NTV Telugu Site icon

Baby Movie Review: బేబీ రివ్యూ

Baby Movie Review

Baby Movie Review

Baby 2023 Movie Review Telugu: విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బేబీ. మారుతి, ఎస్కేఎన్ కలిసి నిర్మించిన ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మంచి బజ్ ఏర్పరచుకుంది. ఆ తర్వాత సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్, టీజర్ ఇలా ఒకటేమిటి? దాదాపు అన్నీ సినిమా మీద అంచనాలు పెంచుతూ వెళ్లాయి. ఇక ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో భారీ హైప్ తో రిలీజ్ అయింది ఈ సినిమా. వాస్తవానికి శుక్రవారం నాడే రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ ఒకరోజు ముందుగానే తెలుగు రాష్ట్రాలలో పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.

బేబీ సినిమా కథ ఏమిటంటే?
ఆనంద్ (ఆనంద్ దేవరకొండ), వైష్ణవి (వైష్ణవి చైతన్య) హైదరాబాదులో ఒక బస్తీలో ఎదురెదురు ఇళ్లలో నివసిస్తూ ఉంటారు. వైష్ణవి పదో తరగతి చదువుతున్నప్పుడే ఆనంద్ మీద మనసు పారేసుకుంటుంది. ముందు ఆనంద్ పట్టించుకోడు కానీ నెమ్మదిగా అతనికి కూడా వైష్ణవి మీద ప్రేమ కలుగుతుంది. అయితే ఆనంద్ టెన్త్ ఫెయిల్ అయ్యి ఆటో తోలుకుంటూ ఉంటే వైష్ణవి మాత్రం ఎలాగోలా ఇంటర్ పూర్తి చేసి బీటెక్ లో జాయిన్ అవుతుంది. కాలేజీకి చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది అని భావించి ప్రతిరోజు తాను ఆటోలో ఆమెను కాలేజీలో డ్రాప్ చేయడమే కాదు తమ మధ్య దూరం పెరగకూడదు అని చెప్పి తన ఆటో తాకట్టు పెట్టి ఇద్దరికీ చెరొక స్మార్ట్ ఫోన్ కొంటాడు ఆనంద్. అయితే కాలేజీలో చేరిన వైష్ణవి అక్కడి స్నేహితుల ప్రోద్బలంతో అందం మీద శ్రద్ధ పెరగడమే కాదు వస్తువుల మీద కూడా ఆకర్షణ పెరుగుతుంది. నెమ్మదిగా ఆనంద్- వైష్ణవి మధ్య దూరం పెరగడమే కాదు వీరిద్దరి మధ్య విరాజ్(విరాజ్ అశ్విన్) అనే మూడో వ్యక్తి కూడా వస్తాడు. ఆనంద్ మీద ప్రేమ ఉందని చెబుతూనే విరాజ్ కి కూడా అట్రాక్ట్ అవుతుంది వైష్ణవి. రోజుకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తూ తాను కోరుకుంటున్నట్టుగా తనని ప్రేమిస్తున్న విరాజ్ తో స్నేహం అనుకుంటూనే వైష్ణవి అతనికి దగ్గరవుతుంది. ఒకపక్క తాను ప్రేమిస్తున్న ఆనంద్ మరోపక్క తనను ప్రేమిస్తున్న విరాజ్ మధ్యలో ఆమె నలిగిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. మరి వీరిద్దరిలో వైష్ణవి ఎవరికి దగ్గరయింది? విరాజ్ ను వైష్ణవి దూరం పెట్టిందా? ఆనంద్ తో వైష్ణవి కలిసిందా? చివరికి వీరిద్దరిలో వైష్ణవి ఎవరికి దక్కింది? అనేదే సినిమా కథ.

విశ్లేషణ
బేబీ సినిమా కథ కొత్తదేమీ కాదు మనం నిత్యం వార్తల్లో వినే చూసే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ రోజుల్లో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు, వార్తల్లో వింటున్న విషయాలను ఆధారంగా చేసుకుని ఈ కథ రాసుకున్నాడేమో సాయి రాజేష్ అనిపిస్తుంది. గతంలో హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలు చేసిన సాయిరాజేషే ఈ కథ రాసుకున్నాడా అనే ఆశ్చర్యం అయితే కలవక మానదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజుల్లో యువత మానసిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎంత ఈజీగా ప్రేమలో పడుతున్నారు? ప్రేమికులు ఉన్నా సరే ఇతర వ్యక్తుల మాటల గారడీకి ఎలా పడిపోతున్నారు? అందరూ వేరు నేను వేరు అనుకుంటూనే అందరిలా ఎలా బురిడీ కొడుతున్నారు అనే విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఎవరికి వారు నేను తప్పు చేయడం లేదు అనుకుంటూనే తప్పులు చేస్తున్న వైనాన్ని చాలా క్లియర్ గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్లు హీరోలు అని ముందు నుంచి ప్రచారం జరిగింది కానీ సినిమా మొత్తానికి హీరో వైష్ణవి అని చెప్పాలి. అందుకే టైటిల్ కూడా ఆమెను ఫోకస్ చేస్తూ బేబీ అని పెట్టినట్లు అనిపిస్తుంది. నిజానికి తెలుగు ప్రేక్షకులకు ట్రయాంగిల్ లవ్ స్టోరీ లు కొత్త కాదు కానీ ఈ సినిమా కాస్త భిన్నంగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కాస్త కన్విన్సింగ్ అనిపించలేదు కానీ యూత్ కి మాత్రం బాగా కనెక్ట్ అయ్యే మూవీగా నిలిచిపోతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మొత్తంగా జీవితం మీద దృష్టి పెట్టండి అమ్మాయిలతో పెట్టుకుంటే చితికి పోవడం తప్ప సాధించేదేమీ లేదు అని కుండ బద్దలు కొట్టినట్టు సాయి రాజేష్ చెప్పినట్లు అనిపించింది. సినిమా యూనిట్ ముందు నుంచి చెబుతున్నట్టుగానే ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి ఫస్ట్ లవ్ స్టోరీ గుర్తు వస్తుంది అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. బూతులు గట్టిగానే వాడారు కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడగలిగే సినిమా మాత్రం కాదు కేవలం స్నేహితులతో మాత్రమే చూడొచ్చు. కానీ ప్రేమలో ఇప్పుడున్నా, గతంలో ఉన్నా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా.

