NTV Telugu Site icon

కాంగ్రెస్ పార్టీలో కొందరు జిల్లా అధ్యక్షులపై వేటు పడనుందా?

Dcc 1 Copy

Dcc 1 Copy

తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కత్తి పట్టుకుని కూర్చున్నారు. 32 జిల్లాల్లో పార్టీ నాయకత్వం పై భారీగానే మార్పులు చేర్పులు చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ సందర్భంగా కొందరికి కోత పెట్టడానికి కూడా సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చేదంతా ఎన్నికల సీజన్ కావడంతో.. మాజీ మంత్రులు.. మాజీ ఎమ్మెల్యేస్థాయి నాయకులకే పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో ఉన్నారట. ఎమ్మెల్యేలు ఉన్నచోట వారికే డీసీసీ పదవులు కట్టబెటడతారని తెలుస్తోంది.
..spot..

జిల్లాలో బలమైన నాయకుడు అనే ముద్ర ఉండటంతోపాటు.. అధికారులపై అజమాయిషీ చేయగల నాయకత్వం ఉండాలన్నది పీసీసీ ఆలోచన. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ కావాలని మెజారిటీ డీసీసీ అధ్యక్షులే చెప్పారు. కానీ.. వారిలో చాలామందిని ప్రస్తుతం తప్పిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పనిని ప్రామాణికంగా తీసుకుని పదవులు అప్పగిస్తారనేది పార్టీ వర్గాల వాదన. ఇదే సమయంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ను కమిటీ కూర్పు కోసం మూడు జిల్లాలుగా విభజించే చర్చ పార్టీలో ఉన్నట్టు సమాచారం.

ప్రస్తుతం ఉన్న జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల్లో 14 మంది కొనసాగే అవకాశం ఉందట. మిగిలిన వారికి కోత పడినట్టేనని గట్టిగా గుసగుసలు వినిపిస్తున్నాయి. పదవి కోల్పోయే వారిలో కొత్తగా ఏర్పడిన జిల్లాల డీసీసీలే ఎక్కువగా ఉన్నారట. ఆసిఫాబాద్ డీసీసీ విశ్వప్రసాద్‌రావును తప్పించే అవకాశం ఉందట. కరీంనగర్‌ జిల్లా బాధ్యతల నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ తప్పించి.. నియోజకవర్గం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టిస్తారని సమాచారం. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కొమరయ్యకు గేట్‌ పాస్‌ తప్పదంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్‌కు రేవంత్‌ టీమ్‌లో చోటు ఉండబోదని.. భూపాలపల్లి డీసీసీ ప్రకాష్‌రెడ్డికి కూడా కొనసాగింపు డౌటే అని అనుకుంటున్నారట.

జనగాం డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవను తప్పిస్తారని బలంగానే ప్రచారం జరుగుతోంది. ఆయన్ని పీసీసీ కమిటీలోకి తీసుకోవచ్చనే వాదన ఉంది. మెదక్ dcc తిరుపతిరెడ్డి, రంగారెడ్డి DCC చల్లా ధర్మారెడ్డిలకు పదవుల నుంచి ఉద్వాసన తప్పదని సమాచారం. రంగారెడ్డి జిల్లా బాధ్యతలను మాజీ ఎమ్మెల్యేకి ఇస్తున్నట్టు టాక్‌. మహబూబ్ నగర్ dcc పోస్టులో చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు. ఆయన్నీ పీసీసీలోకి తీసుకుంటారని తెలుస్తోంది.

వనపర్తి డీసీసీ శంకర్ ప్రసాద్, జోగులాంబ జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డిలను కూడా మార్చి కొత్త వారిని తీసుకొస్తారట. నాగర్ కర్నూల్ DCC వంశీకృష్ణ.. మహబూబాబాద్ DCC భరత్‌ చంద్రారెడ్డిలు పీసీసీ చీఫ్‌ టీమ్‌లో ఉండే అవకాశం లేదట. అనారోగ్యంతో బాధపడుతున్న ములుగు డీసీసీ కుమార స్వామిని తప్పించాలని అనుకుంటున్నా.. ఎమ్మెల్యే సీతక్క ఆయన్ని కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారట. కుమారస్వామి కూడా పని చేయడానికి సుముఖంగా ఉన్నట్టు పార్టీకి చెప్పినట్టు తెలుస్తోంది.

నారాయణపేట డీసీసీ శివ కుమార్ రెడ్డి, ఖమ్మం DCC దుర్గ ప్రసాద్ లకు కొనసాగింపు ఉండే అవకాశం లేదు. కొత్తగూడెం డీసీసీ అధ్యక్షుడుగా mla పొదెం వీరయ్య కొనసాగుతున్నారు. ఆరోగ్యం సహకరించక పార్టీ బాధ్యతల నుంచి తప్పించాలని కోరారాట. కానీ.. పార్టీ అందుకు సుముఖంగా లేనట్టు సమాచారం. ఈ మార్పులు చేర్పుల గురించి తెలిసినప్పటి నుంచీ తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చ వీటి చుట్టూనే తిరుగుతోంది. ఎవరు ఉంటారు? ఎవరిని తప్పిస్తారు అనే దానిపై పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. మరి.. రేవంత్‌ టీమ్‌లో ఉండేదెవరో.. దూరం అయ్యేదెవరో ఏంటో చూడాలి.

Watch Here : https://youtu.be/3PAlRig6-HE