NTV Telugu Site icon

TCongress : ఆ పార్టీ ఇంచార్జి ఏమయ్యారు..? పార్టీలో విభేదాలు ఉన్నా పట్టించుకోడంలేదా..?

Congress

Congress

ఆరే ఆరు నెలలు. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు.. ఇతర నాయకులు నోళ్లు కట్టుకుని కూర్చున్నారు. తమ సహజ శైలికి భిన్నంగా మౌనం దాల్చారు. ఆ కూలింగ్‌ పీరియడ్‌ అయిపోయిందని అనుకున్నారో ఏమో.. మళ్లీ పూర్వ పద్ధతిలోకి వచ్చేశారు. కాంగ్రెస్‌లో అంతే అనే రీతిలో విభేదాలకు ఆజ్యం పోస్తున్నారు. నేరుగా పీసీసీ చీఫ్‌కే గురిపెట్టేవారు కొందరైతే.. సీనియరైతే నాకేంటి అనేలా మరికొందరి వైఖరి ఉంది. ఇలాంటి సమస్యలు వస్తే గతంలో AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్నవాళ్లు వెంటనే సర్ది చెప్పేవారు. రాష్ట్ర నాయకులను ఢిల్లీకి పిలవడమో.. లేక వారే హైదరాబాద్‌ గాంధీభవన్‌కు రావడమో చేసేవారు. కానీ.. ప్రస్తుతం తెలంగాణలో AICC ఇంఛార్జ్‌గా ఉన్న ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ ఏమయ్యారో పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదట. అసలు ఆయన ఉన్నారా? ఆయనకు ఇంఛార్జ్‌ అన్న గుర్తు ఉందా అని ప్రశ్నలు సంధిస్తున్నారట.

తెలంగాణ కాంగ్రెస్‌లో పదే పదే పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి మధ్య వైరం బుసలు కొడుతోంది. అసలు వీళ్ల మధ్య గొడవలకు కారణం ఏంటి? సమస్యను పరిష్కరించడం ఎలా అనేది ఇంఛార్జ్‌ ఠాగూర్‌కు పెద్దగా పట్టినట్టు లేదట. ఆయన ఒకవైపే చూస్తున్నారో.. లేక రాష్ట్రం వైపు చూడటం వేస్ట్ అనుకుంటున్నారో కానీ.. కాంగ్రెస్‌ వర్గాలకు పెద్ద మిస్టరీగా మారిపోయారు ఠాగూర్‌. రాష్ట్రంలో ఒకవైపు అధికార టీఆర్ఎస్‌.. ఇంకోవైపు బీజేపీ దూకుడుగా వెళ్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్‌ నేతలు పరస్పరం కయ్యాలకు కాలు దువ్వుతున్నారు. పరిస్థితి శ్రుతిమించి రోడ్డున పడుతున్నా.. ఇంఛార్జ్‌ ఠాగూర్‌ లైట్‌ తీసుకుంటున్నారట.

ఠాగూర్‌ ఢిల్లీలోనే ఉండి.. AICC కార్యదర్శులను పురమాయించి.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిణామాలపై నివేదికలు అడుగుతున్నట్టు సమాచారం. అంతేకాని.. సమస్య మూలాల్లోకి వెళ్లడం లేదట. ఇంఛార్జ్‌ ఠాగూర్‌ వారంలో ఒక రోజు రాష్ట్రానికి వచ్చి అందరితో మాట్లాడాలని మాజీ మంత్రి జానారెడ్డి సూచించారు. కానీ.. ఆ సూచనలను ఇంఛార్జ్‌ పక్కన పెట్టేశారట. AICC కార్యదర్శులతో వ్యవహారాలు గాడిలో పడటం లేదట. పైగా కొందరు సీనియర్‌ నాయకులు AICC కార్యదర్శుల పట్ల చులకన భావంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారట. కాంగ్రెస్‌ OBC సెల్‌ ఛైర్మన్‌ నూతి శ్రీకాంత్‌ను మార్చాలనే ప్రతిపాదన వస్తే.. ఓ సీనియర్ నేత AICC కార్యదర్శికి ఫోన్‌ చేసి ఏదేదో మాట్లాడేశారట. వీటినీ ఇంఛార్జ్‌ ఠాగూర్‌ పట్టించుకోలేదు.

తెలంగాణ కాంగ్రెస్‌ నేత పంచాయితీ ఆగేది కాదు. కానీ.. నియంత్రించాల్సిన ఇంఛార్జ్‌ ఠాగూర్‌ మాత్రం మౌనంగా ఉండటంలో సమస్య జఠిలంగా మారుతోందని కాంగ్రెస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయట. మౌనమే సమస్యలను పరిష్కరిస్తుందని కాంగ్రెస్‌లో భావిస్తుంటారు. కానీ.. ఆ వైఖరే తెలంగాణలో కాంగ్రెస్‌ కొంప కొల్లేరులా చేసేలా ఉందని గాంధీభవన్‌లో చెవులు కొరుక్కుంటున్నారట.