Site icon NTV Telugu

టీడీపీలో త్యాగాల పేరిట కీలక నాయకుల సీటుకే ఎసరు?

Tyaga Raju

Tyaga Raju

ఎన్నికలకు ఇంకా రెండేళ్లు గడువు ఉన్నా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధాన పార్టీలలో హడావిడి మొదలైంది. సీట్ల మార్పులు చేర్పులపై చర్చలు జోరందుకున్నాయి. ఈ తరహా చర్చలు టీడీపీలో కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ప్రత్యేకించి సీనియర్లలో చాలా టెన్షన్ కనిపిస్తోందట. దశాబ్దాలుగా టీడీపీలో ఉంటూ పదవులు పొందిన నాయకుల సీటుకే ప్రస్తుతం ఎసరు వచ్చినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయట. దానికి తగ్గట్టుగానే అధినేత చంద్రబాబు కామెంట్స్‌ ఉంటున్నాయట.

ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్లు.. చంద్రబాబుతోపాటు.. నారా లోకేష్‌తోనూ సమావేశం అయ్యారట. ఆ సందర్భంగా జరిగిన చర్చ నేతలకు నిద్రను దూరం చేసిందట. మీరు పార్టీలో చాలా సీనియర్ లీడర్లు. చాలా పదవులే చూశారు. మారిన రాజకీయ పరిస్థితులు.. స్థానికంగా ఉన్న సమీకరణాల వల్ల త్యాగాలు చేయాల్సి రావొచ్చని ముఖం మీదే చెప్పేశారట. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. కొద్దిరోజులుగా ఆయన సైలెంట్‌గా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిన తర్వాత పెద్దగా జనాల్లో కనిపించింది లేదు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యే సీట్‌ ఆశిస్తున్నారట కిష్టప్ప. పనిలో పనిగా.. తన కుమారుడికి కూడా ఛాన్స్ ఇప్పించాలనే ఆశతో కిష్టప్ప ఉన్నారు. ఇదే అజెండాతో చంద్రబాబును కలిసి మాట్లాడిన సమయంలో.. ఆయన పార్టీ కోసం కష్టపడి పని చేయాలని కిష్టప్పకు సూచించారట. ఇక త్యాగాలు చేయాల్సిన టైం వచ్చిందని లోకేష్‌ చెప్పడంతో కిష్టప్పకు ఫీజులు ఎగిరిపోయాయట. అలా అన్న లోకేష్‌కి ఏం చెప్పాలో తెలియక దిగులు చెందారట. కిష్టప్పకు సూటిగా సమాధానం వచ్చినప్పటీకీ మిగిలిన నేతలు విషయంలో వచ్చిన సమాధానం మరోలా ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

నిమ్మల కిష్టప్పకు తగిలిన షాక్‌తో అలర్ట్ అయిన సత్యసాయి జిల్లాకు చెందిన మరో ఇద్దరు నేతలు చంద్రబాబును కలిసి టికెట్‌పై క్లారిటీ తీసుకుందామని అనుకున్నారట. అధినేత మాత్రం ముందు పార్టీ కోసం పని చేయండి.. జనంలోకి వెళ్లాలని సూచించారట. ఆ తర్వాత లోకేష్‌ దగ్గరకు వెళ్లగానే కిష్టప్పకు చెప్పినట్టే వారికీ బదులిచ్చారట. త్యాగాలు చేయాలి అని లోకేష్‌ అనగానే ఆ నేతల నోట మాట లేక వెళ్లినదారిలోనే వెనక్కు వచ్చేశారట. తమలాంటి సీనియర్లకు ఏ ఇబ్బందులు లేకుండా సీట్‌ చేతిలో పెడతారని అనుకుంటుంటే.. ముందు పని చేయండి తర్వాత చూద్దాం అనే ధోరణిలో అధినేతల నుంచి సమాధానం రావడం వారు ఊహించలేదట. మరోవైపు బాస్‌లు ఏం చెప్పారో.. తమకూ చెప్పాలని కేడర్‌ అడుగుతుంటే బదులివ్వలేక సతమతం చెందుతున్నారట ఆ నాయకులు.

మొత్తానికి టీడీపీ నేతలు తీవ్ర నిరుత్సాహంలో పడ్డారు. టికెట్‌ రాదని కానీ.. ఇస్తామని కానీ చెప్పకుండా గందరగోళంలో పెట్టారట చంద్రబాబు, లోకేష్‌. త్యాగాలు అనే పదంతో మాత్రం పరోక్షంగా రాబోయే రోజుల్లో జరగబోయేది చెప్పారని పార్టీ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది.

 

 

Exit mobile version