బ్రహ్మ ఆనందం అనే పేరుతో ఒక సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే ఈ సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఆయన కొడుకు రాజా గౌతమ్ మనవడి పాత్రలో నటిస్తున్నాడని ప్రకటించారు. వెన్నెల కిషోర్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో సినిమా మీద అంచనాలను పెంచింది. దానికి తోడు మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హ్యాట్రిక్ హిట్ల తరువాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ ‘బ్రహ్మా ఆనందం’ అనే సినిమాని నిర్మించడంతో సినిమా ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 14న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం పదండి
బ్రహ్మ ఆనందం కథ:
బ్రహ్మానందం(రాజా గౌతమ్) ఒక థియేటర్ ఆర్టిస్ట్. ఎప్పటికైనా సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతని స్నేహితుడు గురు(వెన్నెల కిషోర్) డాక్టర్ అతని సంపాదనతోనే బ్రహ్మానందం కాలం వెళ్ళదీస్తూ ఉంటాడు. చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోయిన బ్రహ్మానందం తన బాబాయ్(ప్రభాకర్) కుమార్తే రాశి (దివిజ)తో మాత్రం తనకి సంబంధించిన అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాడు.. ఒకరోజు దివిజ వృద్ధాశ్రమంలో ఉన్న తాత ఆనంద మూర్తి (బ్రహ్మానందం) కలవాలనుకుంటున్నాడని అన్నను అక్కడికి తీసుకు వెళుతుంది. అయినా పెద్దగా ఆసక్తి చూపకుండా బయటకు వచ్చేస్తాడు బ్రహ్మానందం. సరిగ్గా ఇదే సమయంలో తన లైఫ్ మొత్తాన్ని మార్చేసేలా ఢిల్లీలో నాటకం వేయాలంటే ఆరు లక్షల ఖర్చు అవుతుందని బ్రహ్మానందానికి తెలుస్తుంది. ఆ 6 లక్షల కోసం వేట మొదలు పెడితే ఎక్కడా దొరకవు. అయితే తనకు ఉన్న ఆరెకరాలను నీ పేరు మీద రాస్తానంటూ అతన్ని ఒక ఊరికి తీసుకువెళతాడు తాత మూర్తి. ఆ ఊరికి వెళ్ళాక జరిగిన పరిణామాలు ఏమిటి? బ్రహ్మానందానికి ఆస్తి దక్కిందా? ఢిల్లీలో నాటకం ఆడడానికి తగిన మొత్తాన్ని సిద్ధం చేయగలిగాడా? ఈ కథలో జ్యోతి(తాళ్లూరి రామేశ్వరి) ప్రమేయం ఏంటి? అలాగే బ్రహ్మానందం కోసం తన జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆరు లక్షలు ఇవ్వడానికి సిద్ధమైన తార(ప్రియా వడ్లమాని) అతన్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది? చివరికి ఏం జరిగింది అనే విషయం తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
బ్రహ్మానందం సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడడానికి ముఖ్యమైన కారణం నిజజీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం రాజయ్య గౌతం ఈ సినిమాలో తాత మనవడిగా ఎలా కనిపించబోతున్నారా అనేది. ఆ విషయాన్ని చాలా కన్వెన్సింగ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో కొత్త దర్శకుడు నిఖిల్ సక్సెస్ అయ్యాడు. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటి వరకు ఒక రకమైన కన్ఫ్యూజన్ ఫీలింగ్ కలుగుతుంది కానీ కథ నడుస్తున్న కొద్ది పాత్రల పరిచయం, నేపథ్యం సినిమా మీద ఆసక్తి కలిగిస్తుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్, రాజా గౌతమ్ మధ్య రాసుకున్న ట్రాక్స్ బాగా పేలాయి. కథలోకి బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చిన తర్వాత వేగం పెరుగుతుంది. ఒక ఊరికి వెళ్లడం, ఆ ఊరి నుంచి ఇక ఆస్తి అమ్మేసి వెనక్కి రావడమే అనుకుంటున్నా సమయంలో బ్రహ్మానందం ఇచ్చిన ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద ఆసక్తి రేకెత్తిస్తుంది. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత ఒకపక్క కామెడీతో నవ్విస్తూనే మరోపక్క ఎమోషన్తో ఏడిపించాలని దర్శకుడు భావించినట్లు ఉన్నాడు. కానీ అటు కామెడీ ఇరికించిన ఫీలింగ్ కలిగితే ఎమోషన్స్ కూడా వర్కౌట్ కాలేదు. అవి కూడా ఎందుకో సాగ తీసిన ఫీలింగ్ కలుగుతుంది.. నిజానికి సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే కానీ దాన్ని అందంగా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే విషయంలో మాత్రం టీం బాగా తడబడింది. వృద్ధాప్యంలో తోడు ఉండాలి అని చెప్పే పాయింట్ బాగానే ఉంది కానీ దానికి తగ్గ ఎమోషన్ అటాచ్ చేయడంలో ఎక్కడో మిస్సయ్యారు. ఇక ఒకపక్క ఎమోషన్స్ చూపించాలని అనుకుంటూనే అక్కడే కామెడీ చేయాలని అనుకోవడం కూడా ఎందుకో లాజికల్ గా కరెక్ట్ అనిపించలేదు. అయితే సెకండ్ హాఫ్ లో పండించాల్సిన ఎమోషన్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే మాత్రం సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదేమో అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ కూడా లాజిక్స్ కి దూరంగా ప్రేక్షకులను ఆనందింప చేస్తూ బయటికి పంపించాలి అనేలా ఉంది. ఆ విషయంలో కూడా కేర్ తీసుకుని ఉండాల్సింది.
ఇక నటీనటుల విషయానికి వస్తే బ్రహ్మానందం నటన గురించి మనం చెప్పాల్సిందేముంది. ఇందులో మూర్తి అనే పాత్రలో ఆయన నటించలేదు జీవించాడు ఆయన కుమారుడు రాజా గౌతమ్ మనవడి పాత్రలో ఇమిడిపోయాడు. అతని గత చిత్రాలతో పోలిస్తే నటనలో చాలా పరిణీతి కనిపించింది. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్ అసలైన హీరోనా అనిపించేలా మనోడు వచ్చిన ప్రతిసారి థియేటర్లలో అరుపులు కేకలు వినిపించాయి. వెన్నెల కిషోర్ తో చెప్పించిన వన్ లైనర్స్ కూడా అద్భుతంగా పేలాయి. ఇక సినిమాలో నటించిన ప్రియా వడ్లమాని, ఆకాంక్ష, దివిజ, రాజీవ్ కనకాల, సంపత్ అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఇక సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే రైటింగ్ సినిమాకి బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా డైలాగ్స్ తో పాటు కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంది. నిజానికి ఇది నిఖిల్ కి మొదటి సినిమా అయినా సరే ఎక్కడ ఆ ఫీలింగ్ కలగకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఒక మంచి సినిమాని తీసుకొచ్చే ప్రయత్నం అభినందనీయం. అయితే ఒకపక్క కామెడీ మరోపక్క ఎమోషన్ ఇలా రెండు పడవల మీద కాలు వేయకుండా ఏదో ఒకదానిమీద ఫోకస్ చేసి ఉంటే వాగుండేమో అనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే చాలా వరకు ఫ్రేమ్స్ ని అందంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అంతగా గుర్తు పెట్టుకో దగిన పాటలు లేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. నిడివి విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ బ్రహ్మ ఆనందం బ్రహ్మాండం కాదు కానీ…