Site icon NTV Telugu

టీఆర్ఎస్ లో ‘పీకే’దెవరిని ? కునుకులేకుండా చేస్తున్న పీకే సర్వే

Pkdeavarini

Pkdeavarini

సీఎం కేసీఆర్‌కు పీకే టీమ్‌ నివేదిక ఇచ్చిందా? కొంత కాలంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సర్వేపై చర్చ జరుగుతోంది. పీకే ఎంట్రీతో పార్టీలో ఏం జరగబోతుంది? టీఆర్‌ఎస్‌లో మార్పులు చేర్పులపై నేతల మధ్య గుసగుసలు ఉన్నాయి. తాజాగా ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐ ప్యాక్… టిఆర్ఎస్ మధ్య ఒప్పందం ఖరారైంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీతో కలిసి పనిచేయనుంది ఆ సంస్థ. ఇప్పటికే పని మొదలుపెట్టిన సర్వే బృందాలు.. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఇమేజ్ తెలుసుకోవడంతోపాటు.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటో వడపోసే పనిలో ఉందట ఐ ప్యాక్ టీం. టీఆర్ఎస్ అధినేత కేసిఆర్‌కు పలు నియెజకవర్గాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులపై ఇప్పటికే నివేదిక ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది.

ఇన్నాళ్లూ పీకే గురించి.. ఆయన బృందాలు ఇచ్చే సర్వే గురించి కొంత చర్చ జరిగినా.. రెండు రోజులుగా ఆ హీట్ మరింత పెరిగింది. పీకే ఇచ్చే నివేదికలు.. సర్వేలతో తమ రాజకీయ భవిష్యత్‌ ఏమౌతుందో అనే టెన్షన్‌లో ఎమ్మెల్యేలు ఉన్నారట. ఇప్పటికే రెండు, మూడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు ఉన్నారు. అక్కడ కొంత వ్యతిరేకత ఉంటుందని.. అదే ప్రామాణికంగా భావించి నివేదిక ఇస్తే ఎలా అన్నది MLAల ప్రశ్న. ఆ సర్వే ఆధారంగా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఎమ్మెల్యేలలో గుబులు పట్టుకుందట. ప్రస్తుతం నియోజకవర్గంలోని గుట్టంతా హైకమాండ్‌కు తెలిసిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన కొందరు సిట్టింగ్‌లు చాలా టెన్షన్‌లో ఉన్నట్టు సమాచారం. సరిగా నిద్రపోవడం లేదట. కనిపించిన వాళ్లను తమ రాజకీయ భవిష్యత్‌పై ఆరా తీసే పనిలో పడ్డారట.

ఒకవైపు.. ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన ఎంట్రీ దాదాపు ఖాయమన్నది కాంగ్రెస్‌ వర్గాల వాదన. ఆ చర్చలు జరుగుతున్న సమయంలోనే పీకే.. నేరుగా హైదరాబాద్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఐప్యాక్‌తో కుదిరిన ఒప్పందంపై ఆరా తీస్తూనే.. పొత్తుల విషయం ఏమైనా చర్చకు వచ్చిందా అని కూపీ లాగుతున్నారట. ఒకవేళ అదే జరిగితే తమ సీటు ఎంత వరకు సేఫ్‌.. జరగబోయే రాజకీయ పరిణామాలపై అంచనా వేసుకునే పనిలో ఉన్నారట కొందరు సిట్టింగ్‌లు. అయితే పొత్తులపై టీఆర్ఎస్‌తోపాటు పీకే బృందాలు కూడా మౌనంగానే ఉన్నాయి.

ఇదే సమయంలో మీడియాలో జరుగుతున్న ప్రచారం గులాబీ శిబిరంలో ఆసక్తిగా మారుతోంది. కొన్ని జిల్లాల్లో కొందరు ప్రజాప్రతినిధుల తీరుపై స్పష్టమైన నివేదిక ఇచ్చారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే ఐప్యాక్‌ సంస్థ ఇప్పటి వరకు టీఆర్ఎస్‌కు ఎటువంటి నివేదిక ఇవ్వలేదని తెలుస్తోంది. అప్పటి వరకు అధికారపార్టీ నేతలు రిలాక్స్‌ కావొచ్చని ఊపిరి పీల్చుకుంటున్నారట. మొత్తానికి గులబీ శిబిరంలో సర్వే అంశం ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టిస్తుందనే చెప్పాలి.

Watch : https://youtu.be/9uwC3vvxalI

Exit mobile version