NTV Telugu Site icon

Dasara Movie Review: దసరా రివ్యూ

Dasara Movie Review

Dasara Movie Review

Dasara Movie Review: నేచురల్ స్టార్ నాని నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘దసరా’! అతని గత చిత్రాలు రెండు, మూడు భాషల్లో విడుదలైతే ఇప్పుడీ ‘దసరా’ ఏకంగా ఫైవ్ లాంగ్వేజెస్ లో జనం ముందుకొచ్చింది. తెలంగాణలోని వీర్లపల్లి గ్రామంలో పాతికేళ్ళ క్రితం జరిగిన కొన్ని సంఘటనలను బేస్ చేసుకుని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ మూవీని తెరకెక్కించాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ఎలా ఉందో చూద్దాం.

ఇది 1995లో మొదలయ్యే కథ. అప్పట్లో ఎన్టీయార్ అధికారంలోకి వచ్చి రావడంతోనే మద్య నిషేధాన్ని ప్రకటించారు. వీర్లపల్లి గ్రామంలోని జనాలకు గొంతులోకి మందు దిగకపోతే పిచ్చెక్కిపోతుంది. దాంతో లోపాయికారిగా సిల్క్ బార్ ను నిర్వహించే వారికే సర్పంచ్ పదవి అనే షరతు పెడతారు. అలా శివన్న (సముతిర ఖని) సర్పంచ్ గా గెలుస్తాడు. రాజన్న (సాయికుమార్) ఓడిపోతాడు. అదే గ్రామానికి చెందిన ధరణి (నాని), సూరి బాబు (దీక్షిత్ శెట్టి), వెన్నెల (కీర్తి సురేశ్‌) బాల్య స్నేహితులు. చిన్నప్పటి నుండి వెన్నల అంటే ధరణికి ఇష్టం. అయితే సూరిబాబుతో స్నేహం అంటే ప్రాణం. సూరి కూడా ధరణిని ప్రేమిస్తున్నాడని తెలిసి తన ప్రేమను చంపుకుంటాడు. గూడ్స్ బండిలో బొగ్గును దొంగిలించి, తాగి తందనాలు ఆడుతూ ధరణి, సూరి బాబు జీవితాన్ని గడిపేస్తుంటే… వెన్నెల అంగన్ వాడి టీచర్ గా పని చేస్తుంటుంది. ఆ గ్రామం నడిబొడ్డులోని సిల్క్ బార్ కేంద్రంగా ఈ ముగ్గురి జీవితాలు ఊహించని మలుపు తిరుగుతాయి. స్నేహం, ప్రేమలకు ప్రాధాన్యమిచ్చే ధరణి జీవితంలోకి పగ, ప్రతీకారాలు ఎలా ప్రవేశించాయి? తన వారికి జరిగిన అన్యాయానికి అతను ఎలాంటి ముగింపు పలికాడు? అనేదే మిగతా కథ.

ఇది దాదాపు మూడు దశాబ్దాల క్రితం నాటి కథ కావడంతో అప్పటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దీనిని రాసుకున్నాడు. మద్య నిషేధం, దాని ఆధారంగా సాగే గ్రామ రాజకీయాలు, కుల వివక్ష, దొరల కామదాహం… వీటన్నింటినీ ఈ సినిమాలో ఆయా సందర్భాలలో చూపించే ప్రయత్నం చేశాడు. స్నేహం కోసం ప్రేమను త్యాగం చేసే కథలు, తన స్నేహితుడికి అన్యాయం జరిగితే జీవితాన్ని పణంగా పెట్టే హీరో స్టోరీస్ మనకు కొత్త కాదు. పైగా ఈ సినిమా చూస్తున్నంత సేపు మొన్నటి ‘రంగస్థలం’, నిన్నటి ‘పుష్ప’ కళ్ల ముందు మెదులుతూ ఉంటాయి. ఇక చాలా సన్నివేశాలు పాత వాసలే వేస్తాయి. మరి ఈ సినిమా ప్రత్యేకత ఏమిటీ సహజత్వం! ఈ కథను తెరకెక్కించడానికి దర్శకుడు, కథా దర్శకుడు పెద్ద తపస్సు చేశారనిపిస్తుంది. ఆ కారణంగా మనం సినిమా ఆరంభమైన కొద్ది నిమిషాలకే వీర్లపల్లి గ్రామంలోకి వెళ్ళిపోతాం. అందులోని పాత్రలు మన మధ్య జరుగుతున్నట్టుగానే అనిపిస్తాయి. ఆ పాత్రలు అంతగా మనల్ని కథలో లీనమయ్యేలా చేస్తాయి.

