విజయరామరాజు హీరోగా అర్జున్ చక్రవర్తి అనే సినిమా ప్రమోషన్ కంటెంట్ అంతా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. నిజానికి కబడ్డీ లాంటి ఆటల మీద ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి కానీ నిజజీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని చేసిన సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులలో సినిమా చూడాలని ఆసక్తి కలిగింది. మరి ఎట్టకేలకు ఈ సినిమా 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
కథ:
అర్జున్ చక్రవర్తి (విజయ్ రామరాజు) ఓ అనాధ. చిన్నప్పుడు కాళీ సీసాలు ఏరుకుంటూ ఉన్న అతన్ని రంగయ్య (దయానంద రెడ్డి) చూసి చేరదీస్తాడు. స్వతహాగా కబడ్డీ ఆటగాడైన రంగయ్య తనకున్న కోపం కారణంగా టీం నుంచి డిస్క్వాలిఫై అవుతాడు. తన గ్రామంలో ఉన్న పిల్లలకు కబడ్డీ ఆట నేర్పిస్తూ ఉండే అతన్ని చూసి అర్జున్ చక్రవర్తికి కూడా ఆట మీద ఆసక్తి కలుగుతుంది. అలా నేషనల్ టీం కి సెలెక్ట్ అయిన అర్జున్ , తాను ప్రేమించిన అమ్మాయి( సిజా రోజ్) దక్కకపోవడంతో పిచ్చివాడైపోతాడు. తాగుడే లోకంగా బతికిన అతన్ని రంగయ్య కూడా మార్చలేకపోతాడు. అయితే అతన్ని జాతీయ జట్టులోకి సెలెక్ట్ చేసిన కులకర్ణి(అజయ్) మళ్లీ అతన్ని కబడ్డీ ఆడించే ప్రయత్నం చేస్తాడు. ఒకప్పుడు కబడ్డీ ఆటలో మెరుపులు మెరిపించిన అర్జున్ చక్రవర్తి మళ్లీ కబడ్డీ ఆడాడా లేదా, తాను ప్రేమించిన అమ్మాయి మళ్లీ దక్కిందా లేదా అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇది కొన్ని నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు రాసుకున్న సబ్జెక్ట్. అందుకు అనుగుణంగానే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగింది. వాస్తవానికి చెప్పాలంటే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా సినిమాలు తెలుగులో చాలా తక్కువ వస్తాయి. వచ్చిన సినిమాలను ప్రేక్షకులు గట్టిగానే ఆదరిస్తూ వచ్చారు. ఈ సినిమా కూడా కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రాసుకున్నాడు డైరెక్టర్. నిజానికి పెద్దగా లోతుకు వెళ్లకుండా ఎమోషన్స్ పండిస్తూ రాసుకున్నాడు. అయితే కథ నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లే కావడంతో ప్రేక్షకులు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని కొన్ని గందరగోళ పరిస్థితులకు కూడా గురవుతారు. అయితే సినిమాలో అర్జున్ చక్రవర్తి కబడ్డీ వైపు నడిచినప్పటి నుంచి సాగిన సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. ఎక్కడో చెత్త ఏరుకుని బతికే ఒక యువకుడిని కబడ్డీ బహిష్కృత ఆటగాడు తీసుకొచ్చి అనుకోకుండా అతనికి కబడ్డీ నేర్పి జాతీయ జట్టులోకి పంపే లైన్‌గా ఈ సినిమా రాసుకున్నాడు. అయితే అక్కడే హీరోకి ప్రేమ, ఆ ప్రేమ విఫలం కావడం లాంటి సన్నివేశాలు రాసుకుని కథకు మరింత ఎమోషన్స్ జోడించాడు దర్శకుడు. ఓవరాల్‌గా ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలా సాగుతూనే కొన్ని చోట్ల అక్కడక్కడ తిరిగిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఓవరాల్‌గా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా సినిమా ఉంది అనడంలో సందేహం లేదు.
ఈ సినిమా టైటిల్ రోల్‌లో విజయరామరాజు నటించినట్టు జీవించాడు అనడం కరెక్టేమో. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ఒక్కసారిగా ఒక స్ట్రెచ్‌లో చేసిన సినిమా కాదు. విజయ్ రామరాజు పాత్రకు చాలా వేరియేషన్స్ చూపించాలి. అతని బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ సహా ఫేస్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా చాలా కీలకమైన అంశం. అతను ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసాడు అనిపించింది. ఓవరాల్‌గా సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాల మీద నడిపించాడు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర దయానంద రెడ్డికి దక్కింది. ఆయన రంగయ్య అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఏమో అనిపించింది. నిజానికి అతను చనిపోయిన తర్వాత శవంలా నటించాల్సిన పరిస్థితుల్లో కూడా శవంలా నటించి ఆకట్టుకున్నాడు. వాస్తవానికి శవంలా నటించడం అంటే చేతులు వదిలేయడం అనుకుంటారు, కానీ ఈ సినిమాలో దయానంద రెడ్డి నటన చూసిన తర్వాతే ఇది కదా నిజమైన శవంలా ఉండడం అనిపిస్తుంది. ఇక మిగతా పాత్రధారులు అంటే అజయ్ చిన్న పాత్ర అయినా ఇంపాక్ట్‌ఫుల్ రోల్ చేశాడు. మిగతా పాత్రధారులు అందరూ పెద్దగా గుర్తుపెట్టుకోదగ్గ వారు ఏమీ కాదు, కానీ ఉన్నంతలో నటించారు. ఈ సినిమాకి ప్రధానమైన టెక్నికల్ అస్పెక్ట్స్ విషయానికి వస్తే, లొకేషన్స్ ఎక్కడ రెక్కీ చేశారు, ఎన్నేళ్లు రెక్కీ చేశారో తెలియదు కానీ కనుల విందుగా ఉన్న లొకేషన్స్‌లో సినిమాని ప్రేక్షకులకు చూపించారు. అలాగే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. నిజానికి ఇలాంటి సినిమాలు తీయాలంటే నిర్మాతలకు గట్స్ ఉండాలి. అలాంటి గట్స్‌తో ఈ సినిమా చేసిన స్త్రీని మొదటి సినిమాతోనే పాషన్ ఉన్న నిర్మాత అనిపించుకునేలా సినిమా చేశారు.
ఓవరాల్‌గా:
అర్జున్ చక్రవర్తి వాచ్‌బుల్ స్పోర్ట్స్ డ్రామా.