తమిళ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న ధనుష్ హీరోగా అక్కడ వైలెంట్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో నెమ్మదిగా ఆసక్తి పెరుగుతూ వెళ్ళింది. ఎందుకంటే తెలుగు నుంచి మన హీరో సందీప్ కిషన్, కన్నడ నుంచి అక్కడి స్టార్ హీరో శివా రాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ పెద్ద హిట్గా నిలవడమే కాదు మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. రెండు వారాల తర్వాత ఈ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగులో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం పదండి
కథ:
1930ల కాలంలో ఈ సినిమా ఒక పీరియాడిక్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. బ్రిటిష్ పాలనలో ఒక లోకల్ లో ఉండే రాజు సంస్థానం కింద ఉన్న తండాలో అగ్నీశ్వరుడు(ధనుష్) తన తల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. ఊరిలో తమ జాతి వారికి సరైన గౌరవం లేదని తెల్లదొరల సైన్యంలో చేరితే ఆ గౌరవం లభిస్తుందని భావిస్తూ ఉంటాడు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న తన అన్న శివయ్య (శివరాజ్ కుమార్) మాటలను ఎదిరించి మరి సైన్యంలో చేరతాడు. సైన్యంలో చేరిన మొదటి రోజే తన చేత తన ఊరి వాళ్ళనే చంపించాడు అనే ఉద్దేశంతో పై అధికారిని చంపేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. ఒక దొంగల గుంపుకి సాయపడిన అతను ఎందుకు దొంగగా మారతాడు? అసలు అగ్నీశ్వరుడు కెప్టెన్ మిల్లర్ ఎలా అయ్యాడు? తమ సంస్థానానికి చెందిన రాజు తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న విగ్రహాన్ని ఎందుకు దొంగిలించాడు? మిల్లర్ గవర్నర్ కొడుకుని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఈ క్రమంలో తన తోటి సైనికుడైన రఫీ(సందీప్ కిషన్) ఎలా సహాయపడ్డాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: తమిళ సినిమాలు కొంత ఫాలో అయ్యే వారికి అరుణ్ మాదేశ్వరన్ నికి సపరేట్ ఇమేజ్ ఉందనే విషయం కొంత క్లారిటీ ఉంటుంది. ఆయనకున్న స్పెషాలిటీ ఏమిటంటే హార్డ్ హిట్టింగ్ అనిపించే కథలను ఒక రేంజ్ వైలెన్స్ తో చూపించి కుండ బద్దలు కొట్టినట్లు చెబుతూ ఉంటాడు. ఈ కెప్టెన్ మిల్లర్ కూడా అలాంటి కోవలోనే తెరకెక్కించాడు. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం పట్టింది. ఫస్ట్ హాఫ్ అంతా ధనుష్ పాత్రను ఎస్టాబ్లిష్ చేయడంలోనే సరిపోయింది. ఇంటర్వెల్ కి కానీ అసలు కథ మొదలవదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎందుకో పాత్రలను పరిచయం చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ లో పాత్రలన్నింటి పరిచయాలు చేసి వారి క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం మీద క్లారిటీ ఇచ్చేశాడు. ధనుష్ ఆర్మీ నుంచి పారిపోయాక దొంగల ముఠాతో చేతులు కలపడం, ఆ తర్వాత వారితో కలిసి ఎన్నో దోపిడీలు చేయడం వంటి విషయాలు ఆసక్తికరంగా ఉన్నా అప్పటివరకు నెమ్మదిగా సాగిన కథ అక్కడ నుంచి కాస్త వేగం పుంజుకుంటుంది. ధనుష్ దొంగతనం చేసేందుకు తెల్ల దొరల కాన్వాయ్ ను చేజ్ చేసే సీన్ తో సినిమాలో ఆసక్తి పెరుగుతుంది. ఆ దొంగతనం పూర్తి చేసిన తర్వాత నుంచి సినిమా చాలా వేగంగా నడిచినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా తెల్లదొరల ఆర్మీకి కెప్టెన్ మిల్లర్ టీంకి మధ్య జరిగే కాల్పుల సన్నివేశాలు భలే ఆసక్తికరంగా పిస్తాయి. అయితే అరుణ్ గత సినిమాలతో పోల్చి చూస్తే కనుక వైలెన్స్ కొంచెం తక్కువగానే ఉన్నట్టు అనిపించింది. అయితే ఈ మధ్యకాలంలో తమిళంలో