ఆ మాజీ మంత్రి ఫ్యూచర్ పాలిటిక్స్‌పై క్లారిటీకి వస్తోందా? సేఫ్‌గా ఉండేలా స్కెచ్ వేస్తున్నారా? సైకిల్‌తో గ్లాస్ జత కడితే ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నారా? గతంలో ప్రాతినిధ్యం వహించిన సీటులో అదేపార్టీ నుంచి.. కుటుంబ సభ్యులను బరిలోకి దించే పనిలో మాజీ మంత్రి ఉన్నారా?
గత ఎన్నికల్లో పెద్దాపురంలో నరసింహం భార్య వాణి ఓటమి
తోట నరసింహం.. మాజీ మంత్రి. 2004, 2009లలో కాంగ్రెస్ జగ్గంపేట ఎమ్మెల్యే. 2010-2014 మధ్య ఉమ్మడి ఏపీలో మంత్రి. విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో పసుపు కండువా కప్పుకుని తొలిసారి లోక్‌సభ బరిలో నిలిచి.. గెలిచారు. 2019 ఎన్నికల ముందు ఫ్యాన్ కింద చేరిపోయారు. కుటుంబ సభ్యులను జగ్గంపేట అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలని విశ్వ ప్రయత్నాలు చేసినా.. అప్పుడున్న రాజకీయ పరిస్థితులు అవసరాలు దృష్ట్యా నరసింహం భార్య వాణికి పెద్దాపురం టికెట్ ఇచ్చింది వైసీపీ. కానీ.. అక్కడ ఫ్యాన్ పార్టీలో ఉన్న ఆధిపత్య పోరు విభేదాలతో ఆమె ఓడిపోయారు. 2019 ఎన్నికల తర్వాత తోట ఫ్యామిలీ సైలెంట్ అయ్యింది. పొలిటికల్ స్క్రీన్ పై ఎక్కడ కనిపించడం లేదు. 2 నెలల క్రితం వైసీపీ నేతలు ఆయనను వెళ్లి కలిశారు. తిరిగి యాక్టివ్ అవుతానని చెప్పారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇంతలో రాజకీయ పరిణామాలు మార్పులతో తోట నరసింహం పునరాలోచనలో పడినట్టు టాక్. టిడిపి జనసేన పొత్తు కుదిరితే ఎలా ఉంటుందని వివరాలు సేకరిస్తున్నారట. పొత్తులో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుంది అని తెలుసుకునే పనిలో పడ్డారట.
కాకినాడ ఎంపీ సీటుపై టీడీపీలో కర్చీఫ్ వేస్తున్నారా?
వచ్చే ఎన్నికల్లో కుటుంబ సభ్యులును జగ్గంపేట బరిలో నిలపాలని తోట అనుకుంటున్నారట. కానీ అది అంత ఈజీగా కనిపించడం లేదు. పొత్తు ఉంటే.. ప్రస్తుతం టిడిపి ఇంఛార్జిగా ఉన్న జ్యోతుల నెహ్రూ అక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో గతంలో పోటీ చేసిన కాకినాడ లోక్‌సభ సీటులో తన భార్య వాణి లేదా కొడుకు శ్రీరాంజీని పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని లెక్కలు తీస్తున్నారట. తనను కలవడానికి వచ్చే జగ్గంపేటకి చెందిన అనుచరులు కార్యకర్తలు దగ్గర వాటిపైనే మాట్లాడుతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నప్పటికీ జిల్లాలో మాత్రం జనసేన టిడిపి పొత్తు ఉంటే కచ్చితంగా ప్రభావం ఉంటుందనే లెక్కలు వేస్తున్నారు మాజీ మంత్రి. పైగా తనతో జిల్లాకి చెందిన టిడిపి నేతలు సఖ్యతగానే ఉంటారని.. వారితో వచ్చిన ఇబ్బందేం లేదని అంటున్నారట.
టీడీపీలో కాకినాడ ఎంపీ సీటుకు అభ్యర్థి లేరా?
తోట వాణి తండ్రి మెట్ల సత్యనారాయణ టిడిపిలో కీలక నేతగా పనిచేశారు. ఆ తర్వాత ఆమె సోదరుడు మెట్ల రమణబాబు సైతం టిడిపిలోనే ఉన్నారు. ఎలాగూ.. కాకినాడ ఎంపీగా టిడిపికి అభ్యర్థి లేరని.. జనసేనలో కూడా ఆస్థాయి నేతలు ఎవరు కనిపించడం లేదు కదా అని అడుగుతున్నారట నరసింహం. కాకినాడ పార్లమెంటు పరిధిలో కాపు ఓటర్ల ప్రభావం కచ్చితంగా ఉంటుందని.. టిడిపి తరఫున బరిలో నిలిచి, జనసేన సపోర్టుతోపాటు తన ఓన్ ఇమేజ్ కలిసొస్తుందని లెక్కలు వేస్తున్నారట. కొద్ది నెలల ముందే కదా పార్టీ మార్పు ఉండబోదని క్లారిటీ ఇచ్చారని ఎవరైనా అడిగితే.. రోజులన్నీ ఒకలా ఉంటాయా అని ఎదురు ప్రశ్నిస్తున్నారట. రాజకీయాలకు అనుగుణంగా మనమూ మారాలని.. వెయిట్ అండ్ సీ అని శ్రుతి కలిపేస్తున్నారట నరసింహం. మూడ్ ఆఫ్ పీపుల్‌ని బట్టి ఫాలో అయిపోవాలి కదా అని క్లారిటీ ఇస్తున్నారట. మరి తోట లెక్కలు ఏ మేరకు పని చేస్తాయో చూడాలి.