OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?

  • కూటమి పొత్తుల్లో జనసేన కోటాలోకి తుని మున్సిపాలిటీ
  • జనసేనలో యనమల కృష్ణుడు, టీడీపీ ఎమ్మెల్యే దివ్య
  • బాబాయ్‌కి, అమ్మాయికి అస్సలు పొసగడం లేదన్న టాక్‌
  • దివ్య నిర్వహించిన ర్యాలీలో కనిపించని కృష్ణుడు
  • ఇద్దరూ కలిసి ముంచేస్తారేమోనని కేడర్‌లో కంగారు
  • వ్యక్తిగత అజెండాలు పక్కన పెట్టాలంటూ కేడర్‌ హితవు
  • ఎమ్మెల్యే దివ్య బాధ్యత తీసుకోవడంలేదన్న అసంతృప్తి
Otr

Otr

OTR : కూటమి పొత్తులో భాగంగా తుని మున్సిపాలిటీ నుంచి జనసేన పోటీ చేస్తోంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. మరోవైపు సెప్టెంబర్‌లో వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకున్నారు యనమల కృష్ణుడు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో… సైకిల్ మీద కంఫర్ట్‌గా లేదంటూ… వరుసకు అన్నయ్య అయ్యే సీనియర్ నేత యనమల రామకృష్ణుడితో విభేదించి వైసీపీలోకి జంప్ అయిపోయారు కృష్ణుడు. అక్కడ ఇమడలేక, తిరిగి టీడీపీలోకి రాలేక…ఇటీవలే గ్లాస్‌ కండువా కప్పుకున్నారాయన. ఇక ప్రస్తుతం తుని టీడీపీ ఎమ్మెల్యేగా యనమల రామకృష్ణుడు కూతురు దివ్య ఉన్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే…ప్రస్తుతం ఈ ఫ్యామిలీ మొత్తం కూటమిలో ఉన్నట్టే. కుటుంబ పరంగా తీవ్రంగా విభేదించుకునే బాబాయ్‌, అమ్మాయ్‌.. ఇప్పుడు కూటమిగా కలిసి పనిచేయాల్సి రావడమే అసలు సమస్య అంటున్నారు పరిశీలకులు.

జనసేన ఇన్ఛార్జ్‌ అయిన బాబాయ్‌ కృష్ణుడుకు, ఎమ్మెల్యే అయిన అమ్మాయి దివ్యకు అస్సలు పొసగడం లేదని చెప్పుకుంటున్నారు. తుని మున్సిపాలిటీ జనసేన చైర్మన్ అభ్యర్థితో ర్యాలీ నిర్వహించి గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే దివ్య. కానీ… అక్కడ కృష్ణుడు మాత్రం కనబడలేదు. దాంతో… అమ్మాయితో కలిసి వేదిక పంచుకోవడం ఆయనకు ఇష్టం లేదా అని రెండు పార్టీల కార్యకర్తల మధ్య చర్చలు నడుస్తున్నాయట. సాధారణంగా ఎక్కడైనా…. కూటమి పార్టీల్లో చేరిన వాళ్లు ఎక్కువ మంది ఆ తర్వాత లోకల్‌గా ఉన్న ఎమ్మెల్యేని కలుస్తుంటారు. పాత వ్యవహారాలన్నీ పక్కనపెట్టి ఇద్దరూ కలిసి ముందుకు నడుస్తుంటారు.. కానీ తునిలో వాతావరణం దానికి పూర్తి భిన్నంగా ఉందట. దీంతో… ఈ ఫ్యామిలీ యవ్వరాల వల్ల మున్సిపల్‌ ఎన్నికల్లో తేడా జరిగేట్టుంది…. ఎక్కడో కొడుతోందన్నా అంటూ రెండు పార్టీల నాయకులు మాట్లాడుకుంటున్నారట. ఎన్నికల్లో ఇలాంటి లెక్కలు చాలా డ్యామేజ్ చేస్తాయన్నది వాళ్ళ అభిప్రాయం. యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురై గత వారం హాస్పిటల్‌లో చేరారు. ఆ సమయంలో కూడా కృష్ణుడు కనీసం పరామర్శకు రాలేదని తెలుగు తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు. ఒకటే ఫ్యామిలీ అయినా… అంత రాజకీయ వైరం అవసరమా అన్నది వాళ్ళ ప్రశ్న.

గతంలో టిడిపి తరఫున రెండుసార్లు తుని ఎమ్మెల్యేగా పోటీచేశారు కృష్ణుడు. అయినా గెలవలేదు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో రామకృష్ణుడు కూతుర్ని ప్రమోట్ చేయడంతో… పార్టీకి దూరం జరిగారు కృష్ణుడు. అంత మాత్రాన అన్న ఆసుపత్రి పాలైతే… కనీసం పరామర్శకు కూడా రారా అని అడుగుతున్నారు టీడీపీ కార్యకర్తలు. గత మున్సిపల్ ఎన్నికల్లో తునిలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.. టిడిపి కనీసం ఖాతా తెరవలేదు. అలాంటి చోట ఇప్పుడు ఎంత కలిసికట్టుగా పనిచేయాలంటూ గుర్తు చేస్తున్నారు. వ్యక్తిగత అజెండాలు పక్కనపెట్టి కూటమి జెండాలతో ముందుకు వెళ్ళకపోతే జనం నెగెటివ్‌ రియాక్షన్ ఇస్తారని అంటున్నారు. ఎవరి ప్రచారాలు వాళ్ళు చేసుకుంటే ఇక కూటమి ఎందుకు అన్నది లోకల్‌ లీడర్స్‌ క్వశ్చన్‌. అదే సమంలో మిత్ర పక్షం అభ్యర్థి విషయంలో ఎమ్మెల్యే అలా ఎలా వ్యవహరిస్తారంటూ తప్పు పడుతున్నారు కొందరు. ఆమె కూడా సొంత పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నట్లు లీడ్ తీసుకోవాలి కదా అని గుర్తు చేస్తున్నారు.. ఏదో…. చుట్టపు చూపుగా వచ్చి అలా కనిపించి ఇలా వెళ్లిపోతే గ్రౌండ్ లెవెల్‌లో రియాల్టీ, రేపు రిజల్ట్‌ వేరుగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి తునిలో కూటమి ఉన్నప్పటికీ బాబాయికి అమ్మాయికి మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతోంది. ఈ వార్‌తో లోకల్ ఎన్నికల్లో తేడా కొడుతుందని భయపడుతున్నారు కార్యకర్తలు. అయినా వాళ్లు మాత్రం నో చేంజ్ అంటున్నారు. ఈ కుటుంబ వ్యధా చిత్రమ్‌ తునిలో తమను ఏ తీరానికి చేరుస్తుందోనన్నది వాళ్ళ డౌట్‌.