NTV Telugu Site icon

7:11 PM Review: 7:11 పీఎం మూవీ రివ్యూ

711 Pm Movie Review

711 Pm Movie Review

7:11 PM Movie Review: ఈ మధ్యకాలంలో సైన్స్ ఫిక్షన్ కథలు కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆసక్తికరంగా చెప్పగలిగితే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని నమ్మకంతో దర్శక నిర్మాతలు కూడా ఇలాంటి సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఒక సైన్స్ ఫిక్షన్ కథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఒక సినిమా వచ్చేసింది. 7.11 PM పేరుతో ఒక సినిమా ఈ శుక్రవారం నాడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది అయితే. సినిమా మీద నమ్మకంతో ముందే మీడియా ప్రీమియర్స్ వేసి మరి చూపించేసింది సినిమా యూనిట్. ఈ సందర్భంగా ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం

7.11 PM కథ ఏమిటంటే:
సినిమా టైటిల్ వినగానే ఇదేదో టైంకి సంబంధించిన సినిమానే అందరికీ అర్థం అయిపోతుంది. కథలోకి వెళితే కృష్ణా జిల్లా హంసలదీవి అనే గ్రామంలో రవి ప్రసాద్(సాహస్ పగడాల) అనే యువకుడు తన బాబాయి మిలిటరీ ప్రభాకర్, స్నేహితులతో కలిసి సైనిక్ గ్యారేజ్ అనే ఒక గ్యారేజ్ నడుపుతూ ఉంటాడు. అదే గ్రామానికి చెందిన విమల (దీపికా రెడ్డి), రవి ఇద్దరూ ప్రేమలో ఉంటారు. విమల స్థానిక ఎమ్మెల్యే కృష్ణ( భరత్ రెడ్డి) చెల్లెలు కావడంతో రవి ప్రసాద్ తో తిరగవద్దని ఆమెకు వార్నింగ్ ఇస్తాడు కృష్ణ. మరో పక్క స్థానిక మంత్రి బసవపున్నయ్యకు, కృష్ణకుమధ్య ఊరి విషయంలో గొడవలు కూడా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంటాయి. బసవపున్నయ్య అండతో రాజేష్ అనే వ్యక్తి అపరిమితం అనే ఒక మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ పెట్టి డబ్బులు దోచుకుని బోర్డు తిప్పేస్తున్న సమయంలో ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు రవి. అలా అడ్డుకునే క్రమంలో బస్సు రూపంలో ఉన్న ఒక టైం మిషన్ ఎక్కుతాడు రవి ప్రసాద్. నిద్రలేచేసరికి 1999వ సంవత్సరం నుంచి మెల్బోర్న్ లో 2024 లోకి వెళ్లానని తెలుసుకుంటాడు. అసలు ఇదంతా ఎలా జరిగింది? రవి ప్రసాద్ ఎక్కిన బస్సు టైం మెషిన్ గా ఎందుకు మారింది? రవి ప్రసాద్, విమల కలిశారా? బసవపున్నయను రవిప్రసాద్ అడ్డుకున్నాడా ? ఇందులో కృష్ణ పాత్ర ఏమిటి అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ
కొత్త దర్శకుడు అయిన చైతు మాదాల భలే ఆసక్తికర ప్రయత్నం చేశాడనిపించింది. దర్శకుడు ఎంచుకున్న టైం ట్రావెల్ పాయింట్ ఎవర్ గ్రీన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈజీగా డబ్బు సంపాదిద్దాం అనుకునే వారిని మోసగించేందుకు సిద్ధమైన రాజకీయ అండగలిగిన వ్యక్తిని అడ్డుకుని అతని నుంచి ఊరిని ఒక యువకుడు ఎలా కాపాడుకున్నాడు? అలా కాపాడుకునేందుకు టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ ఎలా ఉపయోగపడింది అనేది సినిమా స్టోరీ. అయితే టైం ట్రావెల్ తో ఈ మధ్య కొన్ని సినిమాలు వచ్చాయి కానీ ఈ సినిమాలో కాస్త కొత్త ప్రయోగం చేసినట్లు అనిపించింది. అయితే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించడంలో కాస్త తడబడ్డాడు. ఫస్టాఫ్ అంతా బోరింగ్ గా సాగుతుంది. ఇదేంట్రా నాయనా అనుకుంటూ సెకండ్ హాఫ్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం అందుకుంటుంది. అయితే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా ఎమోషన్స్ మిస్ అవ్వడం సినిమాకు మైనస్. సాధారణంగా టైం ట్రావెల్ సినిమాలు గనక మనం పరిశీలిస్తే ప్రస్తుతంలో మొదలుపెట్టి గతంలోకో భవిష్యత్తులోకో తీసుకెళ్లి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూపిస్తారు. కానీ ఈ సినిమా డైరెక్టర్ మాత్రం ఒక పీరియాడిక్ కథను ఎంచుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే 99వ సంవత్సరంలో కథను ఓపెన్ చేసి హీరోని ఏకంగా భవిష్యత్తులోకి పంపించాడు. అక్కడ కొన్ని పరిస్థితుల అవగతం చేసుకున్న తర్వాత మళ్లీ పాస్ట్ లోకి వచ్చిన హీరో తన ప్రేమికురాలిని, స్నేహుతులను, ఊరిని ఎలా కాపాడుకున్నాడు అనేది కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే సినిమా కొంచెం లో -బడ్జెట్ అవడం వలన లీడ్ క్యారెక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు అవడం వల్ల కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది కానీ ఉన్నంతలో కథలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సినిమాటిక్ గా తెరకెక్కించడంలో దర్శకుడు చాలా వరకు ప్రయత్నం చేసి సఫలం అయ్యాడు.

