున్నా సరే ఈగను అయినా చంపలేకపోయాను అని గిల్టుతో చావడం ఎందుకని దాన్ని చంపితే లక్ష రూపాయలు వస్తాయి. దీంతో అతనికి ఆ గేమ్ మీద ఆసక్తి పెరుగుతుంది. అలా ఒక్కొక్క టాస్క్ ఆడుతూ డబ్బులు సంపాదిస్తూ ముందుకు వెళతాడు గౌతం. చివరికి హత్యలు చేయించే వరకు ఈ గేమ్ వెళ్లడంతో గౌతమ్ ఏం చేశాడు? అనాధగా అందరికీ పరిచయమైన గౌతమ్ తన తాత శుభలేఖ సుధాకర్, తల్లి మధుబాలకు ఎందుకు దూరమయ్యాడు? అసలు గౌతమ్ చేత టాస్కులు ఆడిస్తూ డబ్బులు ఇస్తున్నది ఎవరు? టాస్కులు పేరుతో హత్యలు చేయించడానికి కూడా ఎందుకు ప్రయత్నాలు చేశారు? అతని జీవితంలోకి వచ్చిన తార వల్లభనేని వల్ల గౌతమ్ తెలుసుకున్నదేంటి? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: ఈ సినిమా మొదలైనప్పటి నుంచి హీరో ఒక చేతకాని వ్యక్తిలాగా కనిపిస్తూ ఉంటాడు. అంటే అండర్ డాగ్ లాగా కనిపిస్తూ ఇక చావే శరణ్యం అనుకుంటున్న సమయంలో ఒక చిన్న ఈగని చంపితే లక్ష రూపాయలు రావడంతో ఆసక్తికరంగా సినిమా మొదలవుతుంది. నిజానికి చావడానికి సిద్ధమైన హీరో మీద సింపతీ క్రియేట్ అవ్వడం కంటే అతన్ని చచ్చేంతలా ప్రేరేపించిన వారి మీద సినిమా చూస్తున్న వారికి కోపం తెప్పించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. అంతలా కథలో లీనం చేస్తూ ముందుకు తీసుకు వెళ్లిన దర్శకుడు ఒక్కొక్క టాస్క్ ఆడిస్తూ మరింత కథ మీద సినిమా మీద ఆసక్తి కలిగించే ప్రయత్నం చేశాడు. అయితే కొన్ని టాస్కుల వరకు బాగానే ఉంటుందిm కానీ తర్వాత టాస్కులు ఏమి జరుగుతున్నాయి అనే విషయం మీద కూడా క్లారిటీ మిస్ అయినట్లు అనిపించింది. అయితే ముందు నుంచి ఈగను చంపితే లక్ష రూపాయలు వేయడం అతనికి కోపం ఉన్న వ్యక్తుల మీద దాడి చేస్తే మూడు లక్షల వేయటం ఇలా ఇది కాస్త లాజికల్గా అనిపించక పోయినా క్లైమాక్స్ లో మాత్రం ఒక్కొక్క విషయాన్ని రివీల్ చేస్తూ సినిమా లాజికల్గా ముగించాడు దర్శకుడు. మొదటి భాగంలో ఎలాంటి విషయాలు రివీల్ అవ్వకుండా చూసుకున్న ఆయన హీరో హీరోయిన్ల మధ్య ట్రాక్ తోటి యూత్ ఆడియన్స్ ని కాస్త ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే సినిమా ఎప్పుడైతే సెకండ్ హాఫ్ కి షిఫ్ట్ అవుతుందో అప్పటి నుంచి కథలో వేగం పెరిగి అసలు ఈ గేమ్ ఆడించేది ఎవరు? గేమ్ ఆడించడానికి కారణం ఏమిటి? అంత డబ్బులు ఈ గేమ్ లో ఎందుకు ఇస్తున్నారు? లాంటి విషయాలను ఆసక్తికరంగా కన్విన్సింగ్ గా చూపించారు. అయితే అటెంప్ట్ కొత్తగా అనిపించినా స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా వర్క్ చేసి ఉండాల్సింది.
నటీనటుల విషయానికి వస్తే హీరో గీతానంద్ రెండో సినిమాకి నటనలో పరిణితి కనిపించేలా నటించాడు. ఉన్న ఆరు యాక్షన్ బ్లాక్స్ లో కూడా తనదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. చేతకాని ఒక యువకుడిగా అదే సమయంలో ఆత్మవిశ్వాసం పెరిగిన యువకుడిగా కూడా రెండు భిన్నమైన పార్శ్యాలు ఉన్న పాత్రలో మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ నేహా సోలంకి అటు గ్లామర్ ఒలకబోస్తూనే తన పాత్రలో నటనను కూడా మిస్ అవ్వకుండా చూసుకుంది. వాసంతి పాత్ర చిన్నది అయినా ఆమె కూడా గ్లామర్ డాల్ లాగా అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇక ఆదిత్య మీనన్ విలన్ గా డామినేటింగ్ క్యారెక్టర్ లో కనిపించాడు. తనదైన టిపికల్ వాయిస్ తో ఆకట్టుకున్నాడు. శుభలేఖ సుధాకర్, మధుబాల వంటి వాళ్ళ అనుభవం స్క్రీన్ మీద కనిపించింది. ఇక టెక్నికల్ విషయానికొస్తే మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ సినిమాకి యాప్ట్ అనిపించింది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి, ఆ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు అనిపించింది.
ఫైనల్ గా గేమ్ ఆన్.. ప్రతీ ఒక్కరూ ఆడితే బాగుండు అనిపించేలా చేసిన ఒక కొత్త అటెంప్ట్