NTV Telugu Site icon

Andaru Bagundali Andulo Nenundali Telugu Review : అందరూ బాగుండాలి అందులో నేనుండాలి!

Andaru Bagundali Andulo Nen

Andaru Bagundali Andulo Nen

ప్రముఖ కమెడియన్ అలీ, నరేశ్‌ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. విశేషం ఏమంటే ఈ సినిమాతో అలీ నిర్మాతగానూ మారారు. మలయాళ చిత్రం ‘వికృతి’కి రీమేక్ అయిన దీనిని కిరణ్ శ్రీపురం డైరెక్ట్ చేశారు. శుక్రవారం నుండి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

సోషల్ మీడియాలో పరాయి వ్యక్తుల ఫోటోలను, వీడియోలను పెట్టి వైరల్ చేస్తే వస్తే సమస్యల నేపథ్యంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. మూగవాడైన శ్రీనివాసరావు (నరేశ్‌) తన భార్యా పిల్లలతో హాయిగా కాపురం చేస్తుంటాడు. కొడుకు అనారోగ్యం కారణంగా రెండ్రోజులు నిద్రాహారాలు కరువైన శ్రీనివాసరావు, హాస్పిటల్ నుండి ఇంటికి వెళుతూ, మెట్రోలో అలసటతో గాఢమైన నిద్రలోకి జారిపోతాడు. దాన్ని ఫారిన్ రిటర్న్డ్ సమీర్ (అలీ) ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అంతేకాదు… శ్రీనివాసరావు తాగి అలా పడుకున్నాడని కామెంట్ కూడా పెడతాడు. అది కాస్త వైరల్ అయిపోతుంది. శ్రీనివాసరావు ఉద్యోగం పోవడంతో పాటు, అతని కుటుంబం అవమానాల పాలు అవుతుంది. దుబాయ్ నుండి వచ్చి, ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకునే ముందు… సరదాగా పెట్టిన ఆ పోస్ట్… సమీర్ ను ఎలాంటి ఇబ్బందుల్లో పడేసింది? చివరకు ఆ చిక్కుల్లోంచి అతను ఎలా బయట పడ్డాడు? అనేదే ఈ చిత్ర కథ.

సెల్ఫీ పిచ్చిలో పడి ప్రాణాలను పోగొట్టుకుంటున్న వాళ్ళను మనం చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో ఇతరుల ప్రైవసీని గౌరవించకుండా కంటికి కనిపించిన ప్రతి దృశ్యాన్ని, భిన్నంగా కనిపించే ప్రతి వ్యక్తిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారినీ చూస్తున్నాం. కానీ అవి వైరల్ అయ్యి, అవతలి వ్యక్తిని ఎంత బాధకు గురిచేస్తాయో ఎవరూ పట్టించుకోరు. ఇదే ప్రధానాంశంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. సరదాగా చేసిన ఓ పోస్ట్ అవతలి వ్యక్తి జీవితాన్నే కాదు… ఇవతలి వ్యక్తి లైఫ్ నూ అతలాకుతలం చేయడమనే పాయింట్ ను దర్శకుడు ఎంచుకోవడం వరకూ బాగానే ఉంది, అయితే… ఇది రెండు గంటల సినిమాకు తగ్గ పాయింట్ కాదు. దాంతో చాలా సన్నివేశాలు తేలిపోయాయి. పైగా వైరల్ అయిన పోస్ట్ కారణంగా ఇబ్బందులు పడిన శ్రీనివాసరావు జీవితం మళ్ళీ మామూలు పొజిషన్ కు వచ్చేసిన తర్వాత, అవతలి ప్రత్యర్థి మీద ఎవరికీ కసి కానీ కోపంగానీ ఉండవు. సమీర్ జరిగిన తప్పును ఎప్పటి కప్పుడు బయట పెట్టకుండా దాచేయడం, భయంతో దుబాయ్ పారిపోవాలకోవడమనేవి బేస్ లెస్ గా అనిపిస్తాయి. జరిగిన పొరపాటును భార్యకు, ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా ఉండటానికీ బలమైన రీజన్స్ కనిపించవు. ఓ చక్కని సందేశాన్ని ఇవ్వాలని దర్శకుడు భావించినా దాన్ని సమర్థవంతంగా తెరపై ప్రెజెంట్ చేయలేకపోయాడు.

