NTV Telugu Site icon

TCongress : టీ-కాంగ్రెస్ చింతన్ శిబిర్ ఎవరి లక్ష్యంగా జరిగింది.?

Revanth

Revanth

తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా రెండు రోజుల పాటు చింతన్ శిబిర్ నిర్వహించింది. నాయకులు వచ్చారు…తీర్మానాలు చేసి వెళ్ళారు. కానీ…నాయకులు..క్యాడర్‌కి ఏం చెప్పారనే చర్చ మొదలైంది. చింతన్ శిబిర్‌లో వేసిన కమిటీ చైర్మన్ల సమావేశం ముగియక ముందే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి టాగూర్ వెళ్ళిపోయారు. నాయకులు అంతా..మనసు విప్పి చెప్పండి సమస్యలు అంటే…ఇన్నాళ్ళు గోప్యంగా నడిచిన వ్యవహారం అంతా…నాయకులు ఓపెన్ చేశారు. సమస్యలు బయటకు చెప్పిన వారంతా…ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. కనీసం టాగూర్ చెప్పిన సమస్యలకు సమాధానం కూడా ఇవ్వకపోవడం ఏంటనే చర్చ జరిగింది. దీనికి తోడు…పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కూడా ఉంటుంది అని చెప్పి…దాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. ఏదో జరుగుతోందని నాయకులు అంతా ఓపెన్ అయిపోతే….తలనొప్పి తెచ్చుకున్నట్టు మారిపోయింది అని అనుకుంటున్నారట.

పార్టీ చేసిన తీర్మానంలో..ప్రధానంగా రెండు అంశాలు చర్చకు వచ్చాయి. పార్టీ విధానాలకు అందరూ కట్టుబడి ఉండాలని..రెండోది వ్యక్తి పూజ మానుకోవాలి అనే రెండు రాజకీయ తీర్మానాలు చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై ఇన్నాళ్లు పార్టీలో కొందరు సీనియర్ నేతలు ఈ రెండు అంశాల మీదనే విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు సమావేశంలో తీర్మానాలు కూడా ఇవే చేయడంతో రేవంత్‌ను ఉద్దేశించే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని టాక్. సరిగ్గా ఇదే సమయంకి రేవంత్ రెడ్డి లేకపోవడం తో… వ్యతిరేక శిబిరం ఇలాంటి నిర్ణయాలు చేశారనే రేవంత్ శిబిరంలో చర్చ జరుగుతోంది. పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి…లేకుండా చింతన్ శిబిర్ నిర్వహించడంపైనా చర్చలు జరుగుతున్నాయి. ఏఐసీసీ షెడ్యూల్ ప్రకారం సమావేశం జరిగిందని చెప్తున్నారు నేతలు. ఏఐసీసీ చెప్పినా…రేవంత్ విదేశీ పర్యటనకు వెళ్ళారా..? నేను లేకుండా సమావేశాల ఎలా జరుగుతాయని చూడాలని అనుకున్నారా?అనే టాక్ ఉంది. పార్టీ సీరియస్‌గా విధానపరమైన నిర్ణయాలు…వచ్చే ఎన్నికల కోసం చేస్తున్న సభలో రేవంత్ లేకపోవడంతో రాంగ్ ఇండికేషన్ వెళ్ళినట్లయిందనేది కొంతమంది వాదన.

రేవంత్‌ను వ్యతిరేకించే టీం నాయకులే…చింతన్ శిబిర్‌లో కీలకంగా పని చేయడం…పార్టీలో కొన్ని అనుబంధ సంఘాల నాయకులు కూడా ఒకరిద్దరు సీనియర్ నాయకుల వద్ద రేవంత్ లేకుండా జరిగిన సమావేశాలపై కామెంట్స్ కూడా చేశారు. సమావేశాలు ముగిసిన వెంటనే…చింతన్ శిబిర్ సమావేశ ప్రాంగణంలోనే pac నిర్వహించాలని అనుకున్నారు. ఠాగూర్ హడావుడిగా వెళ్లిపోవడం…Pac సమావేశం రద్దు అవ్వడం…వెనక పెద్ద రాజకీయమే నడిచిందనే టాక్ ఉంది.