NTV Telugu Site icon

YCP : అక్కడ వైసీపీకి లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందా..?

Athmakur

Athmakur

ఉపఎన్నిక జరుగుతున్న ఆత్మకూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో క్రమంగా పొలిటికల్‌ హీట్ రాజుకుంటోంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 13 వేల మంది. 2014లో ఇక్కడ వైసీపీకి 33 వేలు, 2019లో 22 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. మేకపాటి గౌతంరెడ్డి అకాల మరణంతో వచ్చిన ఉపఎన్నికలో ఆయన సోదరుడు విక్రంరెడ్డే వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో వచ్చిన మెజారిటీ ఎలా ఉన్నా.. ఉపఎన్నికలో మాత్రం లక్ష ఓట్ల ఆధిక్యం సంపాదించాలనే పట్టుదలతో ఉన్నారు నాయకులు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూశాక కొంత కలవర పడ్డ ఆత్మకూరు వైసీపీ నేతలు.. వెంటనే పార్టీ పెద్దలకు చెప్పారట. ఆ తర్వాతే ప్లాన్‌ బీ అమలు చేస్తున్నట్టు సమాచారం. దానిచుట్టూనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

గౌతంరెడ్డిపై ఉన్న సానుభూతితోపాటు సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు లక్ష ఓట్ల మెజారిటీ తీసుకొస్తాయనే అంచనాల్లో ఇన్నాళ్లూ ఉన్నారు వైసీపీ నాయకులు. గ్రౌండ్‌ రియాలిటీని పరిశీలించాక వ్యూహం మార్చేశారట. నియోజకవర్గంలో ఆరు మండలాలు.. ఆత్మకూరు పట్టణం ఉన్నాయి. ఇక్కడ ఒక్కో మండలానికి ఒక్కో మంత్రిని ఇంఛార్జ్‌గా పెట్టారట. ఆ మంత్రికి సహకరించేందుకు మరో ఎమ్మెల్యేను జత కలిపినట్టు చెబుతున్నారు. ఆయా మండలాలకు చెందిన వైసీపీ నేతలతో మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారట.

ఈ నెల పది నుంచి ప్రచారం స్పీడ్‌ పెంచాలని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారట మంత్రులు. దీనికితోడు ఆత్మకూరు నియోజకవర్గంలోని వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలు కొంత ఆటంకంగా మారాయట. వాటిని అధిగమిస్తేకానీ.. అనుకున్న లక్ష ఓట్ల ఆధిక్యాన్ని చేరుకోలేమని లోకల్‌ లీడర్స్‌కు సూటిగా సుత్తిలేకుండా చెబుతున్నారట. గడప గడపకు మన ప్రభుత్వంలో వచ్చిన ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారట. వాటిని పూర్తి చేసేలా అధికారులను పరుగులు పెట్టించే యోచనలో ఉన్నట్టు సమాచారం. పైగా మండలాల వారీగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు.. తమ పరిధిలో ఎక్కువ మెజారిటీ వచ్చేలా చూడాలని వైసీపీ అధిష్ఠానం ఆదేశించినట్టు తెలుస్తోంది.

లక్ష ఓట్ల మెజారిటీ సాధించాలంటే.. పోలింగ్‌ శాతాన్ని గణనీయంగా పెంచాలని స్థానిక ఎన్నికల ఇంఛార్జ్‌లకు పార్టీ నేతలు దిశానిర్దేశం చేశారట. అసంతృప్తి నేతలను బుజ్జగించి.. వారు ఫీల్డ్‌లో పనిచేసేలా ప్రయత్నాలు మొదలయ్యాయట. ఈ విషయంలో మంత్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆత్మకూరులో వైసీపీ నేతల నోట లక్ష ఓట్ల ఆధిక్యం తప్ప మరో మాట వినిపించడం లేదు. మరి.. పోలింగ్‌ నాటికి లక్ష్య సాధనలో ఆత్మకూరు వైసీపీ నేతలు ఏం చేస్తారో చూడాలి.

అక్కడ వైసీపీకి లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందా..? l Off the Record l NTV