మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్లను కాదని కొత్తగా వచ్చినోళ్లను అందలమెక్కిస్తున్నారా?రహస్య సమావేశాలతో క్యాడర్నీ బలహీనపరుస్తున్నారా? మునుగోడు కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి… బీజేపీ చేరాలని నిర్ణయించుకున్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. పోతూ పోతూ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కు సరైన ప్రత్యామ్నాయం బీజేపీయే అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్… కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో పడేసింది. వివాదం కాస్త… కాంగ్రెస్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డిగా మారిపోయింది. మరోవైపు… సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.
చండూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చింది. అయితే, రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత అకస్మాత్తుగా తెరపైకి వచ్చారు కొందరు కాంగ్రెస్ నేతలు. నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ కలకలం రేపింది.
చండూరు సభ రోజున భారీ ఫ్లెక్సీలతో హడావిడి చేశారు చిల్లమల్ల కృష్ణారెడ్డి. అయితే, మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేయడం పార్టీలో కలకలం రేపింది. ఆశావాహుల్లోనూ ఆందోళన మొదలైంది.
గతంలో మునుగోడు టికెట్ ఆశించి… రాజగోపాల్ రెడ్డి రాకతో వెనక్కి తగ్గిన వాళ్లల్లో ఇప్పుడు ఆశలు చిగురించాయి. పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేసి గెలవాలని ఆశిస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి, ఓయూ విద్యార్థి జేఏసీ నేత, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పున్నా కైలాష్ నేత, చండూరు జెడ్పిటిసి పల్లె రవికుమార్-కల్యాణి తదితరులు నియోజకవర్గంలో క్యాడర్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. మునుగోడు టికెట్ ఆశిస్తున్న వీరంతా, చల్లమల్ల కృష్ణారెడ్డి తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
చల్లమల్ల కృష్ణారెడ్డి ఏర్పాటు చేస్తున్న సమావేశాలు పార్టీకి నష్టం కలిగిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కలసి పనిచేయాల్సిన సందర్భంలో పార్టీ కార్యకర్తలతో వేరుకుంపట్ల పెట్టడం ఏమిటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పార్టీలోకి కొత్తగా వచ్చిన కృష్ణారెడ్డి హడావిడి చేయడంపై మండిపడుతున్నారు. ఆయనకు ఫోన్ చేసి నిలదీసినట్టు సమాచారం. అంతేకాదు… చల్లమల్ల వ్యవహార శైలిపై పార్టీ పెద్దలకు సైతం కొందరు ఆశావాహులు కంప్లైంట్ చేశారు.
చల్లమల్ల కృష్ణారెడ్డి లాంటి వాళ్ల వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమౌతోంది. దీని వల్ల కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమవుతుందంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో అనైక్యత… బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు అస్త్రంగా మారే అవకాశంలేకపోలేదు.
.