NTV Telugu Site icon

Darlings Review: డార్లింగ్స్ రివ్యూ (హిందీ)

Darlings Movie Review

Darlings Movie Review

Darlings Movie Review: కొన్ని సినిమాలపై జరిగే నెగిటివ్ పబ్లిసిటీ.. దాని మీద మరింత మంది ఫోకస్ పెట్టడానికి కారణం అవుతుంది. సో.. అలాంటి పబ్లిసిటీ సినిమాకు ఒక్కోసారి మేలే చేస్తుంది! అలియాభట్ తాజా చిత్రం ‘డార్లింగ్స్’ విషయంలో అదే జరిగింది. ఈ సినిమా శుక్రవారం నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దానికి ఒకట్రొండు రోజుల ముందు ‘బాయ్ కాట్ అలియాభట్’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ మూవీ ద్వారా అలియాభట్… మగవాళ్ళ మీద జరిగే హింసను ప్రమోట్ చేస్తోందనేది నెటిజన్ల ఆరోపణ. నిజమే… సినిమా లాంటి పవర్ ఫుల్ మీడియం ద్వారా ఇటు మహిళలపైనా, అటు పురుషుల పైనా.. ఎవరి మీద జరిగే హింసనైనా.. సపోర్ట్ చేయకూడదు. అయితే.. అలా చూపించే హింసకు ఓ బలమైన కారణం ఉన్నప్పుడు, దాన్ని అంగీకరించాల్సిందే. ‘డార్లింగ్స్’ మూవీ చూసిన తర్వాత డెబ్యూ డైరెక్టర్ జస్మిత్ కె రీన్ ప్రతిభను, తొలిసారి ఈ మూవీ కోసం ప్రొడ్యూసర్ అవతారం ఎత్తిన అలియాభట్ ను అప్రిషియేట్ చేయకుండా ఉండలేం.

కథ విషయానికి వస్తే…. బద్రున్నిసా (అలియాభట్), హమ్జా అబ్దుల్ షేక్ (విజయ్ వర్మ) ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు. జీవితం పట్ల ఏ మాత్రం నిబద్ధత లేని హమ్జా రైల్వే టీసీగా పనిచేస్తుంటాడు. పెళ్ళైన మూడేళ్ళకే అతను మద్యానికి బానిస అవుతాడు. రాత్రి అయితే చాలు తాగి, భార్య బద్రును చావబాదుతాడు. పొద్దున్నే మత్తు దిగిపోయిన తర్వాత ఆమెను బ్రతిమలాడుతాడు. తండ్రి లేని బద్రుకు అన్నీ తల్లి షంషున్నీసా (షఫాలీ షా) నే! ఓ పాట అపార్ట్ మెంట్ లో ఇటు తల్లి, అటు కూతురు ఎదురుబొదురు ఫ్లాట్స్ లో నివసిస్తుంటారు. కళ్ళముందే కూతురును అల్లుడు కొడుతుంటే షంషూ చూడలేకపోతుంది. భర్తకు విడాకులిచ్చేసి, తన దగ్గరకు వచ్చేయమని కూతురును పోరు తుంటుంది. కానీ భర్తంటే మనసులో ఎక్కడో తెలియని ప్రేమ ఉన్న బద్రు ఆ పని చేయలేకపోతుంది. అయితే భూదేవి అంత సహనం ఉన్న బ్రదు మనసు సైతం ఓ దారుణమైన సంఘటనతో విరిగిపోతుంది. దాంతో భర్తకు తానేమిటో చూపించాలనుకుంటుంది. తల్లి సాయంతో బద్రు ఏం చేసింది? ఫ్యామిలీ ఫ్రెండ్ జుల్ఫీ (రోషన్ మాథ్యూ) వీళ్ళకు ఏ విధంగా సహాయపడ్డాడు? భార్యలోని ఆవేశాన్ని గ్రహించి అయినా హమ్జా మారాడా? లేదా? అనేది మిగతా కథ.

భార్య మనసెరిగి భర్త మసులు కోవాలి, ఆమెను హద్దు మీరి హింసిస్తే పర్యావసానం చాలా దారుణంగా ఉంటుందని దర్శకురాలు జస్మిత్ కె రీన్ ‘డార్లింగ్స్ ‘ ద్వారా చెప్పాలనుకున్నారు. గతంలో దీనికి పూర్తి భిన్నంగా భార్యను హింసించే భర్తల కథలు అటు హిందీలోనూ, ఇటు తెలుగులోనూ కూడా కొన్ని వచ్చాయి. అయితే భార్య ఆగ్రహాన్ని పతాక సన్నివేశంలో ఠక్కున చూపించి, శుభం కార్డు వేసిన సినిమాలే అందులో ఎక్కువ. ఈ బ్లాక్ కామెడీ డ్రామాలో ద్వితీయార్థం నుండే భర్త మీద భార్య పగ తీర్చుకోవడమనే దాన్ని చూపించారు. మద్యానికి బానిసైన వ్యక్తి తేలు వంటి వాడని, అలాంటి మనిషిలో మార్పు అంత త్వరగా రాదని బద్రు తల్లి నమ్ముతుంది. అందుకు ఉదాహరణగా ఓ కథ కూడా చెబుతుంది. అయితే… తల్లి మాటను ధిక్కరించి, బద్రు తన నైజాన్ని వదులుకోకపోవడంతో క్లయిమాక్స్ లో ఆమె పాత్ర బాగా ఎలివేట్ అయ్యింది. అలానే… హమ్జా చేసిన పాపానికి తగిన శిక్ష దేవుడే వేశాడన్నట్టుగా దర్శకురాలు చూపించడం బాగుంది.

