Site icon NTV Telugu

Off The Record: వంగవీటి రంగా.. వర్కవుట్ అవుతుందా?

Vangaveeti

Vangaveeti

ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మళ్లీ వంగవీటి రంగా హత్య అంశం తెర మీదకు వస్తోంది. అయితే రంగా.. ఆయన హత్య ఉదంతాలు ఇప్పటికీ పొలిటికల్‌గా ప్రభావం చూపిస్తాయా? రంగా, దేవినేని వారసులు ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీ మారుతున్నారు. ఒకరు అటుంటే ఇంకొకరు ఇటు ఉంటున్నారు. ఓ సందర్భంలో మాత్రమే ఒకే పార్టీలో కలిసి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో రంగా హత్యను ఓ ఇష్యూగా చూపించే ప్రయత్నం చేస్తున్న వారికి.. ఆ ఎత్తుగడ వర్కవుట్‌ అవుతుందా?

తండ్రి పేరు జిల్లాకు పెట్టాలని డిమాండ్‌ చేయని రంగా తనయుడు
వంగవీటి రంగా రాజకీయం చేసినంత కాలం.. కులంతో సంబంధం లేకుండానే పాలిటిక్స్‌ సాగాయి. రంగాకు ఓ కులంతో కానీ.. ప్రాంతంతో కానీ సంబంధం లేదని.. రంగా అందరి మనిషని అని ఆయన అభిమానులు.. అనుచరులు అంటుంటారు. ఇలాగే వంగవీటి కొడుకు రాధా కూడా రంగాను ఓ కులానికి పరిమితం చేయొద్దని పదే పదే రిక్వెస్ట్‌ చేస్తారు. జిల్లాల విభజన సందర్భంలో కూడా ప్రస్తుత ఎన్టీఆర్‌ జిల్లాకు వంగవీటి పేరు పెట్టాలని చాలా మంది డిమాండ్‌ చేసినా.. రాధా మాత్రం దాని మీద పెద్దగా కామెంట్‌ చేయలేదు. తండ్రి పేరు జిల్లాకు పెట్టాలని డిమాండ్‌ కూడా చేయలేదు. తన తండ్రిని ఓ కులానికి.. ఓ జిల్లాకు పరిమితం చేయడం ఇష్టం లేదని.. తానైతే తన వైపు నుంచి ఈ తరహా డిమాండ్లు చేయబోనని తనను కలిసిన వారితో రాధా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. అదే విషయాన్ని వివిధ వేదికల మీద కూడా స్పష్టం చేశారు రాధా.

 

.
ఎమ్మెల్యే ఉదయభాను కామెంట్స్‌పై చర్చ
అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నెల 26న రంగా వర్ధంతి. మళ్లీ రంగా హత్యోందంతం తెర మీదకొస్తోంది. నందిగామ నియోజకవర్గం నరసింహారావుపాలెంలో రంగా విగ్రహావిష్కరణ సందర్భంగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను చేసిన కామెంట్స్‌ ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. నాటి టీడీపీ ప్రభుత్వం తనను హత్య చేస్తుందని తెలిసి కూడా ప్రజల కోసం రంగా నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కొల్పయారంటూ ఉదయభాను వ్యాఖ్యానించారు. అయితే ఆ పక్కనే ఉన్న రాధా ఉదయభాను వ్యాఖ్యలపై పెద్దగా స్పందించలేదు. ఆయన అలా ఎందుకు ఉన్నారనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.

ఎవరేమన్నా స్పందించడం మానేసిన రాధా
బెజవాడ రాజకీయాల్లో ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. రంగా హత్యను ఓ ఇష్యూగా తీసుకోవడం సరికాదనే చర్చ జరుగుతోంది. హత్య జరిగి చాలా కాలం అయింది. రంగా తనయుడు రాధా టీడీపీలో ఉన్నారు. రంగాను హత్య చేయించారనే ఆరోపణలు ఎదుర్కొన్న దేవినేని నెహ్రూ ఇప్పుడు లేరు. నెహ్రూ తనయుడు అవినాష్‌.. సామినేని ఉదయభాను ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీలోనే ఉన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు రాధా సన్నిహితులు. పైగా రాధా-అవినాష్‌ గతంలో ఒకే పార్టీలో ఉన్న విషయాన్నీ గుర్తు చేస్తున్నారట. ఇదే సమయంలో తెలుగు తమ్ముళ్లల్లోనూ చర్చ జరుగుతోంది.

ఈ వివాదాన్ని తెరపైకి తెస్తే.. తమకే కాదు.. వైసీపీకి ఇబ్బందేననే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు. రంగా హత్య టీడీపీ పనేనని ఆయన మరణించినప్పటి నుంచీ ఆరోపణలు ఉన్నాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. దీనివల్ల టీడీపీకి నష్టం జరగవచ్చు అనే వాదన ఎలా ఉందో రంగా హత్యకు కారణమని నాడు ఆరోపణలు ఎదుర్కొన్న దేవినేని కొడుకు అవినాష్‌ వైసీపీలో ఉండటం కూడా ఆ పార్టీకి నష్టం చేయవచ్చనే విశ్లేషణలు ఉన్నాయి. పక్క నేతలు దీనిమీద ఎన్ని కామెంట్స్‌ చేసినా రాధా మాత్రం ఇప్పుడు స్పందించడం మానేశారు. రంగా హత్యోదంతం బయటకు వస్తే ఎవరికి నష్టం. ఎవరికి లాభం అనేదాని మీద ఏ పార్టీకి ఆపార్టీ తమకు అవసరమైన వాదనలు చేస్తూనే ఉన్నాయి.

Exit mobile version