Chirala YCP Politics : ముగ్గురూ ముగ్గురే..! కలిసి సాగే పరిస్థితి లేదు. మూడుదారుల్లో వెళ్తారు.. పార్టీకి కేడర్‌కు బీపీ తెప్పిస్తారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనే సంగతి ఎలా ఉన్నా.. ఎవరి కుంపటి వాళ్లదే. మధ్యలో కేడర్‌కే గందరగోళం. ఈసారి నియోజకవర్గంలో పాగా వేయాలని చూస్తున్న అధికారపార్టీకి ఎదురవుతున్న సవాళ్లేంటి? లెట్స్ వాచ్..!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వర్గ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చీరాల. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం.. అధికార వైసీపీకి జైకొట్టారు. బలరాం కుమారుడు వెంకటేష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకొన్నారు. గత ఎన్నికల్లో ఓడి.. నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం చీరాల వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు కరణం వెంకటేష్. గడప గడపకు మన ప్రభుత్వంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయన హాజరవుతున్నారు. నిన్న మొన్నటి వరకు కరణం శిబిరంతో కలిసి నడిచిన ఎమ్మెల్సీ పోతుల సునీత కొత్త దారి వెతుక్కోవడంతో మూడు ముక్కలాటగా మారిపోయింది.
వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక చీరాలలో దూకుడు పెంచారు పోతుల సునీత. ఇంకోవైపు.. ఆమంచి కృష్ణమోహన్‌ను అనుహ్య పరిణామాల మధ్య పర్చూరు వైసీపీ ఇంఛార్జ్‌గా ప్రకటించారు. కానీ.. అది పట్టాలెక్కకపోవడంతో సైలెంట్‌గా తనపని చేసుకుపోతున్నారు ఆమంచి. ఇలా మూడు శిఖరాలు చీరాల కేంద్రంగానే పావులు కదపడం కామనైపోయింది. పార్టీ కేడర్‌కే ఎటు వెళ్లాలో తెలియక తల పట్టుకుంటోందట. దీనికితోడు నేతల మధ్య సమన్వయం లేక కార్యకర్తలు సైతం వర్గాలుగా విడిపోతున్న పరిస్థితి ఉంది. ఆ ప్రభావం చీరాలలో నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కనిపిస్తోంది. పార్టీ నేతలతో కలిసి పోతుల సునీత గడప గడపకు తిరిగేశారు. ఇందులోనూ గ్రూపుల గోల పెరగడంతో పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో ఇంఛార్జ్ వెంకటేష్ మినహా మిగతావాళ్లు చేపట్టిన కార్యక్రమాలు ఆపక తప్పలేదు. మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావు, మున్సిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావుతో కలిసి గడప గడపకు వెళ్తున్నారు ఇంఛార్జ్ కరణం వెంకటేష్. సచివాలయాల సందర్శన పేరుతో ఎమ్మెల్యే బలరాం కూడా ఫీల్డ్ ఎంట్రీ ఇస్తున్నారు.
అధిష్ఠానం ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మౌనంగా ఉన్నప్పటికి.. ఆయన అనుచరుల కదలికలు సందేహాస్పదంగా ఉన్నాయని.. పార్టీలోనే ఇంకెవరితో పరోక్షంగా మద్దతు ఇస్తున్నారనే వాదన ఉంది. మొత్తానికి చీరాల వైసీపీలో బలమైన నాయకాగణం ఉన్నప్పటికీ కలిసి సాగే పరిస్థితి లేదు. దీంతో పదే పదే లోకల్ పార్టీలో అనిశ్చిత బయట పడుతోంది. ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్న ఆమంచి గ్రూప్ యాక్టివ్ అయితే వైసీపీ అధిష్ఠానానికి మరిన్ని తలనొప్పులు తప్పదనే చర్చ నడుస్తోంది. అందుకే ఇక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చీరాలను వైసీపీ ఖాతాలో వేయాలనే పట్టుదలతో అధిష్ఠానం ఉండటంతో.. రానున్న రోజుల్లో కీలక నిర్ణయమే వెలువడుతుందని అనుకుంటున్నారట.
చీరాలలో వైసీపీ పాగా వేయాలంటే ముందుగా ఇక్కడి వర్గ రాజకీయాలకు చెక్ పెట్టాలన్నది కేడర్ మాట. అందుకే వాటికి అధినాయకత్వం ఎలాంటి చికిత్స చేస్తుందనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ముగ్గురు కీలక నేతలను కలిపేందుకు అధిష్ఠానం అమలు చేసే ఫార్ములాపైనే చర్చ జరుగుతోందట. పార్టీ పెద్దలు చెప్పినట్టు ముగ్గురు కలిసి పనిచేస్తే ఫలితం వార్ వన్‌సైడ్ అన్నది కేడర్ మాట. మరి కరణం, ఆమంచి, పోతుల చేతులు కలుపుతారా.. లేదా అన్నదే ప్రశ్న. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.