NTV Telugu Site icon

Jammalamadugu Politics : ఆ నియోజకవర్గంలో ఏం జరిగింది..? ఎవరి ట్రాప్ లో ఎవరు పడ్డారు..?

Jamlamadugu

Jamlamadugu

రాజకీయాల్లో నాయకులు ఎన్నో అంటూ ఉంటారు. కొందరు సవాళ్లు విసిరితే.. మరికొందరు కౌంటర్లు వేస్తారు. ఎదుటివారిని ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలూ ఉంటాయి. ఆ మాటల్లోని మర్మం తెలుసుకోకపోతే ఎవరో ఒకరు ట్రాప్‌లో పడ్డం ఖాయం. ఆ నియోజకవర్గంలోనూ అదే జరిగిందట. ఇంతకీ ఎవరి ట్రాప్‌లో ఎవరు పడ్డారు? లెట్స్‌ వాచ్‌..!

ఏపీ రాజకీయాల్లో జమ్మలమడుగు రూటే వేరు. ఒకప్పుడు ఫ్యాక్షన్‌ రాజకీయాలకు అడ్డా అయిన నియోజకవర్గం ఇప్పుడు హాట్ హాట్‌ పాలిటిక్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌. ఈ ప్రాంతానికి చెందిన కాకలుతీరిన రాజకీయ నాయకులకు టైమ్‌ రివర్స్‌లో నడుస్తోంది. మాజీ మంత్రులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలు పొలిటికల్‌ స్క్రీన్‌పై మునుపటిలా సత్తాచాట లేని పరిస్థితి. మరో మాజీ మంత్రి మైసూరారెడ్డి సోదరుడి కుమారుడు డాక్టర్‌ సుధీర్‌రెడ్డి 2019లో జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి చక్రం తిప్పడం మొదలు పెట్టారు. రాజకీయంగా పూర్వ వైభవం సాధించేందుకు రామసుబ్బారెడ్డి ఫ్యామిలీతోపాటు ఆదినారాయణరెడ్డి కుటుంబం చేయని ప్రయోగాలు లేవు. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరినా గుర్తింపు లేదనే ఆవేదనలో ఉంటే.. ఆదినారాయణరెడ్డి కుటుంబానిది చెరోదారి అయ్యింది. ఆదినారాయణరెడ్డి బీజేపీలోనూ.. ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి టీడీపీలోనూ కొనసాగుతున్నారు. నారాయణరెడ్డి కుమారుడు భూపేష్‌రెడ్డి జమ్మలమడుగు టీడీపీ ఇంఛార్జ్‌ కూడా. రెండేళ్లలో ఎన్నికలు ఉండటంతో క్రమంగా శక్తిని కూడదీసుకునే పనిలో ఉన్నాయి కీలక కుటుంబాలు. ఇది పసిగట్టిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. విరుగుడు మంత్రం వేసే పనిలో పడ్డారట. ఈ క్రమంలో ఆయన పేల్చిన మాటల తూటాలు.. వాటికి వైరిపక్షం వేసిన కౌంటర్లు జమ్మలమడుగులో ఆసక్తికర రాజకీయాలకు తెరతీశాయి.

జమ్మలమడుగులో మొదటి నుంచి దేవగుడి కుటుంబానికి అండగా ఉంటోన్న కార్యకర్తలను, అభిమానులను టీడీపీ ఇంఛార్జ్‌ భూపేష్‌రెడ్డి కలుస్తూ వస్తున్నారు. నారాయణరెడ్డి కుటుంబం అంతా ఒకటే అనే మాటను బలంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారట. భూపేష్‌రెడ్డి ఎత్తుగడలతో ఉలిక్కిపడ్డ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. యువనేత స్పీడ్‌కు బ్రేక్‌లు వేయాలనే ఆలోచనతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం స్పీడ్‌ పెంచారు. అక్కడితో ఆగితే బాగోదనుకున్నారో ఏమో.. భూపేష్‌రెడ్డిపైనా.. దేవగుడి కుటుంబంపైనా తనదైన శైలిలో విమర్శలు చేశారు సుధీర్‌రెడ్డి. దేవగుడి కుటుంబం కలిసిపోతే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని లెక్కలు వేసుకుని రాజకీయ చెడుగుడుకు తెరతీశారని టాక్‌.

భూపేష్‌రెడ్డి బాబాయ్‌ల్లో ఆదినారాయణరెడ్డి బీజేపీలోనూ.. శివనాథ్‌రెడ్డి టీడీపీలోనూ కొనసాగుతున్నారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. దమ్ముంటే బాబాయ్‌, అబ్బాయ్‌లు ఇద్దరూ తనపై పోటీ చేయాలని.. చేతకాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సవాల్‌ చేశారు. అసలే ఫ్యాక్షన్‌ గడ్డ. మాటకు మాట చెప్పకపోతే లెక్కలు తప్పుతాయని అనుకున్నారో ఏమో.. భూపేష్‌రెడ్డితోపాటు.. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం అంతేస్థాయిలో ఎమ్మెల్యే సవాల్‌కు జవాబిచ్చారు. సుధీర్‌రెడ్డిపై పోటీకి సిద్ధమని ఇద్దరూ ప్రకటించడంతో దేవగుడి అనుచరులు, అభిమానులు డైలమాలో పడ్డారట. టీడీపీ నుంచి భూపేష్‌రెడ్డి, బీజేపీ నుంచి ఆదినారాయణరెడ్డి పోటీ చేస్తే.. ఎవరికి సపోర్ట్‌ చేయాలో తేల్చుకోవడం కష్టమంటున్నారట.

మొత్తానికి దేవగుడి కుటుంబం కలిస్తే ఇబ్బంది అని భావించి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సవాల్‌ చేస్తే.. బాబాయ్‌ అబ్బాయ్‌లు ఆ ట్రాప్‌లో పడ్డారని జమ్మలమడుగులో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటే తన గెలుపునకు ఢోకా ఉండబోదనే ఎమ్మెల్యే ఆ స్కెచ్‌ వేశారని.. అందులో దేవగుడి ఫ్యామిలీ ఇరుక్కుందని అనుకుంటున్నారట. మరి.. ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో చూడాలి.