చీరాల మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావు పార్టీ మార్పుపై చాలాకాలం నుంచి వదంతులు షికారు చేస్తున్నాయి. గతంలో టీడీపీ నుంచి రెండుసార్లు గెలిచిన పాలేటి.. పలు పార్టీలు మారి ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్‌తో కలసి వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. ఎవరికి మద్దతుగా నిలుస్తారో చెప్పలేమన్నది అభిమానుల మాట. ఆ మధ్య కొంతకాలం ఎమ్మెల్యే బలరామ్‌తో కొంత గ్యాప్ వచ్చినా మళ్లీ సర్దుకున్నారు.
కొన్నాళ్లుగా చీరాల అంటే ఎమ్మెల్యే బలరామ్.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య వార్‌పై చర్చ సాగేది. ప్రస్తుతం రెండు వర్గాలు కాస్త సద్దుమణిగాయి. పార్టీ శ్రేణులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఇదే సమయంలో ఊహించని వివాదంతో పార్టీలో రచ్చ రచ్చ అవుతోంది. చీరాల టీడీపీ ఇంఛార్జ్‌గా బీసీ సామాజికవర్గానికి చెందిన MM కొండయ్య వచ్చారు. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ.. వైసీపీలోని ఒక వర్గం పాలేటి కూడా మారిపోతారని సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టింది. ఇప్పుడు కాదు.. ఎన్నికల సమయంలో పాలేటి పార్టీ జంప్ చేస్తారని మరోవర్గం కౌంటర్ ఇచ్చింది. ఈ పోస్టింగ్‌లపై పాలేటి ప్రధాన అనుచరులు గవిని శ్రీనివాసరావు పరుష పదజాలంలో అదే సోషల్ మీడియా గ్రూప్‌లో విరుచుకుపడ్డారు. ఆ వివాదం కాస్తా ముదిరి రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. పోలీస్ కేసుల వరకు సమస్య తీవ్రత చేరింది.
కేసులంటే ఏవో చిన్న సెక్షన్లు కాదు.. ఏకంగా ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మొత్తం మూడు కేసులు నమోదు చేయడం.. ఇలా గొడవ పడుతున్న వైసీపీలోని రెండు వర్గాలు ఎమ్మెల్యే బలరామ్ మద్దతుదారులుగా ఉండటం చర్చగా మారింది. గతంలో కూడా పాలేటి అనుచరుడు గవినిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఒక కేసు నమోదైంది. అప్పుడు కూడా వైసీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు కట్టారు పోలీసులు. ఇప్పుడు తాజా వివాదం దానికి తోడైంది. దీంతో సమస్య దళిత, బీసీ సామాజికవర్గాల గొడవగా మారిపోయిందని ఆందోళన చెందుతున్నరట పార్టీ నేతలు. సమస్య సున్నితంగా మారడం.. రెండు సామాజికవర్గాల్లో వైసీపీ బలంగా ఉండటంతో.. ఎవరినీ నొప్పించకుండా పరిష్కారానికి కృషి చేస్తున్నారట.
రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రాజుకుంటున్న తరుణంలో చీరాలలో సామాజికవర్గాల మధ్య దూరం వస్తే.. రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని వైసీపీ నేతలు లెక్క లేస్తున్నారు. అందుకే సమస్య శ్రుతిమించకుండా దిద్దుబాటుకు ప్రయత్నిస్తున్నారట నాయకులు. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే పాలేటిపై మొదలైన చర్చ రకరకాల మలుపులు తీసుకోవడం.. ఆసక్తిగా మారింది.