NTV Telugu Site icon

Nalgonda Trs Politics Off The Record: గుత్తా వర్సెస్ జగదీష్.. ఇద్దరి మధ్య కోల్డ్ వార్?

Gutha 1

Gutha 1

ఆయన సీనియర్‌ పొలిటీషియన్‌. జిల్లాలో సొంత పార్టీ నేతలతో గ్యాప్‌ పెరుగుతోంది. రాజకీయంగా తీరని వేదనకు వాళ్లే కారణమని సన్నిహితులకు చెప్పి వాపోతున్నారట. ఆయన ఎవరో.. ఆయన ఆవేదన ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం.

గుత్తాతో వేదిక పంచుకోవడం లేదా?
ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్‌ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. టీఆర్ఎస్‌లో ముందు నుంచి ఉన్న నేతలు.. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన నాయకుల మధ్య పొసగడం లేదు. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి జిల్లాలో మంత్రి జగదీష్‌రెడ్డి సహా.. మెజారిటీ ఎమ్మెల్యేలకు మధ్య దూరం వచ్చిందట. అత్యవసరమైతే తప్ప గుత్తాతో కలిసి వేదిక పంచుకోవడం లేదట జగదీష్‌రెడ్డి. కలిసి సాగినా ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారట. జిల్లాలోని టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతోనూ గుత్తా వ్యవహారం దాదాపుగా ఇదే విధంగా ఉంటోంది. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో ఉప్పు నిప్పుగా ఉంటోంది యవ్వారం. జిల్లా కేంద్రంలో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం అరుదే. గుత్తాకు సన్నిహితుడిగా పేరున్న దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్‌ సైతం.. స్థానిక మున్సిపల్ ఛైర్మన్‌ విషయంలో గ్యాప్‌ మెయింటైన్‌ చేస్తున్నారట. ఒకరకంగా చెప్పాలంటే మంత్రికి సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు అంతా గుత్తాకు దూరమే.

కుమారుడి పొలిటికల్‌ ఎంట్రీపై గుత్తా వ్యాఖ్యలతో దుమారం
తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని చూసి ఓర్వలేకే.. ఎమ్మెల్యేలను మంత్రి తనకు దూరం పెడుతున్నారనే ఫీలింగ్‌లో గుత్తా ఉన్నారట. అయితే గుత్తా తన అనుభవాన్ని తమ నియోజకవర్గాల్లో గ్రూపులు కట్టడానికి వినియోగిస్తున్నారనేది ఎమ్మెల్యేల మాట. ఎమ్మెల్సీగా ఉన్నా.. హుజూర్‌నగర్‌, నాగార్జున సాగర్‌, మునుగోడు ఉపఎన్నికల సమయంలో ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో తనే పేరు చర్చకు వచ్చేలా రాజకీయం చేశారనే అభిప్రాయం జిల్లా టీఆర్ఎస్‌ వర్గాల్లో ఉంది. ఇప్పుడు తన కుమారుడి పొలిటికల్‌ ఎంట్రీ ఉంటుందని పరోక్షంగా గుత్త చేసిన వ్యాఖ్యలతో మరింత దుమారం రేగుతోంది.

మంత్రి కావాలనే ఆశతో టీఆర్ఎస్‌లో చేరిక..!
గతంలో టీడీపీ, కాంగ్రెస్‌లో ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి. ఎంపీగా కొనసాగుతున్న సమయంలో టీఆర్ఎస్‌లో చేరారు. మంత్రి కావాలనే ఆశతోనే టీఆర్ఎస్‌లో చేరినట్టు ప్రచారం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచి కేబినెట్‌లో చేరాలని అనుకున్నారు. ఆ కోరిక ఇప్పటికీ తీరలేదు. ఎమ్మెల్సీని చేసిన సమయంలోనూ అమాత్య పదవి ఆశిస్తే.. శాసనమండలి ఛైర్మన్‌ను చేశారు. ఎమ్మెల్సీ పదవీకాలం ముగిశాక గుత్తా భవిష్యత్‌ ఏంటా అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే మరోసారి ఎమ్మెల్సీని చేసి.. మళ్లీ శాసనమండలి ఛైర్మన్‌ పదవి అప్పగించారు గులాబీ బాస్‌. దాంతో మంత్రి అవ్వాలనే కోరిక తీరలేదు. తనకు కేబినెట్‌లో చోటు దక్కకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్‌ నేతలే అడ్డుకున్నారనేది గుత్తా అనుమానం. ఇప్పుడు పార్టీ నేతలతో గ్యాప్‌. వెరసి గుత్తా పరిస్థితి తీరని వేదనగానే మిగిలిపోయింది. ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈ సైలెంట్‌ వార్‌ ఎలాంటి మలుపు తీసుకుంటుందో అని చర్చ నడుస్తోంది.