ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి కాంగ్రెస్‌లో వార్ పీక్స్‌కు చేరుకుంటోంది. సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి.. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డిలు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై ఆశలు పెట్టుకుని రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. యువతతో కలిసి వనపర్తిలో శివసేనారెడ్డి కార్యక్రమాలు స్పీడ్ పెంచడంతో చిన్నారెడ్డి వర్గం కలవర పడుతోందట.చిన్నారెడ్డి మాజీ మంత్రి. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గానూ ఉన్నారు. పార్టీ తనను కాదని వేరొకరికి టికెట్ ఇవ్వబోదనే ధీమాతో ఉన్నారు చిన్నారెడ్డి. దీంతో పాత, కొత్త నేతల మధ్య గరం గరంగా ఉంది వనపర్తి రాజకీయం.
చిన్నారెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. AICC కార్యదర్శిగానూ కొనసాగుతూ కాంగ్రెస్ పెద్దలతో సత్సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారు కూడా. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే వనపర్తి ఎమ్మెల్యేగా పోటీ చేశారు చిన్నారెడ్డి. ప్రస్తుతం నియోజకవర్గానికి పెద్దదిక్కుగా ఉండి.. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నారాయన. కానీ.. శివసేనారెడ్డి రూపంలో సొంత పార్టీలోనే ప్రత్యర్థి ఎదురు కావడం మాజీ మంత్రిని కుదురుగా ఉండ నివ్వడం లేదట. యూత్ లీడర్ పేరు ఎత్తితే చిన్నారెడ్డి చిటపటలాడుతున్నారట.
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో తెలంగాణ అంతా పర్యటిస్తున్న శివసేనారెడ్డి.. వనపర్తిలో ప్రత్యేక దృష్టి పెట్టారు. నియోజకవర్గంలోని యువతతోపాటు ద్వితీయ శ్రేణి నేతలతో నిత్యం టచ్‌లో ఉంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే అనే రీతిలో ప్రకటనలు గుప్పిస్తున్నారు కూడా. ఈ దఫా కాంగ్రెస్ యువతరానికి ప్రాధాన్యం ఇస్తుందని చెబుతూనే.. గతంలో యూత్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్న చిన్నారెడ్డికి వనపర్తిలో, కల్వకుర్తిలో వంశీచంద్‌రెడ్డికి ఛాన్స్ ఇచ్చినట్టుగానే తనకు అవకాశం ఇస్తారని లెక్కలేస్తున్నారట. అయితే చిన్నారెడ్డి వర్గంతో ఎక్కడా ఘర్షణ పడకుండా రాజకీయం చేస్తున్నారు శివసేనారెడ్డి. ఈ వర్గపోరు కారణంగా ఇద్దరి నాయకుల మధ్య వనపర్తి కాంగ్రెస్ కేడర్ రెండుగా చీలిపోయింది. అవకాశాల కోసం ప్రయత్నించడం తప్పుకాకపోయినా.. పార్టీలో వర్గపోరుకు బీజం వేయడంపైనే శ్రేణులు ఆందోళన చెందుతున్నాయట.
మొత్తం మీద.. ఎన్నడూ లేని విధంగా వనపర్తి కాంగ్రెస్ పరిణామాలు పార్టీలో చర్చగా మారుతున్నాయి. టికెట్ రేస్‌లో సీనియర్ మాట నెగ్గుతుందా.. యూత్ ప్రయత్నాలు ఫలిస్తాయా అనే ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం క్లారిటీ ఇచ్చేంత వరకు వనపర్తి వార్ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుందని భావిస్తున్నారు.