Site icon NTV Telugu

Off The Record: హైవే మీద టోల్గేట్లలో ఓట్ల వేట నడుస్తుందా?, సంక్రాంతి సాక్షిగా కొత్త పొలిటికల్ గేమ్?

Toll Free Highway

Toll Free Highway

Off The Record: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. సంక్రాంతి పండగ సమయంలో హైదరాబాద్- విజయవాడ హైవే మీద విపరీతమైన రద్దీ ఉంటోంది. వాహనదారులు టోల్ ప్లాజాల దగ్గర గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వచ్చి నరకం చూస్తున్నారు. ఆ ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రతిపాదన చేసింది తెలంగాణ సర్కార్‌. పండగ టైమ్‌లో హైవే మీద టోల్‌ఫీజు వసూలును ఆపేసి.. వాహనాలను పూర్తిగా వదిలేయాలని, అప్పుడే ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పుతాయంటూ….కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

READ ALSO: Off The Record: ఆదిలాబాద్ రైల్ బ్రిడ్జిల నిర్మాణం చుట్టూ రాజకీయం

సంక్రాంతి పండుగ వేళ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా హైదరాబాద్ – విజయవాడ హైవే పై టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే ఏర్పాటుకు కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా తెలిపారు. పండగకు ముందు 9నుంచి పూర్తయ్యాక 18 వరకూ టోల్ ఛార్జ్‌లు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి లేఖ రాశారు కోమటిరెడ్డి. ఆ తేదీల్లో టోల్‌ చార్జీల భారాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖే భరిస్తుందని, ఆ మేరకు కేంద్రానికి చెల్లిస్తుందని, ఆ మేరకు అనుమతి ఇవ్వాలన్నది లేఖ సారాంశం. అయితే… దీని వెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా అన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌. పైకి చూడ్డానికి ట్రాఫిక్‌ నియంత్రణ కోసం అన్నట్టు కనిపిస్తున్నా….ఇంటర్నల్‌ లెక్కలు వేరే ఉన్నాయని అనుమానిస్తున్నారు కొందరు.

సంక్రాంతి పండగ సమయంలో నేషనల్ హైవేలపై ట్రాఫిక్ నింత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఇటీవల సచివాలయంలో సమీక్ష నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి. అప్పుడు కూడా టోల్ ఫీజు మినహాయింపు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. సాధారణంగా…. సంక్రాంతి టైంలో ఎక్కువ మంది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తుంటారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డ, ఆంధ్రా మూలాలున్న వాళ్ళే ఇందులో అధికం. సరిగ్గా ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కొత్త ఆలోచనకు పదునుపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగబోతున్నాయి. అలాగే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌కార్పొరేషన్‌ ఎలక్షన్స్‌ సైతం ఈ ఏడాదిలోనే జరుగుతాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రా మూలాలున్న వారి ఓట్లను టోకుగా కొల్లగొట్టేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇలాంటి గిమ్మిక్కులు చేస్తోందంటూ విమర్శిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రానికి లేఖ రాశారని, ఒక వేళ అట్నుంచి ఒప్పుకోకుంటే… కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ సహకరించలేదంటూ ప్రచారం చేసే ప్లాన్‌ కూడా ఉందని అనుమానిస్తున్నారు కొందరు. టోల్‌ మినహాయిస్తే తమ క్రెడిట్‌, మినహాయించకుంటే… బీజేపీని కార్నర్‌ చేయడమన్న ద్విముఖ వ్యూహం కూడా ఇందులో ఉండి ఉండవచ్చన్నది కొందరి అనుమానం. ఇక్కడే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌ కూడా కొత్త ప్రతిపాదన చేస్తూ మైలేజ్‌ గేమ్‌లోకి ఎంటరైపోయింది. సంక్రాంతి పండగ సమయంలో కేవలం హైదరాబాద్‌- విజయవాడ హైవే మీదనే కాకుండా…రాష్ట్రంలోని అన్ని టోల్‌ప్లాజాల దగ్గర రుసుమును ఎత్తేయాలని డిమాండ్ చేస్తోంది. సమ్మక్క – సారలమ్మ జాతర జరిగే సమయంలో కూడా.. టోల్ ఫీజు వసూలు చేయవద్దని ప్రభుత్వానికి సూచించారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే… పండగ సమయంలో ప్రయాణాలు చేసే వారికి భారీ ఊరట కలిగే అవకాశం ఉన్నా… అసలీ ప్రతిపాదన అమల్లోకి రావడం ఎంతవరకు సాధ్యమన్నదే బిగ్‌ క్వశ్చన్‌. ఇది కేవలం పొలిటికల్‌ గేమ్‌గానే మిగిలిపోతుందా? ఎవరు గెయిన్‌ అవుతారు, ఎవరు కార్నర్‌ అవుతారు? రేపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇది ప్రచార అస్త్రం అవుతుందా అన్నది ఆసక్తి కరంగా మారింది.

READ ALSO: BCCI vs BCB: BCCI తో గొడవ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కొంప ముంచబోతుందా?

Exit mobile version