ఎక్కువగా అణిచివేతకు గురైన వారి కథలే చెబుతున్నారనే వాదన ఒకటి తెరమీదకి వచ్చింది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆ అనిచవేతకు గురైన వారు ఎంత మనోవేదన అనుభవించి ఉంటారు అనే విషయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు అనిపించింది. అంతే కాదు సాధారణంగా అప్పుడప్పుడు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. బ్రిటిష్ ఆర్మీలో మన ఇండియన్ సిపాయిలు కూడా పనిచేసేవారు, ఇండియన్స్ మీద దాష్టికం చేస్తున్న బ్రిటిషర్లకు వీరు ఎందుకు పనిచేసే వారు అని చాలామందికి ఆలోచన వచ్చే ఉండవచ్చు. కానీ ఈ సినిమా చూస్తే ధనుష్ పాత్ర పలికిన డైలాగులు చూస్తే అలా చేయడంలో తప్పేముంది అనిపించేలా అరుణ్ మాదేశ్వరన్ కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోయేలా రాసుకున్నారు. సినిమా అద్భుతం అనలేం కానీ భలే ఆసక్తికరంగా ఉందే అనిపించేలా చేశారు. కానీ ఇది తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఇలా అణచివేతకు గురైన సినిమాలు గతంలో తెలుగులో ఏ ఒక్కటి హిట్లుగా నిలిచిన దాఖలాలు లేవు. దానికి తోడు తెలుగు సబ్ టైటిల్స్ వేసే విషయంలో చాలా జాగ్రత్త వహించారు. కనీసం టైటిల్స్ విషయంలో కూడా ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదనిపించింది. మక్కీకి మక్కి గూగుల్ ట్రాన్స్లేషన్ వాడినట్లు ఈజీగా అర్థమయిపోతుంది. తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పుడు కాస్త మంచి టెక్నికల్ టీంని పెట్టుకుని ఉండాల్సింది. సబ్ టైటిల్స్ కూడా దారుణంగా తేలిపోవడంతో తెలుగు రిలీజ్ ని ఇంత తేలిగ్గా తీసుకున్నారా అనే అనుమానం కలుగుతుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే ధనుష్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి.. గతంలో కూడా ఇలాంటి పాత్రలు చేశాడు. ఇక్కడ లుక్కు మార్చి గడ్డం, పిలకలాంటి వాటితో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. భానుమతి పాత్రకు ప్రియాంక అరుల్ మోహన్ న్యాయం చేసే ప్రయత్నం చేసింది కానీ ఎందుకో ఆమె స్థానంలో ఇంకెవరైనా ఉంటే బాగుండేమో అనిపించింది. రఫీ పాత్రలో సందీప్ కిషన్ పాత్ర నిడివి తక్కువే కానీ తెలుగు వారికి మాత్రం కనెక్ట్ అయ్యేలా అనిపించాడు. ఇక ఎప్పటిలాగే శివయ్య అనే పాత్రలో కనిపించిన శివ రాజ్ కుమార్ కనిపించింది కొద్దిసేపైనా బలే ఉన్నాడు రా అని అన్ని భాషల ఆడియన్స్ అనిపించేలాంటి పాత్రలో నటించాడు. నివేదిత సతీష్ తెలుగు వారికి కొంచెం కొత్తనే కానీ ఆమెకు యాక్షన్ తో కూడిన నటన కనబరిచే పాత్ర దొరికింది. జయప్రకాష్, జాన్ కొక్కెన్ వంటి వారు తమ తమ పాత్రలు పరిధి మేరకు నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చివర్లో రెండో భాగానికి లీడ్ ఇస్తున్నట్లు అనిపించింది కానీ అది ఎంతవరకు వాడుకుంటారో చూడాలి. టెక్నికల్ టీం విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ అందించిన పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు కానీ అతను ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం భలే బాక్సులు బద్దలు కొట్టేసింది. సినిమాటోగ్రఫీ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నట్టు అనిపించింది. సినిమా అంతా పీరియాడిక్ కాబట్టి అప్పటి కలర్ టోన్స్ వాడేందుకు ప్రయత్నించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ గా కెప్టెన్ మిల్లర్ ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి నచ్చవచ్చు. తెలుగువారికి ఎంతవరకు కనెక్ట్ అవుతుందనే విషయం చెప్పలేం.