NTV Telugu Site icon

తెలంగాణ ఆర్టీసీని ఐపీఎస్‌ సజ్జనార్‌ సెట్‌ చేస్తారా?

తెలంగాణ ఆర్టీసీని సీనియర్‌ ఐపీఎస్ సజ్జనార్‌ సెట్‌ చేస్తారా? పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ముద్రపడ్డ ఆయన్ని ప్రభుత్వం ఎందుకు ఆర్టీసీకి పంపింది? ఎవరికి చెక్‌ పెట్టేందుకు తీసుకొచ్చారు? ఆర్టీసీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?

సీనియర్‌ ఐపీఎస్‌తో మంత్రికి సఖ్యత కుదురుతుందా?

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు MDగా పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ వీసీ సజ్జనార్‌ వచ్చారు. ఈ నియామకంపై ఆర్టీసీతోపాటు.. ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీకి పూర్తిస్థాయి MD లేరు. సంస్థ నష్టాల ఊబీలో ఉంది. రవాణా మంత్రిగా పువ్వాడ అజేయ్‌ వచ్చాక.. ఆర్టీసీ చరిత్రలోనే కార్మికులు పెద్ద సమ్మె బాట పట్టారు. 55 రోజులపాటు సమ్మె సాగడానికి మంత్రి వైఖరే కారణమని అప్పట్లో ఆరోపించాయి కార్మిక సంఘాలు. దీనికితోడు ఆర్టీసీ ఇంఛార్జ్‌ ఎండీగా ఉన్న IAS అధికారి సునీల్‌ శర్మతో మంత్రికి పొసగేది కాదు. చాలా అంశాలలో మనస్పర్థలు వచ్చాయి. ఇప్పుడు సిన్సియర్‌ ఆఫీసర్‌గా ముద్ర పడ్డ సజ్జనార్‌తో మంత్రికి సఖ్యత కుదురుతుందా లేదా అన్నది ప్రశ్నగా ఉందట.

మంత్రి పువ్వాడ ప్రాధాన్యం తగ్గించడానికేనా?

అప్పట్లో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు CCS డబ్బులను సంస్థ వాడుకుంది. వాటిని తిరిగి ఉద్యోగులకు ఇవ్వాలని ఇంచార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలను మంత్రి పువ్వాడ తిరస్కరించారు. దీంతో సునీల్‌శర్మ కొద్దిరోజులపాటు లీవ్‌లో వెళ్లారు. పైగా ఆర్టీసీలో కీలక మార్పులకు సీఎం కేసీఆర్‌ చూస్తున్నట్టు చర్చ జరుగుతోంది. అవి అమలు కావాలంటే సమర్థుడైన పోలీస్‌ అధికారి కోసం అన్వేషించారట. ఆయన దృష్టిలో సజ్జనార్‌కు మంచి మార్కులు పడటంతో ఆయన్ని ఎండీగా నియమించారని టాక్‌. అయితే ఆర్టీసీలో మంత్రి పువ్వాడ ప్రాధాన్యాన్ని తగ్గించేలా ముఖ్యమంత్రి చర్యలు ఉన్నాయని మరికొందరి అభిప్రాయం.

సజ్జనార్‌ ఏం చేయాలో ఇప్పటికే సంకేతాలిచ్చారా?

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిగా సజ్జనార్‌కు ఎంతో పేరుంది. పైగా ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్. దిశా ఘటన తర్వాత ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. అలాంటి వ్యక్తి ఆర్టీసీకి ఎండీగా రావడంతో సంస్థ పురోగతిపై అంతా చర్చించుకుంటున్నారు. జూనియర్‌ మంత్రి అయిన పువ్వాడ అజయ్‌ చెబితే సీనియర్‌ ఐపీఎస్‌ అయిన సజ్జనార్‌ వింటారా? ఒక ప్రణాళిక పెట్టుకుని పనిచేసే అధికారిగా పేరున్న సజ్జనార్‌.. ఆర్టీసీలో ఏం చేయాలో ప్రభుత్వం ఇప్పటికే చెప్పిందని టాక్‌. అందుకే ఇకపై సంస్థలో మంత్రికి పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చని ఉద్యోగ వర్గాల వినికిడి. అయితే పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఆర్టీసీలో ఎండీ మారితే పరిస్థితి మారుతుందా అన్నది కూడా ప్రశ్నే. మరి.. తెలంగాణ ఆర్టీసీలో అంతా ఆశించిన మార్పు వస్తుందో లేదో చూడాలి.

Show comments