Site icon NTV Telugu

Naveen mittal :నవీన్ మిట్టల్ కి ప్రభుత్వంతో ఎక్కడ చెడింది..?

Aya Yasu

Aya Yasu

నవీన్‌ మిట్టల్‌. తెలంగాణలో సీనియర్ IAS అధికారి. గతంలో ఒకటి రెండు శాఖలకు సెక్రటరీగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక మున్సిపల్‌ శాఖ కార్యదర్శిగా ఉన్నారు కూడా. తర్వాత ఏమైందో ఏమో నవీన్‌ మిట్టల్‌ ప్రాధాన్యం తగ్గిపోయింది. డిమోషన్‌లోనే ఉండిపోయారు. సెక్రటేరియట్‌ నుంచి HODకి బదిలీ అయ్యారు. ప్రస్తుతం కళాశాల విద్య, సాంకేతిక విద్యాశాఖలకు కమిషనర్‌గా ఉన్నారు నవీన్‌ మిట్టల్‌. ఇది ఆయన స్థాయికి తగ్గ పోస్ట్‌ కాదన్నది అధికారవర్గాల వాదన. పైపెచ్చు ఆయన విధులు నిర్వహిస్తున్న శాఖకు కార్యదర్శిగా నవీన్‌ మిట్టల్‌ కంటే జూనియర్‌ IASలను నియమించడం చర్చగా మారుతోంది. దీంతో ప్రభుత్వంతో ఆయనకు ఎక్కడ చెడింది అనేది హాట్‌ టాపిక్‌గా ఉందట.

నవీన్‌ మిట్టల్‌ కళాశాల, సాంకేతిక విద్యా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాక ముగ్గురు విద్యాశాఖ కార్యదర్శులు మారారు. ఇప్పుడు నాలుగో అధికారి వచ్చారు. ఈ నలుగురిలో ముగ్గురు IASలు ఆయనకంటే జూనియర్లే. నవీన్‌ మిట్టల్‌ 1996 బ్యాచ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌. ఆయనపైన విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన జనార్దన్‌రెడ్డిది 1996 బ్యాచే. మొన్నటి వరకు విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న సందీప్‌ సుల్తానియా.. మిట్టల్‌ కంటే జూనియర్‌. ప్రస్తుతం ఎడ్యుకేషనల్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీగా ఉన్న వాకాటి కరుణ 2004 బ్యాచ్‌ ఐఏఎస్‌. నవీన్‌ మిట్టల్‌ కంటే చాలా జూనియర్‌.

తన శాఖకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే.. జూనియర్‌ ఆఫీసర్‌ దగ్గరకు వెళ్లి చర్చించాల్సిన పరిస్థితి నవీన్‌ మిట్టల్‌ది. వాస్తవానికి ఆయన్నే విద్యాశాఖ కార్యదర్శిగా నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ.. ప్రభుత్వం దగ్గర ప్రాధాన్యం లేకపోవడంతో ఆ పోస్ట్‌ రాలేదని చెబుతున్నారు. దీంతో సర్దుకుపోయి.. పనిచేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు ఈ 1996 బ్యాచ్‌ ఐఏఎస్‌. ప్రభుత్వం ఏ పని అప్పగించినా చేస్తానంటున్నారట. ఫలానా పోస్టులో ఉండాలి లేదా పోవాలి అనే ఆలోచన లేదని సహచరుల దగ్గర కామెంట్స్‌ చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఒక సీనియర్‌ ఐఏఎస్‌.. జూనియర్‌ అధికారుల దగ్గర పనిచేయడం తెలంగాణ ఐఏఎస్‌ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారిపోయింది.

 

Exit mobile version