సీనియర్ నటుడు బ్రహ్మాజీ, బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన తాజా చిత్రం బాపు. తెలంగాణ ప్రాంతంలో జరిగిన కథగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దయాకర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమని, ధన్య బాలకృష్ణ, మణి, రచ్చ రవి, అభిత వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ కంటే ఒక్కరోజు కాదు రెండు రోజులు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులును ఏ మేరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ
తెలంగాణలోని జమ్మికుంట ప్రాంతంలో మల్లన్న(బ్రహ్మాజీ) ఒక రైతు. అప్పటికే అప్పుల పాలైన మల్లన్న ఈసారి చేతికి వచ్చే పత్తి పంటతో ఆ అప్పులన్నీ తీర్చాలని అనుకుంటున్న సమయంలో ఆ పంట కొడుకు(అభి) చేతకానితనం వల్ల దూరం అవుతుంది. ఒక పక్క అప్పుల వాళ్ళ బాధలు, మరోపక్క పంట నాశనం అవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడతాడు. తాను మరణిస్తే ప్రభుత్వం ఇచ్చే బీమా డబ్బులు కుటుంబానికి ఉపయోగపడతాయి అనుకుంటాడు. అయితే ఆ సమయంలో మల్లన్న తండ్రి రాజన్న( బలగం సుధాకర్) వయసులో పెద్దవాడినైన నేను చనిపోతే ఆ డబ్బుతో మీరందరూ బాగుండొచ్చు అని అంటాడు. ముందు వద్దనుకున్నా సరే తర్వాత కుటుంబ సభ్యులందరూ రాజన్న చావు కోసం ఎదురు చూస్తారు. అయితే రాజన్న చనిపోకపోవడంతో పాటు ఆ విషయమే మరిచిపోయాడని తెలియడంతో అతన్ని చంపేందుకు సిద్ధమవుతారు. మరి రాజన్నని కుటుంబమంతా కలిసి చంపిందా? ఈ కుటుంబానికి వచ్చిన కష్టాలు దూరమయ్యాయా? చివరికి ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ
నిజానికి ఈ సినిమాని ముందు నుంచి బలగం చిత్రంతో పోలుస్తూ వచ్చారు. దానికి ముఖ్య కారణం బలగం సినిమాలో కీలకపాత్ర నటించిన సుధాకర్ రెడ్డి ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించడమే. అందుకు తోడు చావు చుట్టూనే కథ తిరుగుతూ ఉండడంతో బలగం లాంటి సినిమా అనే ముద్ర పడిపోయింది. అయితే మరి సినిమా మొదలైనప్పటినుంచే రైతుల కష్టాలు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసేడు దర్శకుడు. తర్వాత నెమ్మదిగా చెప్పాలనుకున్న పాయింట్ లోకి తీసుకు వెళ్లిన తర్వాత ఎందుకో కథ అక్కడక్కడే తిప్పిన ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి ఈ సినిమా ఎందుకో రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టు అనిపించదు. ఎందుకంటే తండ్రి చనిపోవాలి అని అనుకోవడం నిజంగా బయట ఉందా అనే పరిస్థితి జ్ఞప్తికి వస్తుంది. నిజానికి మనం వార్తలలో ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం. ఆస్తికోసం తండ్రిని చంపారు, తల్లిని చంపారు అనే వార్తలు అనునిత్యం మనకంట పడుతూనే ఉంటాయి. కానీ సినిమా చూస్తున్న సమయంలో మాత్రం ఎందుకో దాన్ని రియలిస్టిక్ గా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా తీసుకురావడంలో డైరెక్టర్ తడబడ్డాడేమో అనిపిస్తుంది. ఇక చాలా సీరియస్ గా ఉండే ఈ సినిమాకి మధ్య మధ్యలో నవ్వించేలా రాసుకున్న కామెడీ ఇరికించినట్లు కాకుండా సిచువేషనల్ గా ఉండడం అభినందించదగ్గ విషయం. కొన్నిచోట్ల ఎమోషన్స్ ని చాలా హృద్యంగా ప్రేక్షకులను కరిగించేలా రాసుకున్నారు కానీ కొన్ని చోట్ల మాత్రం వర్కౌట్ అయిన ఫీలింగ్ కలగదు. నిజానికి ఇది కథగా చెప్పుకుంటే భలే ఉంది కానీ కథనం విషయంలో మాత్రం ఎందుకో తడబడిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ విషయంలో ఇంకాస్త వర్క్ చేసి ఉంటే సినిమా స్థాయి వేరే లెవెల్ కి వెళ్ళేది. అలాగే సినిమాలో రెండు ప్రేమ కథలను ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి వారి కోసమే పాటలు కూడా ఇరికించడం కాస్త ఇబ్బందికర అంశమే. ఇక బ్రహ్మాజీ పాత్రతో పాటు ఆమని, బలగం సుధాకర్ రెడ్డి పాత్రలు ప్రేక్షకులను ఆలోచింపచేసేలా ఉన్నాయి. వారి మధ్య వచ్చే సీన్స్ కొన్ని నవ్విస్తే కొన్ని మాత్రం ఆలోచింపచేస్తాయి. అయితే క్లైమాక్స్ కూడా ప్రేక్షకులు ఊహించినట్లుగానే ఉన్న ఇంకాస్త బాగా రాసుకుని ఉంటె బాగుండేది.
నటీనటుల విషయానికి వస్తే బ్రహ్మాజీ ఈ చిత్రంలో మల్లన్న అనే సగటు రైతుగా నటించలేదు జీవించాడు. ఎక్కడా అదొక పాత్ర అన్నట్టు కాకుండా చాలా సహజంగా కుదిరాయి. బలగం సుధాకర్ రెడ్డి మరోసారి బాగా అలవాటైన తాత/తండ్రి పాత్రలో అలరించాడు. ఆయనే సినిమాలో కాస్త స్ట్రెస్ బస్టర్. ఇక ఆమని కూడా భలే పాత్రలో మెరిసింది. ధన్య బాలకృష్ణ డీ గ్లామర్ లుక్ లో తనదైన నటనతో ఆకట్టుకుంది. మణి, అభిత సహా శ్రీనివాస్ అవసరాల ఫర్వాలేదు అనిపించారు. రచ్చ రవి, గంగవ్వ… తదితరులు సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా పాటలు సినిమా ఫ్లో కి అడ్డుపడినా బాగున్నాయి. ఆర్.ఆర్. ధ్రువన్ సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ఇక తెలంగాణ పల్లె వాతావరణాన్ని వెండితెరపై సినిమాటోగ్రాఫర్ వాసు పెండెం ఆవిష్కరించిన తీరు అభినందనీయం. నిడివి కూడా సినిమాకి ప్లస్ అవడంలో ఎడిటర్ పాత్ర కీలకం. ఇక సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ డార్క్ కామెడీ ‘బాపు’ ఆలోచింపచేసి, నవ్విస్తాడు.