ఫస్ట్ హాఫ్ లో ధరణి, సూరిబాబు, వెన్నెల మధ్య స్నేహం, ప్రేమతో సాగిపోతుంది. అలాంటి సమయంలో ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఇంటర్వెల్ బ్లాక్ ను ప్లాన్ చేసి ఆడియెన్స్ ను షాక్ కు గురిచేశాడు దర్శకుడు. ఇక దానికి కొనసాగింపుగా, సెకండ్ హాఫ్ లో హీరో రివేంజ్ పై దృష్టి పెట్టాడు. కథలో బోలెడన్ని మలుపులు, సెంటిమెంట్ సీన్స్ ఉన్నా… వాటితో ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేరు. ఏ సన్నివేశంకు అది బాగానే ఉంటుంది తప్పితే ఆ ఫీల్ ను క్యారీ ఫార్వర్డ్ చేయదు.

నేచురల్ స్టార్ అనే బిరుదుకు తగ్గట్టు నాని చాలా సహజంగా ధరణి పాత్రను పోషించాడు. ఇది అతని ఇమేజ్ కు పూర్తి భిన్నమైన పాత్ర కావడంతో మింగుడు పడటానికి కాస్తంత టైమ్ పడుతుంది. ఒక నటుడికి ఎలాంటి పాత్ర అయినా చేయగలనని నిరూపించుకోవాలనే కోరిక ఉంటుంది. దానిని నాని ఈ సినిమాతో తీర్చుకున్నట్టు అయ్యింది. అయితే వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్‌ ను చూడటం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏ రకంగానూ ఆమె ఆ పాత్రకు న్యాయం చేయలేకపోయింది. పైగా మునుపటి ఛార్మ్ కూడా లేదు. నాని స్నేహితుడిగా దీక్షిత్ శెట్టి బాగా నటించాడు. ప్రతినాయకుడిగా మలయాళీ నటుడు షైన్ టామ్ చాకో అస్సలు నప్పలేదు. సముతిర ఖనికి ఎత్తు పళ్ళు పెట్టి కాస్తంత కొత్తగా తెర మీద చూపించారు తప్పితే, ఆయన్ని సరిగా ఉపయోగించుకోలేదు. ఝాన్సీ, పూర్ణ, సాయికుమార్, సురభి ప్రభావతి, రవితేజ నన్నిమాల తదితరులు తమ పాత్రలకు బాగానే న్యాయం చేకూర్చారు. సాంకేతిక నిపుణుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ సత్యన్ గురించి. కెమెరాపనితనం ఆసమ్. సంతోష్ నారాయణ్ ట్యూన్స్ లో ఒకటి రెండు మాత్రామే బాగున్నాయి. మిగిలినవి సో… సో… గా ఉన్నాయి. హీరో ఎలివేషన్ సీన్స్ లో అతని నేపథ్య సంగీతం పూర్తిగా తేలిపోయింది. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. కానీ మోతాదుకు మించిన హింసను తెర మీద చూపించారు. నిర్మాణ విలువలు బాగుండం, నాని సినిమా వచ్చి చాలా కాలం కావడంతో ఓపెనింగ్స్ కు ఢోకా లేదు. నాని అభిమానులకు ఈ సినిమా నచ్చుతుందేమో కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ తరహా కథతో ఎంతవరకూ కనెక్ట్ అవుతారనేది సందేహమే!

రేటింగ్ : 2.75/5

ప్లస్ పాయింట్స్
నాని నటన
సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువలు

మైనెస్ పాయింట్స్
పేలవమైన కథ
ఆకట్టుకోని సెంటిమెంట్
అతిగా యాక్షన్ సీన్స్

ట్యాగ్ లైన్: సరదా తీరింది!