Site icon NTV Telugu

దుబ్బాకలో మూడు ముక్కలాటగా మారిన టీఆర్ఎస్ పరిస్థితి!

Dubakk Adada..y

Dubakk Adada..y

టీఆర్ఎస్‌కు పట్టున్న నియోజకవర్గాల్లో దుబ్బాక ఒకటి. గులాబీ పార్టీ నుంచి సోలిపేట రామలింగారెడ్డి వరసగా విజయం సాధిస్తూ వచ్చారు. అంతకుముందు ఈ నియోజకవర్గం దొమ్మాటగా ఉండేది. అప్పుడు కూడా సోలిపేట రెండుసార్లు గెలిచారు. గత ఏడాది సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ తరఫున రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓటమితో సుజాత కొద్దిరోజులు సైలెంట్‌ అయ్యారు. కానీ.. ఇప్పుడిప్పుడే ఆమె యాక్టివ్‌ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తనకే టికెట్‌ ఇస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు.

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కూడా దుబ్బాకను అసలు వదిలి పెట్టడం లేదట. తన పార్లమెంట్ పరిధిలోని మిగతా ఆరు నియోజకవర్గాలకు చుట్టపు చూపుగా వెళ్తున్న ఆయన దుబ్బాకలోనే ఫుల్‌టైమ్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. మొన్నటి ఉపఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ పూర్తిస్థాయిలో దుబ్బాకపై ఫోకస్‌ పెట్టిందని ఆయన చెబుతున్నారట. పైగా ఎంపీ సొంతూరు పోతారం.. దుబ్బాక నియోజకవర్గంలోనే ఉంది. ఇటీవల టీఆర్ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొత్త ప్రభాకర్‌రెడ్డి నియామకం కావడంతో దుబ్బాకను అదే పనిగా చుట్టేస్తున్నారు ఎంపీ.

ఇదే జిల్లాకి చెందిన మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మొన్నటి వరకు పౌర సరఫరాల కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. సీఎం కేసీఆర్‌కి సన్నిహితుడు. సిద్ధిపేటలో కేసీఆర్‌ రాజకీయం మొదలు పెట్టినప్పటి నుంచి ఉన్నారు. మారెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కేసీఆర్‌తో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. గులాబీ బాస్‌ పిలుపుతో ఆనాడు టీడీపీకి రాజీనామా చేసిన అతికొద్దిమందిలో మారెడ్డి ఒకరు. ఆయన కన్ను కూడా దుబ్బాకపై పడిందట. ఇప్పటి వరకు ఆయనకంటూ నియోజకవర్గం లేదు. వచ్చే ఎన్నికల్లో దుబ్బాక టికెట్‌ తనకే అని తిరుగుతున్నారట. మారెడ్డి గతంలో సర్పంచ్‌గా.. సిద్ధిపేట మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. అవన్నీ తనకు దుబ్బాక సీటు కోసం కలిసి వస్తాయని లెక్కలేస్తున్నట్టు సమాచారం.

ఇలా ముగ్గురు నేతలు ఒక్కసారిగా గేర్‌ మార్చేయడంతో దుబ్బాక టీఆర్ఎస్‌ రాజకీయం వేడెక్కింది. ట్రయాంగిల్‌ ఫైట్ నెలకొంది. ఈ ఆధిపత్యపోరాటంలో కేడర్‌ కన్ఫ్యూజ్‌ అవుతోందట. ఎవరివైపు మొగ్గు చూపాలో వారికి తెలియడం లేదట. ఇదే సమయంలో దుబ్బాక రాజకీయ వర్గాల్లో మరో చర్చ కూడా జరుగుతోంది. గత ఉపఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్‌రావు త్వరలో గులాబీ కండువా కప్పుకొంటారని గట్టిగానే చెవులు కొరుక్కుంటున్నారు. అదే జరిగితే ఆయనకే టికెట్‌ ఇస్తారో లేదో చూడాలన్నది పార్టీ వర్గాల వాదన. మరి.. అధికారపార్టీ పెద్దల ఆలోచనలో దుబ్బాక ఈక్వేషన్లు ఎలా ఉన్నాయో చూడాలి.

Watch Here : https://youtu.be/5myC0EixKKs

Exit mobile version