Site icon NTV Telugu

YCP : అకస్మాత్తుగా ఆ వైసీపీ ఎంపీ ఎందుకు వేడి పుట్టిస్తున్నారు?

Ellur Ycp

Ellur Ycp

కోటగిరి శ్రీధర్‌. ఏలూరు వైసీపీ ఎంపీ. సీనియర్‌ పొలిటీషియన్‌ కోటగిరి విద్యాధరరావు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రీధర్‌.. తండ్రి స్థాయిలో ప్రభావం చూపడం లేదన్నది అనుచరుల మాట. 2019లో ఎంపీగా గెలిచాక.. నియోజకవర్గ పరిధిలోనే నల్లపూస అయిపోయారు. అప్పుడప్పుడూ వైసీపీ కార్యక్రమాలకు హాజరు కావడమే తప్ప.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా పెద్దగా కనిపించని పరిస్థితి. అలాంటి శ్రీధర్‌.. కొత్త కొత్త కామెంట్స్‌తో చర్చల్లో వ్యక్తిగా మారిపోయారు. కీలక అంశాలనే టచ్‌ చేస్తూ.. కొత్త ప్రశ్నలకు ఆస్కారం ఇస్తున్నారు.

తిరుమలలో బీజేపీ, వైసీపీ సంబంధాలపై వ్యాఖ్యలు చేసిన శ్రీధర్‌.. ఏలూరులో జరిగిన పార్టీ ప్లీనరీలో మరో అడుగు ముందుకేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని సీఎం జగన్‌ త్వరలో పరిష్కరిస్తారని చెప్పకొచ్చారు. అక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో.. సీఎం జగన్‌ దేశానికి ప్రధాని అయ్యే అవకాశం ఉందని జోస్యం కూడా చెప్పేశారు శ్రీధర్‌. మూడేళ్లుగా సైలెంట్‌గా ఉన్న ఎంపీ.. ఎందుకిలా మారిపోయారు? సంచలన అంశాల జోలికి ఎందుకెళ్తున్నారు? అనేది పొలిటికల్‌ సర్కిళ్లలో జరుగుతున్న చర్చ.

ఆ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలు.. మంత్రులు.. కోఆర్డినేటర్లతో నిర్వహించిన సమావేశాల్లో జనంలో లేని నేతలకు ఈసారి అవకాశం ఇవ్వబోనని సీఎం జగన్‌ తేల్చి చెప్పడంతో ఎంపీ శ్రీధర్‌ ఆలోచనలో పడ్డారట. వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని చూస్తున్న ఆయన.. అధినేత హెచ్చరికలు ప్రతికూలంగా మారకుండా జనం అటెన్షన్‌ కోసం ప్రయత్నిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. సీఎం జగన్‌ను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని టాక్‌. పార్టీ ప్లీనరీలో ఎంపీగా తాను చేసింది ఏంటో.. చేయబోయేది ఏంటో చెప్పకుండా.. ఏదేదో ప్రస్తావించి వైసీపీ వర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తించారు.

ఏలూరు పార్లమెంట్ పరిధిలోని దెందులూరు.. పోలవరం మినహా మిగతా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలతో ఎంపీ శ్రీధర్‌కు సఖ్యత లేదని చెబుతారు. చింతలపూడి, నూజివీడుల్లో గ్రూపు రాజకీయాలకు తెరతీశారనే విమర్శలు ఎంపీపై ఉన్నాయి. నియోజకవర్గాల్లోని నేతలతోనూ పెద్దగా సంబంధాలు లేవని.. విద్యాధర్‌రావు.. శ్రీధర్‌ పనితీరుల్లో ఎంతో తేడా ఉందని కేడర్‌ చెవులు కొరుక్కుంటోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో శ్రీధర్‌కు టికెట్ కష్టమనే ప్రచారం చాపకింద నీరులా మొదలైంది. ఆ విషయం తెలిసే.. ఎంపీ రూటు మార్చేశారని అనుమానిస్తున్నారు. మొత్తానికి తన సీటుకు ఎసరు రాకుండా శ్రీధర్‌ వేస్తున్న ఎత్తుగడల్లో భాగంగానే ఆయన కామెంట్స్‌ను చూస్తున్నాయి పార్టీ శ్రేణులు. మరి.. మారిన వైఖరి ఎంపీ శ్రీధర్‌కు ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

 

Exit mobile version