Site icon NTV Telugu

కేటీఆర్‌తో దోస్తీ.. మంత్రి హరీష్‌రావుతో జగ్గారెడ్డి కుస్తీ?

ఆ మంత్రికి.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు మధ్య అంత కెమిస్ట్రీ ఎలా కుదిరింది? అదేజిల్లాకు చెందిన మంత్రిని నిత్యం టార్గెట్‌ చేస్తున్నా.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేతో ఎందుకు కలివిడిగా తిరిగారు? రానున్న రోజుల్లో ఈ పరిణామాలు.. జిల్లా రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తాయా? ఇంతకీ ఎవరా మంత్రులు.. ఎవరా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే?

ఉమ్మడి మెదక్‌ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య వైరమైనా.. స్నేహమైనా హాట్‌ టాపిక్కే. అలాంటి అరుదైన దృశ్యాలకు సంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన వేదికైంది.

హరీష్‌రావు, జగ్గారెడ్డి మధ్య పొలిటికల్‌ గ్యాప్‌..!

సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డితోపాటు.. అధికారపార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొనడం కామన్‌. మంత్రి హరీష్‌రావు సైతం తరచూ సంగారెడ్డి వెళ్తుంటారు. ఆ కార్యక్రమాల్లో మాత్రం జగ్గారెడ్డి పెద్దగా కనిపించరు. ఇద్దిరిదీ ఉమ్మడి మెదక్‌ జిల్లానే కావడంతో పొలిటికల్ గ్యాప్‌ ఉంది. అవకాశం చిక్కినప్పుడల్లా హరీష్‌రావును టార్గెట్‌ చేస్తుంటారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

కేటీఆర్‌తో జగ్గారెడ్డి ఇకఇకలు.. పకపకలు..!

తాజాగా మంత్రి కేటీఆర్‌ సంగారెడ్డిలో పర్యటించారు. ఈ టూర్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తళుక్కుమన్నారు. అంతేకాదు.. కేటీఆర్‌, జగ్గారెడ్డిల మధ్య కనిపించిన పొలిటికల్ కెమిస్ట్రీ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు కనిపించలేదు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశం ఉండటం వల్ల.. సంగారెడ్డి టూర్‌కు హరీష్‌రావు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. హరీష్‌రావు లేరనో ఏమో.. జగ్గారెడ్డి అడ్వాన్స్‌ అయినట్టు ఉన్నారు. కేటీఆర్‌తో ఒకటే ఇకఇకలు పకపకలు. ఇదే కార్యక్రమంలో ఇతర టీఆర్ఎస్‌ ప్రజాప్రతినిధులు పాల్గొన్నప్పటికీ.. ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ప్రాధాన్యం ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి సీఎం కేసీఆర్‌, హరీష్‌రావులపై విమర్శలు గుప్పించే జగ్గారెడ్డి.. కేటీఆర్‌ విషయంలో నెగిటివ్‌ కామెంట్స్‌ చేసిన దాఖలాలు లేవు. గతంలో ఇదే జగ్గారెడ్డి మంత్రి హరీష్‌రావును సన్మానించినా.. ఆ తర్వాత ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు.

కేటీఆర్, జగ్గారెడ్డి కెమిస్ట్రీ చూశాక పార్టీ శ్రేణులకు మైండ్‌ బ్లాంక్‌..!

ఇటవల జరిగిన ఉమ్మడి మెదక్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి హరీష్‌రావుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి జగ్గారెడ్డి భార్య నిర్మల పోటీ చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ఓట్లలో ఒక్క ఓటు తగ్గినా PCC వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి సవాల్‌ చేశారు. చివరకు కాంగ్రెస్‌కు ఉన్న ఓట్ల కంటే 8 ఓట్లు ఎక్కువగానే నిర్మలకు పడ్డాయి. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి తగ్గలేదు. ఇలాంటి సమయంలో మంత్రి కేటీఆర్ రావడంతో జగ్గారెడ్డి రియాక్షన్‌ ఏంటా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ.. కేటీఆర్‌, జగ్గారెడ్డి ముచ్చట్లు.. ఆప్యాయ పలకరింపులు చూశాక టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణులకు మైండ్‌బ్లాంక్‌ అయిందట. మరి.. ఈ కెమిస్ట్రీ రానున్న రోజుల్లో జిల్లా రాజకీయాల్లో ఏమైనా మార్పులుకు నాంది పలుకుతుందా లేక యాధృచ్చికంగానే సరదా సంభాషణలు చోటుచేసుకున్నాయో చూడాలి.

Exit mobile version