ఆ జిల్లాలో నిర్వహించిన రైతు మహాధర్నాలో టీఆర్ఎస్ నేతలు వర్గపోరుకే ప్రాధాన్యం ఇచ్చారా? పెద్దల హితోక్తులు చెవికి ఎక్కించుకోలేదా? మిగతావాళ్లు కలిసి సాగినా.. అక్కడ వేర్వేరు శిబిరాలు ఎందుకు వెలిశాయి? ఇంతకీ ఏంటా జిల్లా? లెట్స్ వాచ్!
కలిసి నిరసనల్లో పాల్గొన్నది కొందరేనా?
కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమాలను సక్సెస్ చేయడానికి టీఆర్ఎస్ నేతలు పోటీపడ్డారు. ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు నాయకులు తమ మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టుకున్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో అంతా కలిసికట్టుగా సాగాలని పార్టీ పెద్దలు చెప్పినా.. అది పాటించింది కొందరే. కలిసి నినాదాలు చేసినా.. నొసటితో ఒకరినొకరు వెక్కిరించుకున్న సీన్లే ఎక్కువగా కనిపించాయి.
వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే నరేందర్ వర్సెస్ ఎమ్మెల్సీ సారయ్య..!
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాత్రం టీఆర్ఎస్ నేతల మనసులు.. చేతులు కలవలేదు. రెండు నిరసన శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ వర్గాల్లో చర్చగా మారింది తూర్పు నియోజకవర్గం. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సీనియర్ పార్టీ నాయకులు ప్రదీప్‌రావు, రాజనాల శ్రీహరి తదితరులకు పడటం లేదు. దీంతో రెండు వర్గాలుగా విడిపోయారు. ఎమ్మెల్యే నరేందర్ నేతృత్వంలో నాయుడు పెట్రోల్ పంపు దగ్గర రైతులతో కలిసి ధర్నా చేస్తే.. ఎమ్మెల్సీ సారయ్యే ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వ్యతిరేకులంతా వరంగల్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఒకే నియోజకవర్గంలో తూర్పు పడమరగా విడిపోయారు నాయకులు.
వేర్వేరు నిరసన శిబిరాలపై ఎవరి వాదన వారిదే..!
ఎమ్మెల్యే నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వేచి చూసి.. తప్పనిసరి పరిస్థితుల్లో మరోచోట నిరసన చేపట్టామన్నది సారయ్య వర్గం వాదన. అయితే ఎమ్మెల్యేతో తమకు పడదని చెప్పడానికే వేరు కుంపటి పెట్టారని నరేందర్ వర్గం కౌంటర్ ఇస్తోంది. నిరసన విషయంలో పార్టీ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. ఈ విధంగా ఒంటెద్దు పోకడలకు వెళ్లడం టీఆర్ఎస్ వర్గాలను విస్మయ పర్చిందట. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లోనూ నేతల మధ్య వర్గవిభేదాలు ఉన్నా.. రైతు మహా ధర్నాలో మాత్రం వాటిని కాసేపు పక్కన పెట్టేశారు. వరంగల్ తూర్పులో మాత్రం ఆ సీన్ కనిపించలేదు.
‘తూర్పు’లో నేతల ఎడముఖం పెడముఖంపై పార్టీలో చర్చ..!
ఒకరంటే ఒకరు గిట్టని నాయకులు మాత్రం కాస్త లౌక్యంగా వ్యహరించారు. స్టేషన్ ఘనపూర్‌లో ఎమ్మెల్యే రాజయ్యతో పడని మాజీ మంత్రి కడియం శ్రీహరి.. పరకాల ధర్నాలో పాల్గొన్నారు. మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో విభేదాలు ఉండటంతో.. ఎంపీ మాలోతు కవిత.. నర్సంపేట ధర్నాలో దర్శనం ఇచ్చారు. భూపాలపల్లిలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిలకు పడకపోయినా.. రెండు వర్గాలు ఒకే శిబిరంలో కూర్చున్నాయి. తమ మధ్య గ్యాప్ వచ్చిందన్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేలా చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావులు హన్మకొండ ఏకశిలా పార్క్‌లో ఏర్పాటు చేసిన మహాధర్నాలో కలిసి పాల్గొన్నారు. ఒక్క వరంగల్ తూర్పులోనే నేతల మధ్య ఎడముఖం పెడముఖం కనిపించింది. ఈ పరిణామాలు పార్టీ పెద్దల దృష్టికి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. మరి.. నేతల మధ్య సయోధ్యకు చొరవ తీసుకుంటారో.. మాట వినని నాయకులకు క్లాస్ తీసుకుంటారో చూడాలి.