‘డార్లింగ్స్’ మూవీ మొత్తం నాలుగు పాత్రల చుట్టూనే సాగుతుంది. అందులో ప్రధానమైనది బద్రుగా నటించిన అలియాభట్ పాత్ర. మధ్య తరగతి ముస్లిం మహిళ పాత్రలో అలియా చక్కగా ఒదిగిపోయింది. ప్రేమించిన వాడి బలహీనతలను సైతం ఓర్పుగా భరించే మహిళ రెబల్ అయితే ఎలా ఉంటుందో ద్వితీయార్థంలో చూపించింది. ఇటీవల వచ్చిన ‘ట్రిపుల్ ఆర్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అలియా భట్ ఆ మధ్య ‘గంగూభాయి కఠియావాడీ’లో టైటిల్ రోల్ అత్యద్భుతంగా పోషించి మెప్పించింది. ఈ రెండు సినిమాలకు పూర్తి భిన్నమైన పాత్రను ఇందులో చేసింది. ఆమె తల్లిగా ‘సత్య’ ఫేమ్ షఫాలీ షా నటించింది. భర్తను కోల్పోయిన మహిళగా, కూతురు పట్ల విపరీతమైన ప్రేమ ఉండే తల్లిగా చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది. అలియా భట్ పాత్ర కంటే… ఈమె పాత్రలోనే ఎక్కువ షేడ్స్ ఉండటం విశేషం. ఇక హైదరాబాద్ లో పుట్టిన విజయ్ వర్మను తెలుగు వాళ్ళు సరిగా ఉపయోగించుకోవడం లేదు. పూణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్న విజయ్ వర్మ కు బాలీవుడ్ లోనూ, వెబ్ సీరిస్ ల లోనూ మంచి ఆఫర్స్ వస్తున్నాయి. తెలుగులో నాని ‘ఎంసీఎ’ మూవీలో విజయ్ వర్మ విలన్ పాత్రను అత్యద్భుతంగా పోషించాడు. ఈ సినిమాలోనూ హమ్జా పాత్రకు ప్రాణం పోశాడు. తల్లీకూతుళ్ళకు అండగా నిలిచే జుల్ఫీ పాత్రను రోషన్ మాథ్యు సునాయాసంగా చేశాడు. ఇతర ప్రధాన పాత్రలను ‘కహానీ ఘర్ ఘర్ కీ’ ఫేమ్ కిరణ్ కర్మార్కర్, విజయ్ మౌర్య, రాజేశ్‌ శర్మ, సంతోష్‌ జువేకర్ తదితరులు పోషించారు. ప్రశాంత్ పిళ్ళై నేపథ్య సంగీతం బాగుంది. ఇందులో మూడు నేపథ్య గీతాలు ఉన్నాయి కానీ అవి లేకపోయినా బాగానే ఉండేది. అనీల్ మెహతా తన కెమెరాపనితనంతో మన కళ్ళముందే ఈ కథ జరుగుతున్నట్టుగానూ చూపించాడు. విజయ్ మౌర్య, పర్వేజ్ షేక్, జస్మిత్ కె రీన్ రాసిన సంభాషణలూ హాస్యస్పోరకంగా ఉన్నాయి.

రెండు గంటల పద్నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో కొన్ని రిపీట్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి. అలానే స్క్రీన్ ప్లే సాదాసీదాగా సాగడంతో మధ్య మధ్యలో మూవీ గ్రాఫ్ పడిపోయింది. బట్… బ్లాక్ కామెడీని ఇష్టపడే వారికి ‘డార్లింగ్స్’ నచ్చే ఆస్కారం ఉంది. దిగువ మధ్య తరగతి ముస్లిం కుటుంబాలలో జరిగే గృహహింస మీద దర్శకురాలు దృష్టి పెట్టడం, దాన్ని అలియాభట్, గౌరీఖాన్, గౌరవ్ వర్మ సినిమాగా నిర్మించడం అభినందించదగ్గది.

ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన
ఎంచుకున్న కథావస్తువు
ఆకట్టుకునే సంభాషణలు

మైనస్ పాయింట్స్:
నిదానంగా సాగే ప్రథమార్ధం
ఆకట్టుకోని కథనం

రేటింగ్: 2.75 / 5

ట్యాగ్ లైన్: ‘డార్లింగ్స్’ తిరగబడితే..!!