Site icon NTV Telugu

Telangana Assembly War : అసెంబ్లీ వేదికగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్

Assembly War

Assembly War

Telangana Assembly War : అసెంబ్లీ వేదికగా అధికార పక్షానికి, బీజేపీకి మధ్య వార్‌ మొదలైందా? మాటలు.. విమర్శలు.. సవాళ్లు మరో అంకానికి చేరుకుంటున్నాయా? BAC బ్యాక్‌ డ్రాప్‌లో నేతలు కత్తులు నూరుతున్నారా? తాజా ఎపిసోడ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంటుంది? రెండు పార్టీల శిబిరాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్‌ వాచ్‌..!

తెలంగాణ అసెంబ్లీ తొలిరోజు సమావేశాలు పది నిమిషాల్లోనే ముగిసినా.. తర్వాత జరిగిన BAC సమావేశం మాత్రం బీజేపీకి, అధికార పక్షానికి మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. శాసనసభా వ్యవహారాల సలహ కమిటీ.. BAC మీటింగ్‌కు పిలవకపోవడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై గతంలోనూ పలుమార్లు బీజేపీ ఎమ్మెల్యేలు సభాపతిని కలిసి మాట్లాడిన ఉదంతాలు ఉన్నాయి. తాజా సమావేశాలతో ఆ అంశం మరోసారి చర్చకు కారణమైంది.

బీఏసీ సమావేశానికి పిలవకపోవడంపై బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావులు విమర్శలు చేశారు. సంప్రదాయాలను గౌరవించాలని చెబుతూనే.. సభాపతిపై ఈటల చేసిన వ్యాఖ్యలపై అధికారపక్షం భగ్గుమంది. శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంతరెడ్డి తీవ్రంగానే స్పందించారు. స్పీకర్‌కు ఈటల క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు మంత్రి. గతంలో ఈటల రాజేందర్‌ మంత్రిగా ఉన్న సమయంలో బీఏసీలో బీజేపీకి అవకాశం లేదన్నది గుర్తు తెచ్చుకోవాలన్నారు ప్రశాంత్‌రెడ్డి. అంతేకాదు.. ఈటల వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. సభాపతిపై చేసిన కామెంట్స్‌పై నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. నోటీసు ఇస్తే చట్టబద్ధంగా ఎదుర్కొంటామని చెబుతోంది బీజేపీ.

బీజేపీని BAC మీటింగ్‌కు పిలవకూడదని ఏ రూల్‌ ప్రకారం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు ఎమ్మెల్యే రఘునందన్‌రావు. గతంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఎందుకు పిలిచారు అని ప్రశ్నిస్తోంది బీజేపీ. సభలో ఒకరు, ఇద్దరు సభ్యులు ఉన్న పార్టీలను కూడా బీఏసీకి పిలిచిన ఉదంతాలు ఉన్నాయని.. ఆ సంప్రదాయాలను గౌరవించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. అసలు ఒక పార్టీకి ఎంతమంది సభ్యులు ఉంటే ఆహ్వానిస్తారో కూడా చెప్పాలని ప్రశ్నలు సంధించారు రఘునందన్‌రావు.

మొత్తానికి రాష్ట్రంలో తాజా రాజకీయ వాతావరణ పరిస్థితులు తొలిరోజు అసెంబ్లీ సమావేశాల తర్వాత కూడా కనిపించాయి. ఈ నెల 12, 13న అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో.. ఆ లోపుగా ఇంకేమైనా పరిణామాలకు ఆస్కారం ఉందా? లేక ఇదే విధంగా అధికారపక్షం.. బీజేపీ ఎమ్మెల్యేలు మాటలతో కత్తులు దూసుకుంటారా? ఈటల వ్యాఖ్యలపై నోటీసు ఇవ్వాలన్నదానిపై స్పీకర్‌దే తుది నిర్ణయం కావడంతో.. ఆయన ఏం చేస్తారు? అనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిళ్లలో ఆసక్తి కలిగిస్తోంది. మరి.. ఈ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

 

Exit mobile version