అనుకున్నవన్ని జరగవు కొన్నికథ : కార్తిక్(శ్రీ రామ్ నిమ్మల)కి చాలా డబ్బు అవసరం ఉండడంతో కాల్ బాయ్ గా మారతాడు. అదే సమయంలో మధు (కలపాల మౌనిక) కూడా డబ్బు కోసం ఏమీ చేయలేని పరిస్థితుల్లో కాల్ గర్ల్ గా మారుతుంది. ఈ ఇద్దరికీ పరిచయం ఉండదు కానీ అనూహ్యంగా ఇద్దరికీ ఒకే బిల్డింగ్ నుంచి కస్టమర్లు కాల్ చేస్తారు. ఇద్దరూ వెళ్లి చూసేసరికి ఆ కాల్స్ చేసిన ఇద్దరూ చనిపోయి ఉంటారు. అయితే అసలు వీరికి కాల్స్ చేసింది ఎవరు? ఆ కాల్స్ చేసిన వారిని చంపింది ఎవరు? అసలు కాల్ బాయ్ గా మారేంత అవసరం కార్తీక్ కి ఏమి వచ్చింది? కాల్ గర్ల్ గా మారేంత అవసరం మధుకి ఏమొచ్చింది? అనేది ఈ సినిమా కథాంశం.
విశ్లేషణ: ఈ సినిమా కథగా చూసుకుంటే కొత్త కథ ఏమీ కాదు. వ్యభిచారం కోసం ఒక చోటకి వెళ్లి మర్డర్ కేసులో ఇరుక్కోవడం, లేదా వ్యభిచారం చేసేందుకు వచ్చిన వారే చనిపోతే ఆ కేసు నుంచి బయట పడేందుకు పడే తంటాలు ఆధారంగా చేసుకుని అనేక సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి, వస్తూనే ఉంటాయి. ఈ సినిమా కూడా దాదాపుగా అలాగేసాగుతుంది. కాల్ బాయ్ అయిన హీరో కాల్ గర్ల్ అయిన హీరోయిన్ ను మర్డర్ కేసు అయ్యేముందు కలుసుకోవడం, ఆ పరిచయం ప్రేమగా మారడం లాంటివి కాస్త ఆసక్తి కలిగించేలా రాసుకున్నాడు డైరెక్టర్. నిజానికి ఇప్పటి దాకా తెలుగు సినిమాలో ఎప్పుడూ లేని విధంగా హీరోని కాల్ బాయ్ గా హీరోయిన్ ని కాల్ గర్ల్ గా చూపిస్తూ కొత్త కాన్సెప్ట్ తో ప్రయత్నించారు. అలాగే భార్య భర్తలు ఒకరికి తెలియకుండా ఒకరు సుపారీ ఇచ్చి మరొకర్ని చంపడానికి ప్రయత్నించగా ఒకరి మనిషి చేతిలో మరొకరు మొత్తం మీద ఇద్దరూ చనిపోవడం, ఆ మర్డర్ కేసులో హీరో హీరోయిన్లు ఇరుక్కోవడం ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఆ తరువాత సెకండాఫ్ అంతా అన్నదమ్ముల పాత్రల్లో పోసాని కృష్ణమురళి, బబ్లు మాయ ఆకట్టుకునేలా నటించారు. ఒకరకంగా చెప్పాలంటే నిర్మాతగా దర్శకుడిగా రెండు బాధ్యతలు చేపట్టి అనుకున్న సినిమాని అనుకున్నట్టుగా తీసే ప్రయత్నం చేసి చాలావరకు సక్సెస్ అయ్యాడు దర్శకుడు జీ సందీప్.
నటీనటుల విషయానికి వస్తే హీరో శ్రీరామ్ నిమ్మల ఆకట్టుకునేలా నటించాడు. హీరోయిన్ కలపాల మౌనిక కూడా చాలా ఈజ్ తో నటించింది. వినడానికి ఈజీగా ఉన్నా ఇలాంటి పాత్రలు చేయడానికి చాలా ధైర్యమే కావాలి. కిరీటి, స్నేహ మాధురి, సోనియా చౌదరి, గౌతమ్ రాజు, మిర్చి హేమంత్ ఎవరికి పాత్రకు వారు న్యాయం చేయగా పోసాని, బబ్లూ ఇద్దరూ సినిమాకి పిల్లర్స్ లాగా నిలబడిపోయే ట్రాక్ లో నటించి ఆకట్టుకున్నారు. ఇక టెక్నీకల్ టీమ్ విషయానికి వస్తే గిడియన్ కట్ట అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది. ఎడిటర్ కె సి బి హరి కూడా సినిమాను క్రిస్పీగా ఉండేలా కట్ చేశారు. ఇక ఈ సినిమాని చాలా గ్రాండ్ గా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మాణ విలువలతో తెరకెక్కించారు.
ఫైనల్లీ: ఈ సినిమా క్రైమ్ కామెడీ ఇష్టపడే వారికి విందు భోజనం.. మిగతా వారికి కూడా వన్ టైం వాచబుల్