OTR: ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ… పథకాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అధికారులు పెడదోవ పడుతున్నారు. ఇతరులకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఉద్యోగులు కొందరు ఘోరమైన తప్పులు చేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు…. ఏకంగా పదుల సంఖ్యలో ఎంప్లాయిస్ డబుల్ జీతాలు తీసుకుంటున్న ఉదంతం తెలంగాణలో వెలుగుచూసి అవాక్కయ్యేలా చేసింది. చేస్తున్న ఒక ఉద్యోగానికే సకాలంలో జీతాలు రాక లక్షల మంది అల్లాడుతుంటే… వీళ్ళు ఏకంగా నెలనెలా ఠంచన్‌గా ఒక ఉద్యోగానికి ప్రభుత్వం నుంచి రెండు జీతాలు ఎలా తీసుకోగలుగుతున్నారన్న చర్చ గట్టిగానే జరుగుతోంది. ఏళ్ళ తరబడి అలా ఎలా జరుగుతోందంటూ సాటి ఉద్యోగులే ముక్కున వేలేసుకుంటున్నారు. డబుల్ శాలరీ లిస్ట్‌లో రెవెన్యూ శాఖలో ఉన్నతస్థాయి ఉద్యోగి ఒకరు.. నెలనెలా లక్షకు పైనే డ్రా చేస్తున్నారు. పోలీసు శాఖలో మరో ఉద్యోగి.. లక్షన్నరకుపైగానే అందుకుంటున్నారు. ఇద్దరి పేర్లు, వివరాలు వేర్వేరు. కానీ ఆధార్ నంబర్ మాత్రం ఒక్కటే. అదెలా సాధ్యమైందంటే… అందరివీ బ్లాంక్ ఫేస్‌లే. ఈ రకంగా ఒకరిద్దరు కాదు.. 40 ఆధార్ నంబర్లపై 80 జీతాలు ప్రతి నెల దర్జాగా తీసుకుంటూ… పాపం పండి అడ్డంగా బుక్కైయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా.. ఇలా రెండు శాఖల్లో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులందర్నీ ఆర్థిక శాఖ గుర్తించింది. వారంతా రెగ్యులర్ ఎంప్లాయిసేనని, ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు ఒక్కొక్కరు లక్షన్నర నుంచి 5 లక్షల వరకు వేతనాల కింద పొందారని తేల్చింది. ఇప్పుడు ఈ వ్యవహారం సచివాలయంలోనూ, రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
దీనిపై అంతర్గత విచారణకు ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు . వారంలో నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించి మూడు వారాలవుతున్నా… ఇంత వరకు అతీగతీ లేదు. ఒక్కటంటే ఒక్క శాఖ నుంచి కూడా స్పందన లేకపోవడంతో కొత్త డౌట్స్ పెరుగుతున్నాయి. ఉద్యోగులే మోసానికి పాల్పడ్డారా? లేక ఆర్థిక శాఖలోని కొందరి ప్రమేయం ఏమైనా ఉందా? అదీఇదీగాక.. ఏదైనా వ్యవస్థలో సాంకేతిక తప్పిదం జరిగిందా అన్న కోణాల్లో విచారణ జరుగుతోందట. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమీకృత ఆర్థిక నిర్వహణ, సమాచార వ్యవస్థలోని వివరాలపై ఇటీవల పరిశీలన మొదలైంది. అందులో భాగంగా రెగ్యులర్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, తాత్కాలిక సిబ్బంది ఆధార్ వివరాలను పరిశీలిస్తున్నారు. ఆ క్రమంలోనే ఒకే ఆధార్ నంబర్ పై వేర్వేరు పేర్లతో, వేర్వేరు శాఖల్లో ఉద్యోగులు ఉన్న అంశం బయటపడింది. అంతేకాదు.. ఒకే ఆధార్ మీద ఒకచోట పురుషుడిగా, మరోచోట మహిళగా.. ఇంకొన్ని కేసుల్లో ఒకే ఆధార్ మీద రెండు వేర్వేరు మతాల పేర్లతో ఉద్యోగులు జీతాలు అందుకుంటున్నట్టు వెల్లడైంది. వారంతా రెగ్యులర్ ఉద్యోగులే కావడం ఇంకా ఆసక్తికరంగా మారింది. ఒకే ఆధార్‌తో రెండు శాఖల్లో, రెండు ఐడీలతో వేతనాలు పొందుతున్న ఉద్యోగులు పోలీసు, రెవెన్యూ, విద్యా, పంచాయతీరాజ్, ప్రజారోగ్య శాఖల్లో ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు గుర్తించారు. ప్రభుత్వ నిధులను దారిమళ్లించడానికి కొందరు అధికారులు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు కలిసి సృష్టించిన ఈ మోసాలపై ప్రభుత్వం ప్రస్తుతం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
తాజా వ్యవహారంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైందని అంటున్నారు. గతంలో ఓ జిల్లాలో డబుల్ శాలరీ స్కామ్ జరిగింది. అప్పట్లో కోటీ 40 లక్షల రూపాయల మేర దుర్వినియోగం బయటపడింది. IFMIS లోని ఆ ఐడీలకు నకిలీ బ్యాంక్ ఖాతాలను లింక్ చేసి, తన స్వంత మొబైల్ నంబర్‌ను అనుసంధానించి అదనంగా జీతం పొందారు. రెగ్యులర్‌లో కొద్ది మంది, ఔట్ సోర్సింగ్‌లో వేల మంది… మొత్తంమీద రాష్ట్రవ్యాప్తంగా 6,000 మందికి పైగా బోగస్… ఉద్యోగులని అప్పట్లో తేలింది. అలాంటి వాళ్ళ వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా దాదాపు 600 కోట్ల నష్టం వాటిల్లినట్టు తేల్చారు. ఇప్పుడు కూడా మూడు నెలల డేటానే బయటికి వచ్చినప్పటికీ… ఈ బాగోతం చాలా రోజుల నుంచి జరుగుతున్నందున సమగ్ర నివేదికకు ఆదేశించింది సర్కార్. విచారణలో… భౌతికంగా విధుల్లో లేని సిబ్బంది వివరాలను నిర్ధారించుకుని, వారి పేర్లను ప్రభుత్వ పే రోల్ నుంచి తక్షణమే తొలగిస్తున్నారు. అలాగే… వీరి నుంచి ఇన్నాళ్లు డ్రా చేసిన మొత్తం శాలరీ రికవరీకి ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు, అవకతవకలు జరగకుండా ఇందుకు కారణమైన అందరిపైన క్రిమినల్ చర్యలకు ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. కానీ… ఆయా శాఖల్లో కీలకంగా ఉన్న వ్యక్తులతో కలిసి ఈ తప్పులు చేసినందున అసలు దోషులు బయటపడటం లేదని తెలుస్తోంది. సాధారణంగా ఆర్థిక శాఖ సహాయ సహకారాలు లేనిదే ఒక్క రూపాయి కూడా ఇతరుల చేతికి వెళ్ళదని, అలాంటిది ఇంత పెద్ద స్కామ్ జరిగిందంటే… కచ్చితంగా వాళ్ళ ప్రమేయం ఉండి ఉంటుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఉన్నతాధికారులు సైతం ఇంటిదొంగల్ని కాపాడే ప్రయత్నంలో ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న క్రమంలో… అసలు దోషులకు శిక్షలు పడతాయా అన్న సందేహాలు పెరుగుతున్నాయి సచివాలయ వర్గాల్లో.

