Site icon NTV Telugu

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తెరాస కసరత్తు ఎంతవరకు వచ్చింది..?

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలపై టీఆర్ఎస్‌ కసరత్తు ఎంత వరకు వచ్చింది? పదవీకాలం ముగిసిన వారిలో ఓసీ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువ. కొత్తగా సీటు ఆశిస్తున్నవాళ్లు.. రెన్యువల్ కోరుతున్న వారిలోనూ OC నేతలే అధికంగా ఉన్నారు. మరి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక లెక్కల సమతూకం ఎలా? ఈ అంశంపై గులాబీ శిబిరం తేల్చుకోలేకపోతోందా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు ఎలా?

అధికార టీఆర్‌ఎస్‌లో పదవుల పండగ మొదలైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఆరు, స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండటమే ఈ సందడికి కారణం. ఎమ్మెల్సీ పదవి పట్టేందుకు టీఆర్ఎస్‌లో ఆశావహులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. పార్టీ పెద్దలను కలిసి తమ పేర్లు పరిశీలించాలని కోరుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. సామాజిక సమీకరణాల తూకమే ఇబ్బందిగా మారిందట. ప్రస్తుతం పదవీకాలం ముగిసిన వారిలో ఎక్కువ మంది ఓసీలే. ఇప్పుడు రేస్‌లో ఉన్నది కూడా ఆ సామాజిక వర్గాలకు చెందిన నేతలే. బీసీలు, ఎస్సీఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తే.. ఇటు సంఖ్య తగ్గుతుంది. ఓసీ నేతలను నొప్పించకుండా పందేరం చేపట్టాలి. అదెలా అన్నదే ఇప్పుడు అధికారపార్టీ నేతలకు దిక్కుతోచడం లేదట.

టికెట్‌ ఆశిస్తున్నవారిలో ఓసీ సామాజికవర్గ నేతలే ఎక్కువ..!

ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉంది టీఆర్ఎస్‌. ఈ కోటాలో టికెట్‌ ఆశిస్తున్నవారిలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోటిరెడ్డి, తక్కలపల్లి రవీందర్‌రావు.. గతంలో హామీలు పొందినవారు ఉన్నారు. అంతా ఓసీ సామాజికవర్గాలకు చెందిన వారే. గవర్నర్‌ కోటాలో పెండింగ్‌లో పడిన కౌశిక్‌రెడ్డి భవితవ్యం డైలమాలోనే ఉంది. హుజురాబాద్‌ ఉపఎన్నిక బ్యాక్‌ డ్రాప్‌.. అలాగే రెండోసారి అధికారం చేపట్టాక జరిగిన ఉపఎన్నికల్లో టికెట్‌ ఆశించి భంగపడిన వారిని ఎమ్మెల్సీని చేస్తామని పార్టీ హామీ ఇచ్చింది. వారిలో ఎంత మందికి ఛాన్స్‌ ఇస్తారో చూడాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీలను అకామిడేట్‌ చేయడం సవాలేనా?

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. లోకల్‌ బాడీలో ఎమ్మెల్సీగా రిటైరైన వారిలోనూ ఓసీ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువ. మళ్లీ టికెట్ ఆశిస్తున్నవాళ్లూ వారే.
వచ్చే ఎన్నికలు.. జిల్లాల్లోని పరిస్థితులు.. పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉంది టీఆర్ఎస్‌. అందుకే ఎస్సీఎస్టీ, బీసీ అభ్యర్థులను ఈ జాబితాలో అకామిడేట్‌ చేయడం అధికార పార్టీకి పెను సవాలే అన్నది గులాబీ వర్గాల మాట. దీంతో లెక్కలు కొలిక్కి తెచ్చి పార్టీ చేసే ప్రకటనపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు నేతలు.

Exit mobile version