NTV Telugu Site icon

BJP : ఈటల బృందం వ్యూహం ఏంటి ? సత్తా నిరూపించకపోతే ఇబ్బందేనా

Bjp

Bjp

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ తర్వాత తెలంగాణలో వరస కార్యక్రమాలకు ప్లాన్‌ చేస్తున్నారు కమలనాథులు. హైదరాబాద్‌లో మీటింగ్స్ ముగిసిన 24 గంటల్లోనే మూడు కమిటీలు ప్రకటించి తమ దూకుడేంటో తెలియజెప్పారు. వీటిల్లో చేరికల కమిటీ పెద్ద చర్చకే దారితీస్తోంది. మొన్నటి వరకు ఆ చేరికల కమిటీకి బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి నేతృత్వం వహించారు. తాజాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సారథ్యంలో చేరికల కమిటీని సిద్ధం చేసింది ఢిల్లీ నాయకత్వం.

ఈటల నేతృత్వంలోని చేరిక కమిటీలో 8 మంది సభ్యులు ఉంటే.. అందులో ఆరుగురు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చినవాళ్లే. ప్రధాని మోడీ సభలో బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సైతం ఆ కమిటీలో చోటు ఇచ్చారు. వీళ్లందరికీ తెలంగాణలో పెద్ద టాస్కే అప్పగించారని చర్చ జరుగుతోంది. బీజేపీలో చేరినా తమకు సరైన గుర్తింపు లేదని ఇబ్బంది పడుతున్న నాయకులందరికీ గురుతర బాధ్యతలే ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు. వీళ్లంతా ఎంత మందిని బీజేపీలోకి తీసుకొస్తారో ఏమో.. కాకపోతే ఎవరి సత్తా ఏంటో నిరూపించుకోక తప్పని పరిస్థితి కల్పించింది ఢిల్లీ బీజేపీ నాయకత్వం. బీజేపీలో చేరాక తొలిసారి పార్టీ ఆఫీసుకు వచ్చిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. తనకు కల్పించిన ప్రాధాన్యంపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే నెలకొక్కరి చొప్పన బీజేపీలో నాయకులను చేర్పిస్తానని వెల్లడించారు. కమిటీలోని ఇతర నాయకులు మాత్రం ఇంకా పెదవి విప్పలేదు.

చేరికల కమిటీలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్‌, మాజీ ఎంపీలు వివేక్‌ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్‌, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌ ఉన్నారు. వీరిలో లక్ష్మణ్‌, ప్రదీప్‌లు బీజేపీలో పాత కాపులు. మిగతావాళ్లంతా ఇతర పార్టీల నుంచి బీజేపీకిలోకి వచ్చినవాళ్లే. తెలంగాణలో రాజకీయ వాతావరణం వాడీవేడిగా ఉండటంతో చాలా మంది జంపింగ్‌లపై దృష్టిపెట్టారు. అధికార టీఆర్ఎస్‌తోపాటు.. కాంగ్రెస్‌ కూడా గట్టిగానే ఆకర్షణ వల విసురుతోంది. ఇటీవల కాలంలో చేరికల విషయంలో కాంగ్రెస్‌ కాస్త దూకుడు ప్రదర్శిస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్‌ వాళ్లను లాగేస్తున్నారు కాంగ్రెస్‌ నాయకులు. బీజేపీ కార్పొరేటర్లకు ఆ మధ్య టీఆర్ఎస్‌ గులాబీ కండువా కప్పేసింది. దీంతో ఈటల అండ్‌ కో చేరికలపై ఎలాంటి వ్యూహంతో వెళ్తుంది అన్నది ప్రశ్న. చిన్నా చితకా లీడర్లను తీసుకొస్తే పెద్దగా గుర్తింపు ఉండదు.. పైగా మీ సత్తా ఇంతేనా అనే విమర్శలు వస్తాయి. అందుకే టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల్లో ఎవరికి గురి పెడుతున్నారు? ఆయా పార్టీల్లో వారికున్న పాత పరిచయాలను ఏ మేరకు ఉపయోగించుకుని బీజేపీని బలోపేతం చేస్తారు అన్నది చర్చ.

బీజేపీలో చేరికల విషయంలో నాయకులు ఇగోలను పక్కన పెట్టాలని జాతీయ నాయకత్వం సూటిగా సుత్తిలేకుండా చెప్పేసింది. ఇంద్రసేనారెడ్డి చేసిన ప్రయత్నాలకు ఆ మధ్య ఇలాంటి ఇగోలే ఇబ్బంది పెట్టాయి. జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాక.. తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమైన అమిత్ షా, జేపీ నడ్డాలు ఈ విషయంలో గట్టిగానే తలంటినట్టు తెలుస్తోంది. అందుకే చేరికల కమిటీ కూర్పును సైతం ఢిల్లీ పెద్దలే డిసైడ్‌ చేశారట. ఈ అంశానికి జాతీయ నాయకత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అభిప్రాయ పడుతున్నారు. అంతేకాదు.. చేరికల విషయంలో ఏ అవసరం వచ్చినా.. వెంటనే తమను కలవొచ్చని.. ఏ సమయంలోనైనా తాము అందుబాటులో ఉంటామని అమిత్ షా, నడ్డా వెల్లడించారు. దాంతో చేరికల కమిటీలోని ఈటల అండ్‌ కోకు పెద్ద సవాళ్లే ఎదురు కానున్నాయని టాక్‌.