Site icon NTV Telugu

ధాన్యం సేకరణపై కేంద్రంపై టీఆర్‌ఎస్‌ యుద్ధం..!

ధాన్యం సేకరణపై కేంద్రంపై యుద్ధం ప్రకటించిన అధికార టీఆర్‌ఎస్‌.. తదుపరి కార్యాచణ ఏంటి? తాటతీస్తాం.. మెడలు వంచుతామని చెప్పిన ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. మరి.. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు టీఆర్‌ఎస్‌ ముందు ఉన్న ఆప్షన్స్‌ ఏంటి?


పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్‌ఎస్‌..!

తెలంగాణలో వరి రైతుల ఇక్కట్లు ఎలా ఉన్నాయో.. ధాన్యం రాశుల దగ్గర చూస్తే తెలుస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లముందే వర్షం పాలై.. ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియక.. కొనుగోలు చేసేవారు ముందుకు రాక.. అక్కడే గుండె ఆగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి కేంద్రం మెడలు వంచుతామని ప్రకటించిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు.. మధ్యలోనే పార్లమెంట్‌ను బహిష్కరించారు. సమస్య ఎక్కడిది అక్కడే ఉంది. ధాన్యం సేకరణ విషయంలో ఎవరి వాదన వారిదే. రైతును పట్టించుకునేవారే లేరు. ఇప్పుడెలా? పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్ఎస్‌ భవిష్యత్‌ కార్యాచరణ ఏంటన్నది ఒక చర్చ.

కేంద్రం ప్రకటనపై సంతృప్తి చెందని టీఆర్ఎస్‌..!

నవంబర్‌ 29న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల మొదటిరోజే టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. ధాన్యం సేకరణలో కేంద్రం వివక్ష చూపుతోందని.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు ఎంపీలు. ప్రతిరోజూ ఈ అంశంపై వాయిదా తీర్మానాలు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు వ్యూహం మార్చి… వివిధ అంశాలపై ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనల్లో కూడా ఎంపీలు పాల్గొన్నారు. చివరకు కేంద్రం వివరణ ఇచ్చినా.. అంతా డొంకతిరుగుడుగా ఉందని ఆరోపిస్తూ.. నిరసనగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరించారు టీఆర్‌ఎస్‌ ఎంపీలు.

మరోసారి టీఆర్‌ఎస్‌ఎల్పీ విస్తృత సమావేశం నిర్వహిస్తారా?
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఢిల్లీ ధర్నా..?

పార్లమెంట్ సమావేశాలను బాయ్‌కాట్‌ చేశారు సరే.. ధాన్యం సేకరణపై టీఆర్ఎస్‌ ఇప్పుడేం చేయబోతుంది? భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తుందా? టీఆర్ఎస్‌ ముందున్న ఆప్షన్స్‌ ఏంటన్నదానిపై గులాబీ శిబిరంలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వివిధ విషయాలు పార్టీ వర్గాల్లో చర్చకు వస్తున్నాయట. త్వరలోనే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆ మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని ఒక వాదన ఉంది. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఢిల్లీ తీసుకెళ్లి ధర్నా నిర్వహించే యోచన కూడా పార్టీ దగ్గర ఉందట.

ఎంపీల స్థాయిలో నిరసనలా..? అసెంబ్లీ కేంద్రాల్లో ఆందోళనలా..?

ఆ మధ్య ధాన్యం సేకరణపై హైదరాబాద్‌ ధర్నాచౌక్‌లో టీఆర్ఎస్‌ నిరసన ఏర్పాటు చేస్తే.. గులాబీ బాస్‌, సీఎం కేసీఆర్‌ వచ్చారు. జిల్లాల్లోనూ ఆందోళనలు సాగాయి. అదే రీతిలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఈ దఫా నిరసనలు చేపట్టొచ్చని తెలుస్తోంది. పార్లమెంట్‌లో ఆందోళనలు నిర్వహించిన ఎంపీలే రాష్ట్రాంలో తమ నియోజకవర్గాల పరిధిలో ఆందోళనలు చేయొచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయట. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ ధర్నాలు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన జరిగినట్టు తెలుస్తోంది. మరి.. వరి రైతుకు అండగా అధికార టీఆర్‌ఎస్‌ ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో చూడాలి.

Exit mobile version