Site icon NTV Telugu

టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి ఆ ముగ్గురు ఎందుకు దూరం.. !

ఒకవైపు ఉపఎన్నిక.. ఇంకోవైపు పార్టీ ప్లీనరీ. టీఆర్‌ఎస్‌కు ఈ రెండూ ముఖ్యమే. కానీ.. పార్టీ ప్లీనరీకి హుజురాబాద్‌ ఉపఎన్నిక ప్రచారంలో ఉన్న టీఆర్ఎస్‌ నేతల రాలేదు. వదలరు.. కదలరు అన్నట్టు అక్కడే అతుక్కుపోయారు. ఇదే అధికారపార్టీలో చర్చగా మారింది. ఎందుకిలా? ప్లీనరీలో హుజురాబాద్‌పై గులాబీ బాస్‌ చేసిన ప్రకటనను పార్టీ వర్గాలు ఎలా చూస్తున్నాయి?

హుజురాబాద్‌ నుంచి కాలు బయట పెట్టొద్దని ఆదేశాలు?

హుజురాబాద్‌ ఉపఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. ప్రధాన పార్టీల దృష్టి అంతా 30న జరిగే పోలింగ్‌పై ఉంది. చివరి క్షణంలో రచించాల్సిన వ్యూహాలు.. వేయాల్సిన రణతంత్రపు ఎత్తుగడల నుంచి పార్టీ నేతల దృష్టి మరో అంశంపై మళ్లడం లేదు. టీఆర్ఎస్‌ తరఫున గెలుపు బాధ్యతలను భుజన వేసుకుని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు మంత్రులు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, పార్టీ సీనియర్‌ నేత బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, గాదరి కిశోర్‌, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. మరికొందరు నేతలు కూడా ఇదే పనిలో ఉన్నారు. 27తో ప్రచారం ముగుస్తుంది. అందుకే హుజురాబాద్‌ నుంచి కాలు బయటపెట్టడానికి గులాబీ నేతలు ఇష్టపడటం లేదు.

టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి కూడా ప్రచారంలో ఉన్న నేతలు దూరం..!

హుజురాబాద్‌ ఉపఎన్నిక జరుగుతున్న సమయంలోనే టీఆర్‌ఎస్ 20 ఏళ్ల ప్రస్థానం వేడుకలు.. ప్లీనరీ వచ్చాయి. వాస్తవానికి పార్టీ వేడుకలంటే వేదికపై మంత్రి హరీష్‌రావు కూడా ఆకర్షణగా ఉంటారు. ఉద్యమ సయమం నుంచి ఉన్న నాయకులు.. పార్టీలో సీనియర్‌ పొజిషన్‌లో ఉన్నవాళ్లూ స్టేజ్‌పై కనిపిస్తారు. కానీ.. హుజురాబాద్‌ ఉపఎన్నిక ప్రచారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ నాయకులు ఎవరూ పార్టీ ప్లీనరీలో కనిపించలేదు. బై ఎలక్షన్‌ను పార్టీ సీరియస్‌గా తీసుకుందని తెలిసినా.. ఆ తీవ్రత ఎంతనేది ప్లీనరీ స్పష్టం చేసింది.

ప్రచారంలో ఉన్న నేతలను ప్రస్తావించిన గులాబీ బాస్‌..!

మనసులో టీఆర్ఎస్‌ ప్లీనరీలో పాల్గొనాలని ఉన్నా.. హుజురాబాద్‌ నుంచి ఇంచు కూడా కదలొద్దని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయట. మీరు అక్కడే ఉండండి.. ఈ సమయంలో హుజురాబాద్‌లో మీరు ఉండటం ఎంతో కీలకం అని పెద్దలు స్పష్టం చేశారట. అందుకే హుజురాబాద్‌ పొలిమేరలు దాటే సాహసం చేయలేదు ప్రచారంలో ఉన్న గులాబీ నేతలు. పైగా ప్లీనరీలో ప్రసంగించిన గులాబీ దళపతి కేసీఆర్‌.. హుజురాబాద్‌ ఉపఎన్నిక ప్రస్తావన చేశారు. అక్కడ ప్రచారంలో ఉన్న టీఆర్ఎస్‌ నేతల గురించి కూడా మాట్లాడారు. దీంతో ప్లీనరీకి వెళ్లలేకపోయినా.. అక్కడ తమ ప్రస్తావన ఏకంగా పార్టీ బాస్‌ నోటి నుంచే రావడంతో హుజురాబాద్‌లోని నాయకులు ఖుషీ అయ్యారట. మరి.. పార్టీ ప్లీనరీకి కూడా హాజరుకాకుండా హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ వేస్తున్న ఎత్తుగడలు ఏ మేరకు వర్కవుట్‌ అయ్యాయో నవంబర్‌ 2 వరకు ఆగాల్సిందే.

Exit mobile version