ఎవరు ఎలా చేశారు అంటే?
ఆనంద్ పాత్రలో ఆనంద్ దేవరకొండ సరిగ్గా సూట్ అయ్యాడు. గత సినిమాలతో పోల్చుకుంటే ఆనంద నటనలో పరిణితి కనిపించింది. ఎలాంటి కల్మషం లేకుండా తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్ళే వ్యక్తిగా ఆనంద్ దేవరకొండ జీవించాడు. వైష్ణవి పాత్రకు వైష్ణవి చైతన్య సరిగా న్యాయం చేసింది. అసలు బేబీ అనే పాత్ర ఆమె కోసమే రాసుకున్నారా అన్నట్టుగా నటనలో తనదైన శైలిలో నటించింది. నిజానికి ఈ సినిమాకి హీరో ఆమెనే అని ముందే చెప్పుకున్నాం అదేవిధంగా ఆమె సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాల మీద నడిపించింది. ఒకపక్క ఆనంద్ ను ప్రేమిస్తూనే విరాజ్ మీద ఆకర్షణతో అతని మాటలకు పొంగిపోయే సాధారణ బస్తీ అమ్మాయిగా ఆమె నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్గా ఇది ఆమెకు మొదటి సినిమానే అయినా అసలు ఏమాత్రం తడబడకుండా ఔరా అనిపించేలా నటించింది. విరాజ్ అశ్విన్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. నాగబాబు, వైవా హర్ష, సాత్విక్ ఆనంద్, కిరాక్ సీత, లిరీష కూనపరెడ్డి వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆయా పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నీషియన్ల విషయానికి వస్తే దర్శకుడిగా సాయి రాజేష్ తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే స్లో నేరేషన్ ఒకటి ఇబ్బందికరమనిపించినా డైలాగ్స్ విషయంలో కానీ స్క్రీన్ ప్లే విషయంలో కానీ చాలా కేర్ తీసుకున్నాడు. చాలా వరకు డైలాగులు ఒకవైపు నవ్వు తెప్పిస్తూనే మరోవైపు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ముఖ్యంగా వైష్ణవి చైతన్య అమ్మాయిలు గుండెల మీద కొడతారు అని చెప్పే డైలాగ్ కానీ ఆటో వెనుక రాయించిన కొటేషన్లు కానీ ఆలోచింపజేస్తున్నాయి. ఇక సినిమాకి స్పెషల్ అసెట్ అంటే మ్యూజిక్ అనే చెప్పాలి. విజయ్ బుల్గానిన్ అందించిన మ్యూజిక్ సినిమాని మరో లెవలకు తీసుకువెళ్ళింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కొన్ని పాటలు కానీ పూర్తిస్థాయిలో సినిమాని బాగా ఎలివేట్ చేశాయి. నటీనటుల పర్ఫామెన్స్ కు తగినట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది. ల్ రెడ్డి కెమెరా పనితనం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. చాలా వరకు మంచి మంచి ఫ్రేమ్స్ తో ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. అయితే సినిమాకి నిడివి ఒక మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎడిటింగ్ టేబుల్ మీద మరికొంత వర్క్ చేసి ఉండాల్సింది అనిపిస్తుంది, అలా చేసి ఉంటే సినిమా మరో లెవల్ లో ఉండి ఉండవచ్చునేమో?

ప్లస్ పాయింట్లు
వైష్ణవి చైతన్య
ఇంటర్వెల్ బ్యాంగ్
డైలాగులు
మ్యూజిక్

మైనస్ పాయింట్స్
నిడివి
కొన్ని బోల్డ్ పద ప్రయోగాలు

బాటమ్ లైన్
బేబీ మూవీ : ఓన్లీ ఫర్ యూత్, ప్రేమించిన వారు ప్రేమలో ఉన్నవారు కచ్చితంగా చూసి తీరాల్సిన సినిమా.

Show comments