అలీ పాత్రను సెల్ఫీ పిచ్చితో రివీల్ చేయడం బాగుంది. కానీ ఆ తర్వాత దర్శకుడు దాన్ని మర్చిపోయాడు. అతని ప్రేమ వ్యవహారం సమయంలో ఎక్కడా సెల్ఫీ గోల లేదు. చేసిన పొరపాటును దాచడం కోసం అలీ పడుతున్న తాపత్రయం తాలుకు ప్రభావానికి ప్రేక్షకులు ఎక్కడా లోను కాడు. కనీసం అందులోంచి వినోదాన్ని కూడా పొందలేడు. ఒక సీన్ తర్వాత ఒక సీన్ సాగుతూ పోతుంది తప్పితే… ఏదీ థ్రిల్లింగ్ గా అనిపించదు. అయితే క్లయిమాక్స్ మాత్రం హృదయానికి హత్తుకునేలా ఉంది. నరేశ్‌ పాత్రలో రకరకాల వేరియేషన్స్ పెట్టారు. కాసేపు ఒకలా కాసేపు మరోలా అతని మారిపోతుండటం కరెక్ట్ గా అనిపించదు. సినిమా నిర్మాతల్లో అలీ కూడా ఒకరు కావడంతో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సంగీతం, సినిమాగ్రఫీ, భాస్కరభట్ల సాహిత్యం ఓకే.

నటీనటుల విషయానికి వస్తే… సమీర్ పాత్రను అలీ చక్కగా పోషించాడు. ప్రధమార్థంతో హుషారుగా చేసిన అలీ, ద్వితీయార్థంలో దీన వదనంతో మెప్పించాడు. నరేశ్ ను మూగవాడి పాత్రలో యాక్సెప్ట్ చేయడానికి కొంత సమయం పడుతుంది. అతని భార్యగా పవిత్ర లోకేష్, స్నేహితుడిగా మనో నటించగా, ఇతర ప్రధాన పాత్రలను మౌర్యాని, భరణి, మధుసూదనరావు, మంజుభార్గవి, పెరిక ఉషశ్రీ, భద్రం, రామ్ జగన్, ముఖ్తార్ ఖాన్, సన, సప్తగిరి తదితరులు పోషించారు. సినిమా ప్రారంభంలో ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి; మధ్యలో శివబాలాజీ, ముగింపులో ఎల్బీ శ్రీరాం తళుక్కున మెరిశారు. మలయాళంలో హిట్ అయ్యింది కదాని తెలుగులో తీసేయడం ఎప్పుడూ కరెక్ట్ కాదు. అక్కడి సినిమాలను ఇక్కడ భారీ తారాగణంతో తీసినా పరాజయం పాలైన ఉదాహరణలు బోలెడున్నాయి. తెలుగు ప్రేక్షకుల అభిరుచిని, ఇక్కడ ఆ సినిమాల్లో నటించే ఆర్టిస్టుల ఇమేజ్ ను విస్మరిస్తే… చేదు అనుభవమే మిగులుతుంది. అయితే… ‘అందరూ బాగుండాలి… అందులో నేనుండాలి’ మూవీ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది కాబట్టి… లీజర్ టైమ్ లో ఓసారి చూడొచ్చు!

రేటింగ్ : 2.5 /5

ప్ల‌స్ పాయింట్స్:
అలీ, నరేశ్‌ నటన
ఎంచుకున్న సందేశం
ప్రొడక్షన్ వాల్యూస్

మైనెస్ పాయింట్స్:
థిన్ స్టోరీ లైన్ కావడం
బలహీనమైన కథనం
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం

ట్యాగ్ లైన్: సందేశాత్మకం!

Show comments