NTV Telugu Site icon

మదన్ మోహన్ వెనకున్నది ఎవరు..ఆ మూడు చోట్ల ఎందుకు కన్నేశారు ?

Hastina Vyham

Hastina Vyham

కలకుంట్ల మదన్‌ మోహన్‌రావు. తెలంగాణ కాంగ్రెస్‌ ఐటీ విభాగం ఇంఛార్జ్‌. గత లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్‌ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలంగా మదన్‌ మోహన్‌ తీరు పార్టీలో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. కాంగ్రెస్‌ సీనియర్లను కాదని.. కార్యకర్తల ప్రమేయం లేకుండా కామారెడ్డి జిల్లాలో ఆయన వ్యవహరిస్తున్న తీరు పార్టీలు సెగలు రేపుతోంది. ఈ దఫా ఆయన ఎంపీగా కాకుండా అసెంబ్లీకి పోటీ చేయాలని చూస్తున్నారు. ఆ క్రమంలోనే కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడలపై ఆయన కన్నేసినట్టు టాక్‌. లోకల్‌ లీడర్స్‌కు సమాంతరంగా ఈ మూడు చోట్లా పార్టీ కార్యక్రమాలను చేస్తున్నారు మదన్‌మోహన్‌. దీంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోతున్న పరిస్థితి ఉందట.

ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనలను మదన్‌ మోహన్‌ వర్గం వేరేగా నిర్వహించింది. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసుకొచ్చి కార్యక్రమాలు చేయడం తలనొప్పులు తెచ్చిపెట్టిందట. మదన్‌ మోహన్‌కు సొంత ఫౌండేషన్‌ ఉంది. ఆ బ్యానర్‌పై కార్యక్రమాలు చేపడితే ఇబ్బంది లేదని.. కానీ.. కాంగ్రెస్‌ బ్యానర్‌పై రోడ్డెక్కడం స్థానిక నాయకులకు రచించడం లేదట.

మదన్‌ మోహన్‌ తీరుపై పార్టీలో చర్చ జరుగుతున్న సమయంలోనే ఆయన్ని కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేస్తూ అక్కడి జిల్లా అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవడం కలకలం రేపింది. వెంటనే పీసీసీ ఎంట్రీ ఇచ్చింది. మదన్‌ను సస్పెండ్‌ చేసే అధికారి మీకు ఎక్కడిది అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌గౌడ్‌ అక్కడి డీసీసీకి షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. మొత్తానికి కామారెడ్డి జిల్లాలో సీనియర్ కాంగ్రెస్‌ నాయకుల మధ్య ఉన్న వర్గపోరు రకరకాల మలుపులు తిరుగుతోంది. పార్టీలోని ప్రత్యర్థులపై పైచెయ్యి సాధించేందుకు తెరవెనక చక్రం తిప్పుతున్నది ఎవరు? మదన్‌ మోహన్‌ను ముందు పెట్టి పొలిటికల్ డ్రామా ఆడుతోంది ఎవరు అన్నదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎవరికి వారు హైకమాండ్‌తో తమకున్న పరిచయాలను గ్రౌండ్‌ ఫైట్‌లో వాడేసుకుంటున్నారు. దీంతో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ రాజకీయం హీటెక్కుతోంది. కేడర్‌లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు మాత్రం పార్టీ నేతలు ఎవరూ ప్రయత్నించడం లేదు. మరి.. కాంగ్రెస్‌ పరిస్థితి హస్తవ్యస్తం కాకుండా దిద్దుబాటు చర్యలు చేపడతారో లేక.. ప్రేక్షకపాత్ర పోషిస్తారో చూడాలి.