ఎవరు ఎలా చేశారు అంటే
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో నటించిన వారందరూ దాదాపుగా కొత్తవారే. రఘు కారుమంచి, భరత్ రెడ్డి, రైజింగ్ రాజు వంటి వారు ఉన్నా కొత్త వాళ్ళందరూ షో నడిపించారు. సాహస్ పగడాల యాక్టింగ్ బాగుంది అయితే ఎక్స్ప్రెషన్స్ పరంగా కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుందనిపిస్తుంది. దీపికా రెడ్డి ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేసింది. ఇక ఆస్ట్రేలియన్ నటులు ఆకట్టుకునే విధంగా నటించారు. రఘు కారుమంచి, రైజింగ్ రాజు ఎప్పటిలాగే తనదైన కామెడీ పండించే ప్రయత్నం చేశారు. భరత్ రెడ్డికి మంచి రోల్ దొరికింది. దర్శకుడు చైతు మాదాలకు ఈ సినిమా మొదటి సినిమాని అయినా ఎంచుకున్న పాయింట్ కొంచెం కొత్తగా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. మొదటి సినిమా అయినా కథను డీల్ చేసిన విధానం కొన్ని పాత్రను డిజైన్ చేసిన విధానం అయితే ఆకట్టుకుంటుంది. ఇక సినిమా తెరకెక్కించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. సినిమా నడిచేదంతా 99లో కావడంతో అప్పటి వస్తువులనే సినిమాలో చూపించే విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. పర్టిక్యులర్ గా చూస్తే కానీ అర్థం కాకపోయినా ఇలాంటి డీటెయిల్స్ ని సినిమాలో మిస్ అవ్వకుండా ఉండాల్సింది. సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది, ఎడిటింగ్ టేబుల్ మీద కొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే మరింత బాగుండేదేమో. నిర్మాణ విలువలు సినిమాకి తగినట్టు ఉన్నాయి.

బాటమ్ లైన్
మంచి మార్కెట్ ఉన్న హీరోకి ఈ సబ్జెక్ట్ పడి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది.