మబ్బులను చూసి చెంబులోని నీళ్లను ఒలకబోసుకున్నట్టుగా.. తాడేపల్లిగూడెం టీడీపీ నేతల తీరు ఉందట. ఎన్నికల నాటికి ఇంకేదో జరుగుతుందని ఇప్పుడే కాడి పడేశారట. ఇంతకీ వాళ్లేం చేస్తున్నారు? లెట్స్ వాచ్..!
తాడేపల్లిగూడెం. రాజకీయ చైతన్యానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఐదు పార్టీలకు అవకాశమిచ్చిన నియోజకవర్గం. టీడీపీ నాలుగుసార్లు గెలిచింది. అలాంటి పార్టీ ప్రస్తుతం అక్కడ పరువు కాపాడుకునేందుకు.. పట్టు నిలుపుకొనేందుకు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. ఏదోలా పాగా వేయాలని చూస్తున్న నేతలకు అనేక అనుమానాలు వెనక్కి లాగుతున్నాయట. ఇక్కడ టీడీపీకి నేతలు ఎక్కువే. కానీ.. వాళ్ల మధ్య సమన్వయం లేదు. కలిసి సాగే పరిస్థితి అంతకంటే లేదు. ప్రస్తుతం పార్టీ నేత వలవల బాబ్జీ తాడేపల్లిగూడెం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. కేడర్ అంతా ఆయనకు సహకరిస్తున్నట్టే పైకి కనిపించినా.. చివరి నిమిషంలో ఏమైనా జరగొచ్చనే అనుమానం ఉందట. ఇందుకు ప్రచారంలో ఉన్న అంశాలు కూడా వారిని హడలెత్తిస్తున్నాయట.
2014లో టీడీపీ టికెట్‌ను జడ్పీ మాజీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఆశించారు. మాజీ ఎమ్మెల్యే ఈలి నాని సైతం గట్టి పట్టే పట్టారు. కానీ.. బీజేపీతో ఉన్న పొత్తులో భాగంగా.. నాటి మిత్రపక్షానికి తాడేపల్లిగూడెం ఇవ్వడంతో పైడికొండల మాణిక్యాలరావు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా చేశారు. ఆ తర్వాత నియోజకవర్గంలో నేతల మధ్య వర్గపోరు తీవ్రమైంది. అది పెరుగుతూ వచ్చిందే తప్ప తగ్గింది లేదు. వచ్చే ఎన్నికలు టీడీపీకి చావోరేవో అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జనసేనతో పొత్తు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. ఆ ప్రచారంతో తాడేపల్లిగూడెం టీడీపీ డీలా పడినట్టు సమాచారం.
2014లో పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఇచ్చినా.. 2019లో టీడీపీనే ఇక్కడ పోటీ చేసింది. కానీ.. వర్గ విభేదాలతో ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. అప్పటి నుంచి ఇక్కడి నేతలు అవకాశాలపై ఆశలు వదిలేసుకున్నారు కూడా. వలవల బాబ్జీ ముందుకు రావడంతో ఆయన్ని ఇంఛార్జ్‌గా ప్రకటించారు. పార్టీ కార్యక్రమాలు చేయడానికి బాబ్జీ రోడ్డెక్కుతున్నా.. కేడర్ మాత్రం వెంట రావడం లేదట. టీడీపీ పోటీ చేస్తుందో లేదో తెలియనప్పుడు రోడ్డెక్కి పోరాటాలు చేయడం ఎందుకు అని ప్రశ్నలు సంధిస్తున్నారట. పొత్తులో మరోసారి తాడేపల్లి గూడెం టికెట్ కొట్టుకుపోతుందని బలంగా నమ్ముతున్నారట. పొత్తు లేకపోతే.. టీడీపీ నుంచి పోటీ చేసేది ఎవరో క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారట తెలుగు తమ్ముళ్లు.
రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులపై క్లారిటీ ఇస్తూ వస్తున్నారు టీడీపీ అధినేత. ఆ జాబితాలో తాడేపల్లిగూడెన్ని కూడా చేర్చాలన్నది కేడర్ డిమాండ్. అలా చేస్తే అభ్యర్థి విషయంలోనూ స్పష్టత వస్తుందని.. ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవచ్చని సూచిస్తున్నారట. ఇలా మాటలు… ప్రకటనలతో కాలం గడిపేస్తున్న నేతలు, కార్యకర్తలు.. ఇప్పటి నుంచీ రోడ్డెక్కడానికి మాత్రం ఇష్ట పడటం లేదట. మరి.. కేడర్ అనుమానిస్తున్నట్టు సీటు పొత్తులో పోతుందో.. లేక వారిని ఉత్సాహపరిచేందుకు పార్టీ పెద్దలు ఇంకేదైనా ప్రకటన చేస్తారో చూడాలి.