కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ ‘నా సామిరంగ’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఆమె తాజాగా నటించిన సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ ‘గత వైభవం’. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడలో నవంబర్ లోనే రిలీజ్ అయినా తెలుగులో జనవరి 1న రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
గత వైభవం కథ:
ఆర్టికల్చర్ స్టూడెంట్ అయిన ఆధునిక (ఆషిక రంగనాథ్)కు పెయింటింగ్స్ వేయడం అలవాటు. తన ఊహల్లో మెదిలే ఒక వ్యక్తి చిత్రాన్ని గీసి సోషల్ మీడియాలో పెట్టడంతో సరిగ్గా అదే పోలికలతో ఉన్న పురాతన్ (దుశ్యంత్) ఆమెకు తారసపడతాడు. ఒక విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో నడిపే పురాతన్, మొదట ఆధునిక దగ్గరకి తప్పుడు ఉద్దేశంతో వెళ్లినా కానీ, అతనికి తన గత జన్మల గురించి ఆధునిక చెప్పే నిజాలు షాకిస్తాయి. అసలు ఆధునికకు అతని గత జన్మల గురించి ఎలా తెలుసు? వందల ఏళ్ల క్రితం వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి? పురాతన్ తండ్రి, ప్రముఖ సైక్రియాటిస్ట్ కృష్ణకు ఈ కథతో ఉన్న సంబంధం ఏంటి? అన్నదే మిగతా సినిమా.
విశ్లేషణ:
నిజానికి పునర్జన్మల నేపథ్యంలో వచ్చే కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ‘గత వైభవం’లో కూడా అలాంటి ఒక బలమైన పాయింట్ ఉంది. ముఖ్యంగా వందల ఏళ్ల క్రితం ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండానే ఉత్తరాల ద్వారా ప్రేమించుకునే ‘మంగళ-చెన్నయ్య’ పాత్రల కథ చాలా బాగుంది. కర్ణాటక సంప్రదాయ క్రీడ ‘కంబళ’ నేపథ్యంలో సాగే ఆ పీరియాడిక్ ఎపిసోడ్ సినిమాకు సోల్. అయితే, ఇంత మంచి కథాంశాన్ని తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు సుని తడబడ్డారు. బలమైన ఎమోషన్ పండించాల్సిన చోట స్లో నేరేషన్, అసందర్భ సన్నివేశాలు ప్రేక్షకుడిని అసహనానికి గురిచేస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా పురాతన్ క్యారెక్టరైజేషన్ మీద పెట్టిన శ్రద్ధ, ప్రధాన కథలోకి వెళ్లడానికి తీసుకున్న సమయం సినిమాకు మైనస్. గ్రాఫిక్స్ పరంగా కూడా సినిమా యావరేజ్ అనే ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే ఈ సినిమాకు ఆషికానే ప్రధాన బలం. దేవకన్యగా, ఆధునికగా, మంగళగా మూడు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆమె అద్భుతంగా నటించింది. తన గ్లామర్‌తోనే కాకుండా నటనతోనూ ఆకట్టుకుంది. అయితే కొత్త నటుడైనప్పటికీ దుశ్యంత్ తన వంతు ప్రయత్నం చేశాడు. పీరియాడిక్ రోల్‌లో కంటే మోడ్రన్ లుక్‌లో బాగున్నాడు. కానీ, ఇంకాస్త నటన విషయంలో షైన్ అవ్వాల్సి ఉంది. ఇక మిగిలిన నటులు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతిక విభాగం పనితీరు విషయానికి వస్తే సినిమాలో ఫోటోగ్రఫీ బాగుంది. పాత గ్రామీణ వాతావరణాన్ని కెమెరాలో బంధించిన తీరు ప్రశంసనీయం. సంగీతం అక్కడక్కడా పర్లేదు అనిపించినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది, ముఖ్యంగా సాగదీత సీన్లను కత్తెరించవచ్చు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్లీ ‘గత వైభవం’ ఒక మంచి కాన్సెప్ట్ ఉన్నా ఎగ్జిక్యూషన్ ఫెయిల్ కావడంతో ఈ ‘గతం’ వైభవంగా లేదు.